“చక్రం” చిత్రంలో పాటలకి సిరివెన్నెల వారికి మరొక నంది వచ్చింది. ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పాట “జగమంత కుటుంబం నాది”. కవి యొక్క అంతరంగ ఆవిష్కరణ కవి తనకి తానే చేసుకోవడం ఈ పాటలో విషయం. ఈ పాట విని, స్పందించి, ఆ స్పందనకి సమాధానంగా దర్శకుడు కృష్ణవంశీ “చక్రం” సినిమా తీశారని కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ పాటే ముందు గుర్తు రావడంలో ఆశ్చర్యం లేదు.
ఇక తర్వాత గుర్తొచ్చే పాటలు “ఒకే ఒక మాట”, “కొంచెం కారంగా” మొదలగు ప్రేమ గీతాలు. చంద్రబోస్ రాసిన “నా పేరు చక్రం” పాట కూడా బానే వినపడింది. అయితే అంతగా వినబడని పాట – “రంగేళీ హోలీ” అన్నది. tune అంత బాగుండకపోవడం, routine beat ఉండడం ఈ పాట అంతగా వినబడకపోవడానికి కారణం కావొచ్చు. సినిమా flop అవ్వడం కూడా కొంత కీడు చేసిందీ పాటకి.
నా దృష్టిలో ఈ పాట వినబడాల్సిన పాట, అందరూ వినాల్సిన పాట. ఎందుకంటే మన పండగలకి సిరివెన్నెల అందించే తాత్త్విక భాష్యం ఈ పాటలో కనిపిస్తుంది. “పండంటే ఇదీ, ఆ పండగ నుంచి మనం నేర్చుకోవలసినది ఇదీ” అంటూ సిరివెన్నెల వారు అందరికీ అర్థం అయ్యేటట్టు పాఠం చెబుతారు. మన పండుగలు అన్నీ ఆరోగ్యకరమైన సామాజిక జీవనానికి సూత్రాలు లాంటివి. మనలోని “నేను” ని కాస్త పక్కన పెట్టి “మేము” కి చోటిచ్చి, తనలో అందరినీ, అందరిలో తననీ చూసుకోవడం మన పండగల ఉద్దేశ్యం. పండగంటే సంవత్సరంలో మరొక సెలవు దినం, మొక్కుబడిగా చేయాల్సిన పూజలూ గట్రా చేసేసి, ఓపికుంటే పిండివంటలు చేసుకుని (లేకుంటే సాయంత్రం hotel ఉండనే ఉంది!), TV లో ప్రత్యేక “సినిమా కార్యక్రమాలు” చూస్తూ గడిపెయ్యడమే అన్నట్టు మారిపోయిన ప్రస్తుత పరిస్థితులలో ఈ పాట చాలా అవసరమైనది –
కోరస్:
చిన్నా పెద్దా అంతా పండుగ చెయ్యాలంట
తీపీ చేదూ అంతా పంచిపెట్టాలంట
పల్లవి:
రంగేళీ హోలీ
హంగామా కేళీ
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి!
రవ్వల రించోలి
సిరిదివ్వెల దీవాలీ
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి!
పంచాంగం చెబితేగానీ పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా?
పండగ ఎప్పుడు రమ్మంటే అప్పుడూ రావాలి అని చెప్పడం ద్వారా, మనకోసం పండగ ఉంది గానీ, పండగ కోసం మనం కాదని గుర్తుచెయ్యడం.
చరణం 1:
తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది
గడపలు అన్నీ జరిపి, ఆ గణపతి పండుగ జరిపి
నిమజ్జనం కాని జనం జరిపే పయనం నిత్య భద్రపదమౌతుంది
లోకుల చీకటి తొలిగించే శుభసమయం కోసం వెతికే
చూపులు దీపాలుగ జేసే జాగరణే శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చే రోజొకటుండాలా
చుట్టు ఇందరు చుట్టాలుంటే సందడిగా లేదా!
చరణం 2:
తల్లుల జోలపదాలై, గొల్లల జానపదాలై
నరుడికి గీతాపదమై నడవడమంటే అర్థం కృష్ణ జయంతి
అందరి ఎండకి మనమే పందిరయే లక్షణమే
మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామనవమయింది
మనలో మనమే కలహించి మనలో మహిషిని తలద్రుంచి
విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటయింది
మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి
కొన్ని పండగలకి సిరివెన్నెల భాష్యం ఇక్కడ చూస్తాం. గొప్ప భావాలతో పాటూ చక్కని పద సౌందర్యం కూడా కనిపిస్తుంది. శబ్దాన్ని-అర్థాన్ని సమతూకంలో వెయ్యడంలో సిరివెన్నెల అందెవేసిన చేయి అని మరో సారి రుజువు చెయ్యడానికి!
ఈ పండగల సారాంశం ఏకత్వం. పైపై భేదాలు కనిపిస్తున్నా, మనలోని అంతర్లీనమైన మనిషితనం ఒకటే అని చెప్పడం. దానినే సిరివెన్నెల అంకెలని తీసుకుని ఎంత గొప్పగా చెప్తారో చూడండి:
ఒకటీ రెండంటూ విడిగా లెక్కడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకు పోతుంటే
లెక్కల కైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే!
నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్ళుంటామంతే
నిన్నూ నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒకటే!!
ఈ వాక్యాలు స్కూలు పిల్లలు అందరి చేతా వల్లెవేయించాలి. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళం అనుకుంటున్న మన లాంటి వాళ్ళని కూడా దగ్గర కూర్చోబెట్టుకుని కొత్త అంకెలు నేర్పించే మాస్టారులా సిరివెన్నెల కనిపిస్తారు. అంకెలని కేవలం పెద్ద పెద్ద జీతాలతోనో, ఆస్తుల వివరాలతోనో పోల్చుకుంటున్న ఈనాటి జనతకి అంకెల్లో మానవత్వాన్ని ఆవిష్కరించిన గొప్ప దార్శనికుడిగా సిరివెన్నెల ఎదురౌతారు.
మరి ఈ గురువుకి మీరు గురుదక్షిణ ఏమిస్తున్నారు?
బాగా రాస్తున్నారు 🙂 కొన్ని నేను రాయాలనుకున్నవి మీరు రాస్తున్నారు. ఇలాగే అందరికీ సిరివెన్నెల చలువను పంచిపెట్టండి.
“పంచాంగం చెబితేగానీ పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా?”. ఆహా! ఏంతటి పద ప్రయోగము. “ఆత్రేయ” గారి తర్వాత అంతటి “మన (సు) కవి” మన “సిరివెన్నల”. సామాన్య పదాలతొ అసామన్య భావమందించటం ఒక్క “సిరివెన్నల” గారికి మాత్రమే సాధ్యము. మన పండగల భిన్నత్వములొ ఏకతత్వము మరియు అంకెలతొ ఐకమత్యం చుపిన “సిరివెన్నల” గారికి నమఃస్సుమాంజలి. అందించిన మీకు శుభభినందనలు.
అంకెల్లో సిరివెన్నెల సూత్రం మనిషికి మరో వేదం అవ్వాలి.
–ప్రసాద్
http://blog.charasala.com
ఔను గురుదక్షిణ ఏమివ్వాలి?
ఈ అంకెల సూత్రాన్ని మననం చేసుకుంటూ చేయిస్తూ ఎవరికివారం మన చుట్టూ మనము అనే భావాన్ని పెంచి కాపాడుకోగలగడం కంటే మంచి గురుదక్షిణ వుంటుందా!
ఇలాంటి మంచిమాటలున్న పాటలు రాయడం ద్వారా గురువు గారు,
ఆ.. ఈ పాటేమంత బాలేదని వదిలేసిన మాకు దాని ప్రభావాన్ని గుర్తుచేసిన మీరు,
ఇది చదివి వదిలేయక గుర్తుంచుకొని కొంత ఆచరించడం ద్వారా మేము,
ఇలా మన మంతా ఈ మంచి వాతావరణాన్ని కొనసాగించడమే సిసలైన గురుదక్షిణ.
naaku chalam istamamdi ee paata.gurtuceasinamduku dhanyavaadalu