యండమూరి వీరేంద్రనాథ్ గారు ఫేస్బుక్లో “ప్రిన్స్ రామవర్మ” పాడిన ఓ కృతిని పెట్టి (ఆ పాటను YouTube లో ఇక్కడ చూడొచ్చు), “మా అమ్మ చిన్నప్పుడు ఈ పాట పాడేది” అన్నారు. ఆ పాట “చందమామము చూచి వద్దామా” అన్నది. చాలా మంది ఈ పాటని మెచ్చుకున్నారు. ఆ లింకుని ట్విట్టర్లో “నాగరాజ్ పింగళి“ గారు పదే పదే మెచ్చుకోడంతో నేను ఈ పాట సంగతేదో చూచి వద్దామని వెళ్ళి వినగా చాలా బాగుందనిపించింది. ఆ సాహిత్యంలో ఏదో సొబగుంది, పాట ట్యూన్ చాలా చక్కగా ఉంది. వెరసి ఈ పాట వింటే మన మనసుని పట్టే పాటల లిస్టులో చేరింది.
ఈ పాట పుట్టు పూర్వోత్తరాలు ఏమిటా అని ఇంటర్నెట్లో ఆరాతీస్తే కొన్ని విషయాలు తెలిశాయి. ముఖ్యంగా హిందూ ప్రచురించిన ఆర్టికల్ ఉపయోగకరంగా ఉంది. ఈ పాటని రచించినది వాగ్గేయకారుడైన “శ్రీ యోగి నారేయణ యతేంద్ర“. కర్ణాటకలోని కైవర గ్రామానికి చెందిన ఈ మహాభక్తుడు తెలుగులోనే చాలా కృతులు రాశారుట. కర్ణాటకలోని “మేలుకోట” (దీనినే తిరునారాయణపురం అని కూడా అంటారుట) పట్టణంలో కొండపై వెలసిన “అమర నారేయణ స్వామి” ఇతనికి ఆరాధ్య దైవం.
పాట సాహిత్యాన్ని పరికిస్తే ఈ పాట మేలుకోటలో ఏటేటా జరిగే ప్రసిద్ధ ఉత్సవంలో స్వామి దివ్యమంగళ రూపాన్ని గూర్చి రాసినట్టుగా తోస్తోంది. పాట సాహిత్యం నెట్లో దొరకలేదు, రవివర్మ పాడిన దాంట్లో తెలుగు అంత స్పష్టంగా లేదు. కాబట్టి నాకు అర్థమైనంతలో సాహిత్యాన్ని, అర్థాన్నీ, పొందుపరుస్తున్నాను. తెలిసినవారు తప్పులని దిద్దగలరు. (సురేశ్ కొలిచాల గారు మొదలైన వారు తెలిపిన కొన్ని విషయాల ద్వారా ఈ వ్యాసంలో మార్పులు చేశాను. కామెంటులు చూడండి)
పాట సాహిత్యం:
చందమామను చూచి వద్దామా సదానందా (2)
తల్లడించే తామసులను వెళ్ళవేసి వేవేగ
ఒళ్ళుమరచి తారకమున తెల్లవారేదనక మనము
|| చందమామను చూచి వద్దామా సదానందా ||
పంచబాణుని పారద్రోలి కుంజరమ్ముల కూలవేసి
మంటి మింటి రెంటి నడుమ ఒంటి స్తంభపు మేడ మీద
|| చందమామను చూచి వద్దామా సదానందా ||
శత్రులార్గురి చెంతచేరక ఇంద్రియాదుల వెంటబోక
మట్టు తెలిసి మేలుకోట పట్టణంబున చేరి ఇపుడు
|| చందమామను చూచి వద్దామా సదానందా ||
చదువులన్నీ చదివిచదివీ చచ్చిపోయేదింతె గానీ
గుట్టు తెలిపే గురుడు గల్గితే చూడవచ్చును సులభమున్నదీ
|| చందమామను చూచి వద్దామా సదానందా ||
అమర నారేయణ స్వామి ఆదిగురుని బోధచేత
తలచినప్పుడె తనువులోన తప్పకుండా చూడవచ్చును
|| చందమామను జూచి వద్దామా సదానందా ||
అర్థాలు:
చందమామ = అమర నారేయణ స్వామి దివ్య ప్రసన్న వదనం కావొచ్చు. (కామేశ్వర రావు గారు ఇది బిందుచక్రం కూడా కావొచ్చారు. కామెంటు చూడండి)
సదానందా = నిత్యము ఆనందంలో ఉండేది/ఉండేవాడు. కవి తన మనసునే సంబోధిస్తూ ఉండవచ్చు. స్వామిని దర్శించుకుంటే కలిగే ఆనందం. బ్రహ్మానందం.
తల్లడించే = బాధపెట్టే
తామసులు = తమో గుణం కలవారు. అయితే ఇక్కడ “తల్లడించే తామసులు” అన్నది మనలోపలి చెడ్డగుణాల గురించి కావొచ్చు.
తారకము = తారకము అంటే కంటి పాప అన్న అర్థం ఉంది. “చందమామను తెల్లవారేదనక కంటిపాపలో చూద్దాం” అన్న అర్థం కావొచ్చు. తారకము అంటే ముక్తినిచ్చేది అనే అర్థంలో, “అన్నీ విడిచిన అవస్థలో ఒళ్ళుమరచి” అనే అర్థం కూడా తీసుకోవచ్చు.
పంచబాణుడు = మన్మధుడు, కామాధిపతి. మన్మధుడు అంటే శృంగారదేవుడని అనుకుంటాం కానీ, ఏ కోరికైనా కామమే. ఉదాహరణకి రోడ్డు మీద వెళుతూ ఓ మంచి కారుని చూసి మీరు “స్థంబించిపోవచ్చు” (నేటి భాషలో చెప్పాలంటే మైండ్ బ్లాంక్ అయిపోవడం), మీలో ఆ కారు కావలన్న “తపన” మొదలవ్వొచ్చు. మీరు “సమ్మోహితులై” ఆ కారు గురించే పదే పదే ఆలోచించి “శోషించి” పోవచ్చు (అంటే టైం మరియూ ఎనెర్జీ వేస్ట్ చేసుకోవడం అన్నమాట). ఇంకా శృతి మించితే ఉన్మాదంలో (అనగా పిచ్చి, కారుపై పిచ్చి) చిక్కుకోవచ్చు. ఈ ఉన్మాద, తపన, శోషణ, స్తంభన, సమ్మోహనములనే మన్మధుని పంచబాణాలుగా చెబుతారు.
కుంజరము = ఇక్కడ “కుంజరాలను కూలవేసి” అన్నది “అష్టమదాలను కూలవేసి” అన్న అర్థంలో వాడి ఉండవచ్చునని సురేశ్ కొలిచాల గారి ఊహ. అష్టమదాలంటే ధన మదం, కుల మదం, కండ (బల) మదం, పాండిత్య మదం, భోగ మదం, అధికార మదం, యౌవన మదం, రూప మదం.
మంటి = భూమి, మింటి = ఆకాశం, రెంటి మధ్యన ఉన్న ఒంటిస్తంభపు మేడగా వర్ణించినంది మేలుకోట కొండని కావొచ్చు. ఈ ఫొటో చూస్తే ఇదెంత చక్కని భావనో తెలుస్తుంది.
శత్రులార్గురు = ఆరుగురు శత్రువులు – అరిషడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు.
ఇంద్రియాదులు = ఇంద్రియాలు అంటే 5 senses అనుకోవచ్చు. ఇంద్రియాదులు అంటే ఇంద్రియాలు మొదలైనవి – అంటే మనసు, అహంకారం వంటివి అనుకుంటాను.
మట్టు = పరిమితి (limit) అన్న అర్థం తీసుకుంటే “తన పరిమితి తెలుసుకుని” అన్న అర్థం వస్తుంది. అంటే తాను అల్పుణ్ణి కాబట్టి స్వామిని ఆశ్రయించడం.
గురుడు = గురువు అని అర్థం ఉంది. పాటలో గురువుని రెండు సార్లు ప్రస్తావించారు. ఇక్కడ గురువు అంటే అమరనారేయణ స్వామా లేక కవి తన గురువుని ప్రస్తుతిస్తున్నాడా అన్నది తెలియదు.
తనువు = శరీరం
భావం:
ఓ మనసా, పద! చందమామ వంటి స్వామి మంగళ రూపాన్ని చూద్దాం.
బాధపెట్టే చెడ్డగుణాలని వెంటనే బయటకి నెట్టెయ్! పులకించిన భక్తిభావంతో తెల్లవారేదాకా మనం స్వామిని తిలకిద్దాం.
మన్మధుని పంచ బాణాల నుంచి తప్పించుకుని, , లోలోని అష్టమదాలని కూలదోసి కొండపై వెలసిన స్వామిని దర్శించుకుందాం.
అరిషడ్వర్గాలని జయించి, ఇంద్రియాదులనుంచి తప్పించుకుని, నీ అల్పత్వాన్ని ఎరిగి, పరమార్థాన్ని తెలిపే మన మేలుకోట పట్టణంలో వెలసిన స్వామిని చేరుకుందాం.
ఎన్ని చదువులు చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా చావుని చేరిపే అమరతత్త్వాన్ని పొందడం దుర్లభం. కానీ సులభమైన భక్తి మార్గం ఉంది, అమర నారేయణ స్వామిని సేవించుకో.
ఆ ఆదిగురువైన అమర నారేయణ స్వామిని భక్తితో తలచినంతనే నీకు తప్పకుండా స్వామి రూపం సాక్షాత్కరిస్తుంది.
tarakamu = tarimpacheyunadu, vupayamu
చాలా మంచి పాట. అయితే, ఇది ఈ మధ్య కాలంలో బాలమురళీకృష్ణగారు తయారు చేసిన బాణీ అయితే, మరి యండమూరి తల్లి గారు ఏ బాణీలో పాడేవారో? ఆకాశవాణిలో గాని ఇంకెక్కడైనా ఈ పాట ఇదివరకు ఎవరైనా విన్నారా?
పదాల విషయంలో ఫణీంద్ర ఊహలు చాలా వరకూ సరిగ్గానే ఉన్నట్లు నాకనిపిస్తోంది. ఈ పాట వింటూ సాహిత్యం చదువుతూ ఉంటే నాకు తట్టిన కొన్ని ఆలోచనలు:
1. తారకము అంటే కంటి పాప అన్న అర్థం కూడా ఉంది. “చందమామను తెల్లవారేదనక కంటిపాపలో చూద్దాం” అన్న అర్థంలో తారకము వాడాడేమో?
2. కుంజరం అంటే ఏనుగు అయినా, ఏనుగు అనే అర్థం వచ్చే పదాలనన్నీ “ఎనిమిది” అన్న అర్థాలలో వాడడం కద్దు. అష్టదిగ్గజాలు ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ ఉంటాయని గజ-, ఇభ-, కుంజర-, కుంభి-, సింధూర- అన్న పదాలను ఏనుగు అన్న అర్థంలోనూ, ఎనమిది అన్న అర్థంలోనూ వాడుతారు.
ఇక్కడ “కుంజరాలను కూలవేసి” అన్నది “అష్టమదాలను కూలవేసి” అన్న అర్థంలో వాడి ఉండవచ్చునని నా ఊహ. ఈ వివరణ కొంత డొంకతిరుగుడుగా అనిపించినా ఇక్కడ అయిదు బాణాల మన్మథుడు, ఆరుగురు శత్రువులు, అయిదు ఇంద్రియాలు వంటి సంఖ్యా పరమైన ఆలోచనలు కవిలో మెదలుతున్నాయన్నది స్పష్టమే కాబట్టి కుంజరమన్నది సంఖ్యా పరంగా వాడారని అనుకోవడంలో తప్పులేదు.
3. “మంటి మింటి రెంటి నడుమ ఒంటి స్తంభపు మేడ మీద” అన్న అన్వయం చక్కగా కుదిరింది. మేలుకోటలో చెలువరాయ స్వామి ఆలయం కొండ మీద ఒంటి స్తంభపు మేడలాగే కనిపిస్తుంది.
4. “పట్టు తెలిసి మేలుకోట పట్టణంబున …” అన్నది రామవర్మ మట్టు తెలిసి మేలుకోట పట్టణంబున …” అనే పాడారు. మట్టు- అంటే పరిమితి, limit అన్న అర్థాలు తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఉన్నాయి. తెలుగులో కూడా
మట్టుమర్యాదలేనివాడు he has no limits or decency.
మట్టుమీరవద్దు you must not go beyond bounds.
నా మట్టుకు నాకు ఇక్కడ “మట్టు తెలిసి” అంటే “తన పరిమితి తెలుసుకొని” మేలుకోట పట్టణం చేరమనే బోధిస్తున్నాడనే అనిపిస్తోంది.
5. “సులభమున్నదీ” “సులభమన్నదీ” కావచ్చు.
6. గురుడు- అన్నది మొదట సాధారణ నామవాచకం (common noun)గా వాడి, ఆపై ఆదిగురువు అమర నారేయణ స్వామి గురించి వాడాడనిపిస్తుంది. గుట్టు తెలిపే గురువు ఎవరైనా ఉంటే సులభమార్గం అన్నది తెలుస్తుంది. ఆదిగురువు అమర నారేయణ స్వామి బోధచేత ఆ సులభ మార్గాన్ని తప్పకుండా తెలుసుకోవచ్చును/చూడవచ్చును.
Phani,
Excellent job. Even I tried for a while to find more about this song. But initial search results didn’t yield me any results. And you did it. Appreciate your efforts in penning down the lyrics. Yes, as Suresh Kolichala pointed it out, it is “మట్టు తెలిసి మేలుకోట పట్టణంబున” not “పట్టు”. “Mattu” also means “Whereabhouts”. e.g : “nee guttumattulanni naaku telusu” means I know your secret whereabouts.
Thanks for sharing it with me 🙂
–Nagaraj Pingili
తారకము = “నక్షత్రము” అని అర్థం కనిపిస్తోంది కాని, అది ఇక్కడ సరిపోదు
—భవ తారకము కావొచ్చు గదా.
ఈ పాటలో భక్తికన్నా యోగవిద్యని గురించిన ప్రస్తావనే ఎక్కువ ఉన్నట్టుగా నాకనిపించింది. బహుశా ఇది నా ఊహే కావొచ్చు!
చందమామ – సహస్రార చక్రానికి కింద, ఆజ్ఞాచక్రానికి పైనా, బిందుచక్రమని ఉంటుంది. దాన్ని చంద్రునితో సూచిస్తారు. ఇక్కడ చందమామను చూసి రావడం అంటే బహుశా బిందుచక్రం వరకూ కుండలిని ఉద్దీపింప జేయడం అయ్యుండవచ్చు.
ఒళ్ళుమరచి తారకమున – తారకము అంటే ముక్తినిచ్చేది అనే అర్థంలో, “అన్నీ విడిచిన అవస్థలో ఒళ్ళుమరచి” అనే అర్థం కూడా తీసుకోవచ్చు.
మంటి మింటి రెంటి నడుమ ఒంటి స్తంభపు మేడ మీద – ఇది కూడా కుండలిని సూచిస్తుంది. కిందనున్న చక్రాలను భూమిగానూ, పైనున్న సహస్రారాన్ని ఆకాశంగానూ భావిస్తే, వెన్నెముక వాటిని కలిపే ఒంటిస్తంభం మేడ. దాని మీద వెలిగే బిందుచక్రం చందమామ.
తలచినప్పుడె తనువులోన తప్పకుండా చూడవచ్చును – నా మొత్తం వ్యాఖ్యకి కీలకమైన వాక్యం ఇదే! ఆ చందమామ ఎక్కడో లేదు మన దేహంలోనే ఉంది, అని కదా అర్థం. యోగసిద్ధి కలిగితే మనకి తలచినప్పుడల్లా ఆ చందమామను మన దేహంలోనే చూడవచ్చు అంటే, కుండలిని బిందుచక్రం దాకా ప్రయాణింప చెయ్యవచ్చు అని అర్థం చెప్పుకోవచ్చు.
ఈ సరికొత్త వివరణ అద్భుతంగా ఉంది. బిందుచక్రం గురించి మీ ద్వారా
తెలుసుకున్నాను. ధన్యవాదాలు.
అయితే పాటలో “పట్టు తెలిసి మేలుకోట పట్టణంబున చేరి ఇపుడు” అంటూ మేలుకోటని
ప్రస్తావించడం ఒకటే ఈ వివరణకి అంత పొసగట్లేదు.
G+ discussion with Suresh Kolichala: https://plus.google.com/u/0/112471478593252720484/posts/SqQACXeozfJ
కామేశ్వర్రావుగారిచ్చిన వివరణ సరిగ్గా ఉన్నది.
ఇక్కడ “మట్టు” అంటే గుట్టుమట్టుల్లోని మట్టు అని నా అభిప్రాయము. మట్టు అనగా మర్మము అనికదా!
ఆ తర్వాతి చరణంలోనే గుట్టు కూడా వాడబడింది.
@ప్రసాద్ చరసాల
“మట్టు” అంటే “పరిమితి” అన్న అర్థమే నిఘంటువుల్లో నాకు కనిపిస్తోంది. సురేశ్
కొలిచాల గారు చెప్పినది కూడా అదే. “మర్మము” అన్న అర్థం కూడా ఈ పాట పరంగా
సరిపోతోంది, కానీ “మట్టు” కి ఈ అర్థం ఉందో లేదో నాకు తెలీదు.
On Mon, Aug 24, 2015 at 9:20 AM "తెర"చాటు చందమామ wrote:
>
wow awesome blog
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg