శ్రీరామరాజ్యం సంగీతం – ఓ ఉడత స్పందన

ఇళయరాజా పాటలంటే ఇష్టం ఉండడం వలన ఆయన చేసిన కొత్త ఆల్బంస్ వింటూ ఉంటాను, ఏదైనా ఓ మంచి పాట ఉంటుందేమోనని. ఇళయరాజా ఇప్పుడు చేస్తున్న పాటల్లో ఒకప్పటి గొప్పతనం లోపిస్తున్నా,వెతుకుతూ ఉంటే అప్పుడప్పుడు ఓ మంచి ముత్యం దొరుకుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఎవరికీ పెద్ద తెలియని "ధనం" అనే సినిమాకి చేసిన "కన్నయకు ఏది ప్రియమో" పాట ఎంతో నచ్చింది నాకు (ఇది 2008 లో తీసిన తమిళ సినిమా, ఈ మధ్యే తెలుగులో రిలీజ్ చేసినట్టు ఉన్నారు. రాగా లో తెలుగు ఆల్బం లేదు. తమిళ పాట ఇక్కడ వినొచ్చు – కన్నయ్య పాట – తమిళ్ . కృష్ణ గారు అందించిన తెలుగు పాట లింకు ఇక్కడ – కన్నయ్య పాట – తెలుగు). మొన్న "శ్రీ రామ రాజ్యం" సినిమా ఆడియో రిలీజ్ అయ్యిందంటే, సరే రాజా ఎలా చేశాడో చూద్దాం అని విన్నాను. నా స్పందనని పంచుకునే ప్రయత్నమే ఈ టపా.

ఇది ఆడియో రివ్యూ కాదు. నాకు సంగీతం గురించి బొత్తిగా తెలియదు, కేవలం ఆస్వాదించడం తప్ప. రివ్యూ కావాలంటే సోదరుడు కార్తీక్ ఎంతో చక్కగా రాసిన ఈ టపా చదవండి – కార్తీక్ రివ్యూ . సౌమ్య ఈ సినిమా పాటల గురించి రాసిన టపా ఇక్కడ- సౌమ్య రివ్యూ

మొదటి సారి విన్నప్పుడు ఏమంత గొప్పగా అనిపించలేదు పాటలు. ఓ 2-3 సార్లు వింటే కొన్ని నచ్చాయి. వినగా వినగా ఇంకా నచ్చే అవకాశం ఉంది, రహ్మాన్ పాటల్లా. ఏవో గొప్ప పాటలు చేసెయ్యాలి అన్న తపన కన్నా, లలితంగా, అందరికీ అందేలా, నచ్చేలా చెయ్యాలన్న ప్రయత్నం ఎక్కువ కనిపించింది. అసలు బాపూ సినిమాల తీరే అంత, ఓ గొప్ప కళాఖండం సృష్టిస్తున్నాం అన్న భేషజం లేకుండా సింపుల్‌గా ఉంటాయి. ఈ పాటలూ అలాగే ఉన్నాయ్. గీతరచయిత జొన్నవిత్తుల వారు కూడా తన పాండిత్యం ప్రదర్శించడం కాకుండా అలతి అలతి పదాలతో సరళమైన రచన చేశారు. మొత్తంగా ఈ సినిమా పాటలు నాకు బానే నచ్చాయి. అద్భుతం అనిపించలేదు కానీ చాలా మంచి ఆల్బం అనే అనిపించింది.

  • జగదానందకారకా – మొత్తం ఆల్బం విన్నాక ఈ పాటే నేను మొదట హం చేసింది. అయితే చిత్రంగా ఈ పాట నాకు మరీ నచ్చలేదు. ఓ రెండు సార్లు విన్న తర్వాత బాగుందనిపించింది. ఇది hit song of the album కావొచ్చు. బహుశా ఈ పాటని ఇళయరాజా రెహ్మాన్ స్టైలులో మొత్తం పాటని అందరిచేతా పాడించి మిక్స్ చేసినట్టు ఉన్నాడు. male/female, solo/chorus కాంబినేషన్ పాటంతా వినిపిస్తుంది.
  • శ్రీరామ లేరా – ఇది ఈ చిత్రానికి misfit అనిపిస్తుంది. పల్లవికి ఇచ్చిన ట్యూన్ ఆధునికంగా ధ్వనిస్తోంది. చరణాలు ఫరవాలేదు.
  • "ఇది పట్టాభిరాముని ఏనుగురా" అనే జానపద గీతం రెండు సార్లు వినిపిస్తుంది. ట్యూన్ చిన్నదే, బాణీ క్యాచీగానే ఉంది. జానపాద యాసతో పాడిన తీరులో అక్కడక్కడా కొంత సహజత్వం లోపించిన భావం కలిగింది.
  • "రామ రామ అనే రాజమందిరం" కూడా జానపద శైలిలో సాగిన పాటే. "రాజమందిరం", "రామసుందరం" లాంటి చక్కని పద ప్రయోగాలు, ఇంకా చక్కని భావాలు పొదిగారు జొన్నవిత్తుల (ఈ పాట సాహిత్యం గురించి సౌమ్య రాసిన టపా ఇక్కడ – సౌమ్య –రామరామ  ). ఈ పాటలోనూ ట్యూను హుషారుగా ఆకట్టుకునేలా ఉంది.
  • "కలయా నిజమా" అనే పాట శోకగీతం. పల్లవి గొప్పగా అనిపించింది, చరణం కొంత తేలిపోయింది. ఫీల్ కొంత తగ్గింది చరణంలో.
  • "సీతా సీమంతం" – మొదటిసారి విన్నప్పుడు బోర్ కలిగింది. వినగా వినగా బానే అనిపించింది. గాయని శ్రేయాఘోషల్ చక్కగా పాడినా ఎందుకో తన గొంతు ఇలాంటి పౌరాణిక చిత్రాలకి అంత అతకదన్న భావన కలిగింది.
  • "దేవుళ్ళే మెచ్చింది" & "రామాయణము" – ఇవి రెండూ రామాయణ కథని సంక్షిప్తంగా లవకుశలు పాడే పాటలు. చిత్రా, శ్రేయా గొప్పగా పాడారు. సాహిత్యం చాలా బాగుంది. సంగీతం కూడా సాహిత్య భావానికి తగినట్లు ఇళయరాజా చేశాడు (ఈ సినిమా పాటలన్నీ ముందు రచన, తర్వాత సంగీతం అనుకుంటా). ముఖ్యంగా ఈ చరణాలకి కుదిరిన సంగీత సాహిత్యం నాలో చాలా స్పందన కలిగించింది. ఈ సినిమాలోని ఇంకే పాటకీ ఇంత స్పందన నాకు కలగలేదు –

చెదరని దరహాసం

కదిలెను వనవాసం

వదిలి రాణివాసం

వచ్చె మగని కోసం

తండ్రీ మాట కోసం

కొడుకూ తండ్రి కోసం

భార్య మగని కోసం

లక్ష్మన్న అన్న కోసం

జనమంతా ఆక్రోశం

  • సీతారామ చరితం – ఇదీ లవకుశలు పాడే పాట అనుకుంటా. అయితే చిత్రా, శ్రేయా కాక అనితా, కీర్తనా అనే అమ్మాయిలు పాడారు. పాత లవకుశ సినిమాలో రామకథ మొత్తాన్ని ఒకే పల్లవి గల పాటలో చెప్పినట్టు గుర్తు. ఈ సినిమాలో మూడు పాటల్లో చెప్పారు. పాట చక్కగానే ఉంది.
  • గాలీ నింగీ నీరు – సీతని రాముడు వనవాసానికి పంపించేటప్పుడు వచ్చే పాట. ఈ శోక గీతాన్ని బాలు చాలా ఫీల్‌తో పాడారు. అయితే ఏడ్చినప్పుడు మాత్రం కృతకంగా అనిపించింది. జొన్నవిత్తుల సాహిత్యం ఈ పాటలో మరోసారి మెరిసింది.
  • ఎవడున్నాడు – ANR మాటలు, బాలూ గానం కలిసిన పాట. ANR గొంతులో (ఈయన వాల్మీకి పాత్ర అనుకుంటా వేసింది) గంభీరత లేకపోవడం మరి సరిపోతుందో లేదో. ట్యూన్ చాలా క్యాచీగా ఉంది.

ఇవి కాక ఇంకా కొన్ని శ్లోకాలూ, మంగళాలూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే మంచి ఆల్బం అనే చెప్పాలి. సినిమాలో చూస్తే ఈ పాటలు ఇంకా బాగుండే అవకాశం కనిపిస్తోంది. నా మటుకు సాహిత్యానిదే కొంత పైచేయి సంగీతం కంటే. ఈ సినిమా వలన జొన్నవిత్తుల, ఇళయరాజా ఇద్దరికీ మరిన్ని తెలుగు సినిమాలు చేసే అవకాశం వస్తే అది మంచి పరిణామమే!

రచయిత: Phanindra

I am an engineer by profession and a hobbyist writer. My literary interest started with analyzing lyrics of Telugu movie songs and I love Telugu lyricists Veturi and Sirivennela. I tried my hand at writing songs, poems and stories in Telugu. I also have an interest in spirituality/philosophy, self-help and management.

2 thoughts on “శ్రీరామరాజ్యం సంగీతం – ఓ ఉడత స్పందన”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: