కొంత కాలం విరామం తర్వాత మళ్ళీ ఈ బ్లాగులో పోస్ట్ చెయ్యడం, ఉగాదితో ఒక శుభప్రారంభం చెయ్యడం జరుగుతోంది. అంతగా ప్రాచుర్యం పొందని గొప్ప పాటలని పరిచయం చెయ్యడం ఈ బ్లాగు ముఖ్యోద్దేశం. అంతగా తెలియని ఉగాది పాట ఏమిటా అని ఆలోచిస్తే గుర్తొకొచ్చిన పాట ఇది. ఇది సినిమా పాట కాదు, ప్రైవేట్ గీతం కావొచ్చు. నేను ఇంజనీరింగ్ చదవుకునే రోజుల్లో (1998-2002) వార్త దినపత్రికలో ఈ ఆరుద్ర గీతం చదవగానే నా మనసు పరిమళించింది. దీని స్వరకర్త సాలూరు కబీర్‌షా గురించి నాకు అసలు తెలియదు. ఈ పాట గురించి నెట్ లో వెతికాను గానీ వివరాలు ఏమీ దొరకలేదు. మీకు తెలిస్తే చెప్పగలరు.
కొన్ని పాటలు విశ్లేషణ చేస్తున్న కొద్దీ ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. మరికొన్ని పాటలని ఆస్వాదించడానికి విశ్లేషణ అడ్డుగా మారుతుంది. ఈ రెండో కోవకి చెందిన పాట ఇది. లలితమైన పదాలతో ఆరుద్ర అల్లిన ఈ రసరమ్య గీతాన్ని అనుభూతి చెందండి. ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
రచన: ఆరుద్ర
సంగీతం: సాలూరు కబీర్‌షా
ఆనందం కలిగినపుడు అదే ఆమని
అయిన వాళ్ళు నవ్వినపుడు అదే ఆమని
అతని చేయి సోకినపుడు ఆమె ఎడద సోలినపుడు
ఆత్మీయులు మురిసినపుడు అదే ఆమని
వేయిడొలలొక్కసారి ఊగినట్లుగా
తీయనైన లోకాలను తేలినట్లుగా
దోరవయసు తోటవోలె విరిసినట్లుగా
తోచినపుడు ఎపుడైనా అదే ఆమని
పదునుదేరి పడుచుదనం పాడినట్లుగా
హృదయంలో సన్నాయిలు ఊదినట్లుగా
తనలోపలి శశికాంతులు తరగనట్లుగా
తలచునపుడు ఎపుడైనా అదే ఆమని
కోరికలే కోయిలలై కూసినట్లుగా
కొత్త కొత్త మురిపాలే కురిసినట్లుగా
పరవశాన జన్మంతా పండినట్లుగా
భావిస్తే ఎపుడైనా అదే ఆమని