“ఊపిరి” చిత్రానికి ఊపిరి సిరివెన్నెల రాసిన పాటలని చెప్పక తప్పదు. నిజానికి ఈ చిత్రానికి సిరివెన్నెల రాసిన పాటల్లో మరీ కొత్త భావాలు కానీ, వినూత్న ప్రయోగాలు కానీ పెద్దగా లేవు. ఆయన తన పాటల్లో తరచూ చెప్పే ఆశావహ దృక్పథం, మనిషితనం వంటి అంశాలే ఇక్కడా కనిపిస్తాయి. అయితేనేం హృదయానికి హత్తుకునేలా, బావుందనిపించేలా రాయడంలో సిరివెన్నెల కృతకృత్యులయ్యారనే చెప్పాలి.
సినిమాలో మొదటగా వినిపించే పాట “శంకర్ మహదేవన్” గాత్రంలో వినిపించే “బేబీ ఆగొద్దు” అన్నది. “గోపీ సుందర్” ఇచ్చిన ట్యూన్ అంతగా ఆకట్టుకునేలా లేదు, పైపెచ్చు ఆ “బేబీ” అని తరచూ అరవడం చిరాకు తెప్పించింది! అయితే జీవితాన్ని కారు ప్రయాణంతో పోలుస్తూ సిరివెన్నెల రాసిన చరణం మాత్రం మెరుస్తుంది. నిజానికి సిరివెన్నెల ఈ చరణంలో చెప్పినట్టు కారు నడిపితే డ్రైవింగ్ టెస్టు ఫెయిల్ అవ్వడమో, లేదా ఆక్సిడెంటు జరగడమో ఖాయం! కానీ జీవితాన్ని ఆయన చెప్పినట్టు నడిపిస్తే “లైఫ్ టెస్ట్” పాస్ అవుతాం, జీవితం ఓ ఆక్సిడంటుగా మారకుండా ప్రయోజకమౌతుంది –
అద్దం ఏం చూపిస్తుంది?
వెనకేదో ఉందంటుంది
మన కంటికి కనిపిస్తుందీ ముందున్నది!
బెల్టన్నది సీటుకి ఉంది
మదినెట్టా బంధిస్తుంది?
ఊహల్లో విహరిస్తుంటే…
దూసుకెళ్ళే ఈ జోరును ఆపే బ్రేకు లేదే!
దారులన్నీ మనవేగా, పోనీ ధీమాగా
తప్పైతే మళ్ళీ యూ-టర్న్ కొట్టేద్దాం!
జీవితాన్ని వివరించే పాట, నాకు ఆల్బంలో బాగా నచ్చిన పాట “ఒక లైఫ్” అన్నది. కార్తీక్ చక్కగా పాడిన ఈ గిటార్ ప్రాధాన్య గీతానికి ట్యూన్ కూడా బాగా కుదిరింది. చరణంలో సిరివెన్నెల ఎంతో ప్రతిభావంతంగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి, అవరోధాలను అధిగమించడానికి కావలసిన జ్ఞానబోధ చేసి ఉత్తేజపరుస్తారు –
ఏం? ఏం లేదని?
మనం చూడాలి గానీ
ఊపిరి లేదా ఊహలు లేవా?
నీకోసం నువ్వే లేవా?
చీకటికి రంగులేసే కలలెన్నో
నీ తోడై వస్తుండగా
ఒంటరిగా లేవని
ఆశకి కూడా ఆశని కలిగించేయ్!
ఆయువనేది ఉండేవరకూ
ఇంకేదో లేదని అనకు!
ఒక్కో క్షణమూ ఈ బ్రతుకూ కొత్తదే నీకు!
“విజయ్ ప్రకాష్” హృద్యంగా ఆలపించిన “నువ్వేమిచ్చావో” అనే బిట్ సాంగ్, జీవితాన్ని కొత్తగా ఆస్వాదించడానికి తోడ్పడిన స్నేహితుడి కోసం కృతజ్ఞతాపూర్వకంగా పాడిన గీతంలా తోస్తోంది. మొదటి రెండు వాక్యాలూ ఆకట్టున్నాయి –
నువ్వేమిచ్చావో నీకైనా అది తెలుసునా?
నేనేం పొందానో నా మౌనం నీకు తెలిపెనా!
“పోదాం ఎగిరెగిరిపోదాం” అంటూ సాగే హుషారు గీతం పర్యటనలకి విమానంలో ఎగిరిపోయే యాత్రికుల గీతం. ఇలాంటి పాటలో పర్యటన అంటే కేవలం వినోదయాత్ర కాదని, జీవితంలో నూతనోత్తేజం నింపుకోవడం అనీ, కొత్త అనుభూతులు పోగుచేసుకోవడం అనీ, కొత్త పరిచయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అనీ తెలియజెప్పే పల్లవి రాయడం ఒక్క సిరివెన్నెలే చెయ్యగలరు –
పోదాం ఎగిరెగిరిపోదాం
ఎందాకా అంటే ఏమో అందాం!
పోదాం ఇక్కణ్ణే ఉంటే
అలవాటై పోతాం మనకే మనం!
ఏ దారి పువ్వులే పరచి మనని రమ్మన్నదో ఆ దారిలో
ఎవ్వర్ని చూసినా నవ్వులే విరిసే హలో అనే హుషారులో!
“ఎప్పుడూ ఒక్కలా ఉండదు” అన్న పాట కూడా జీవితాన్ని వివరిస్తుంది, “ఒక లైఫ్” పాటలా. అయితే ఈ పాట ఒక రకమైన వేదాంత ధోరణిలో ఫిలసాఫికల్‌గా సాగుతుంది. సిరివెన్నెల రెండు చరణాలతో రాసిన పూర్తి నిడివి గల పాట ఇదొక్కట్టే ఈ సినిమాలో. మళ్ళీ ఈ పాటని కార్తీకే పాడాడు. జీవన గమనంలో కాదనలేని సత్యాలు రెండు – నిత్యం మార్పుని వెంటతెచ్చుకుని నడిచే “కాలం”, అనుబంధ బాంధవ్యాలతో, కష్టసుఖాలతో సాగే “పయనం” అన్నవి. ఈ రోజుని ఆస్వాదిస్తూనే అది ఇలాగే ఉండిపోవాలి అనుకోకూడదనీ, నిన్నటిని గుండెలో నింపుకుని రేపటిని స్వాగతిస్తూ సాగిపోవాలని సమయాన్ని జయించే చిట్కా సిరివెన్నెల చెబుతారు. పయనంలోని ఒడిదుడుకులని తట్టుకోడానికి గుండెనిబ్బరాన్ని, నిరంతరం తనని తానే అధిగమించుకునే ప్రయత్నాన్నీ, ఇబ్బందులని కూడా ప్రేమించే ధీమానీ సిరివెన్నెల బోధిస్తారు –
నీ ఊపిరే నీ తోడుగా
నీ ఊహలే నీ దారిగా
నిన్నే నువ్వు వెంటాడక
ఏ తీరం చేరవుగా
కష్టాలనే కవ్వించగా
కన్నీళ్ళనే నవ్వించగా
ఇబ్బందులే ఇష్టాలుగా
అనుకుంటే చాలు కదా!
ఇంత సీరియస్ పాటల మధ్య కాస్త తెరిపి ఇవ్వడానికా అన్నట్టు రెండు హుషారైన శృంగార గీతాలు ఉన్నాయీ ఆల్బంలో. సినిమా ఎంత ఉదాత్తమైనదైనా ఒక ఐటం సాంగు మటుకు ఉండాలి అన్నది తెలుగు సినిమాలలో తప్పనిసరి నియమం మరి! వేదాంతం చెప్పిన వెంటనే గీతాగోవిందం బోధించమంటే బావుండదని అనుకున్నారో ఏమో ఈ పాటలని సిరివెన్నెల చేత కాకుండా రామజోగయ్య శాస్త్రి గారి చేత రాయించారు. అలా చిన్న శాస్త్రి గారు, చిలిపి శాస్త్రిగా మారి రెండు రసగుళికలని పండించారు. ఈ రెంటిలో నన్ను అమితంగా ఆకట్టుకున్న పాట, “అయ్యో అయ్యో” అన్న సరసమైన యుగళ గీతం. ట్యూన్ ఇట్టే నచ్చేలా ఉంది. ఈ పాట ఖచ్చితంగా ఆల్బంలో హిట్ సాంగ్ అయ్యి తీరుతుంది. “సీతాకోక చిలకల గుంపు నడుమొంపుల్లో కితకితలాడే!” అంటూ మొదలెడుతూనే కొంటె కవిత్వంతో కట్టిపడేశారు రామజోగయ్య గారు! ఇలా “కితకితలతో” మొదలెట్టి, “పిటపిట”, “చిటపట”, “అట ఇట”, “కిటకిట”, “కటకట”, “గడగడ” వంటి అచ్చ తెలుగు నుడికారాలతో శృంగారాన్ని ఒలికించి రసహృదయాలని “లబలబ” లాడించారు –
పిల్లరంగు పిటపిటా
చెంగుచెంగు చిటపటా
కంటి ముందే అట ఇటా
తిప్పుకుంటూ తిరుగుతున్నదే!
ఒంపుసొంపు కిటకిటా
చెప్పలేని కటకటా
చూపుతోనే గడగడా
దప్పికేమో తీరకున్నదే!
రామజోగయ్య గారు రాసిన “డోర్ నెంబర్” అనే ఇంకో పాట ఫక్తు ఐటం సాంగ్. రొటీన్‌గా సాగే ట్యూన్ అస్సలు ఆకట్టుకోలేదు. అయినా ఈ పాటని బ్రతికించడానికి రామజోగయ్య గారు శతవిధాల ప్రయత్నించి ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి ప్రస్తావిస్తూ వెరైటీని కొత్తదనాన్నీ సాధ్యమైనంత నింపారు. ఆయన కష్టాన్ని గ్రహిస్తున్నా ఈ పాటని భరించడం మాత్రం కష్టమే అయ్యింది. మొత్తం పాటలో ఆకట్టుకునేది ఏదైనా ఉంటే అది గాయని గీతామాధురి చేసిన “వాయిస్ మాడ్యులేషన్”. తన సహజమైన గాత్రాన్ని మార్చి అబ్బురపరిచేలా హొయలు పలికించింది. ఈ పాట సోకాల్డ్ మాస్‌ని ఉర్రూతలూగిస్తుందేమో మరి చూడాలి!
మొత్తంగా చూస్తే ఈ ఆల్బం నాకు బాగానే నచ్చింది. సంగీతం ఇంకొంచెం బలంగా ఉంటే సిరివెన్నెల భావాలు మరింత గొప్పగా పండేవేమో అనిపిస్తుంది. ఒక్కసారి తప్పకుండా వినొచ్చు, పదే పదే వినాలంపించే పాటలూ కొన్ని ఉన్నాయి (నాకవి: “ఒక లైఫ్”, “అయ్యో అయ్యో” అన్న గీతాలు). ఆ మాత్రం చాలేమో ఈనాటి సినిమా అల్బంలకి! ఈ సినిమాలో పాటలని యూట్యూబులో ఇక్కడ వినొచ్చు:
wow good song
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg