రెహ్మాన్ పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన పాట “బొంబాయి” చిత్రంలోని “కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే” అన్నది. నా దృష్టిలో ఇది వేటూరి రాసిన గొప్ప పాటల్లో ఒకటి. కానీ చిత్రంగా ఈ పాట సాహిత్యం చాలా అపార్థాలకి దారితీసింది. ఓ మూడు సంఘటనలు చెప్తాను.
- నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా కాలేజీ ఫంక్షన్‌లో ఓ అమ్మాయి ఈ పాట తమిళ్‌లో పాడుతూ ఉంటే నా వెనుక కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ళు ఆ అమ్మాయి గురించి కామెంట్ వేస్తూ చులకనగా అన్న మాటలు – “తెలుగులో పాడితే పాటలోని బూతులు తెలిసిపోతాయని తమిళ్‌లో పాడుతోందిరా!”. సినిమాలో కొత్తగా పెళ్ళైన స్నేహితురాలిని సరసంగా ఆటపట్టిస్తూ అమ్మాయిలు పాడే లైన్లు ఈ పాటకి కోరస్‌గా వస్తాయి. “మామకొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో!” వంటి వాక్యాల వల్ల కాబోలు ఇది “బూతు పాట” గా తీర్మానించారు నా వెనుకసీటు అబ్బాయిలు! ఇది పూర్తిగా తప్పు! నిజానికి పాటలోని అంశానికీ ఈ కోరస్‌కి సంబంధం లేదు. అందుకే ప్రస్తుత వ్యాసంలో కోరస్ ని చర్చించకుండా వదిలేస్తున్నాను.
- కోరస్ శృంగారపరంగా ఉంది కాబట్టి పాట కూడా శృంగార గీతమే అని చాలామంది పొరబడతారు. నేను చెన్నై I.I.T.లో చదివే రోజుల్లో ఏటా జరిగే సంగీత ఉత్సవం “సారంగ్” లో ఒక అమ్మాయి ఈ పాటని తమిళ్‌లో చాలా ఫీల్ అయ్యి హావభావాలతో శృంగార తాదాత్మ్యంతో పాడింది. సాహిత్యంలో కొన్ని వాక్యాలు శృంగారంతో ఉండడం వల్ల కాబోలు ఆ అమ్మాయి ఈ పాటని శృంగార గీతం అనుకుంది. కానీ నా దృష్టిలో ఇది శృంగార గీతం కాదు. ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అబ్బాయిపై పడ్డప్పుడు తనలో తాను ఎదుర్కొనే సంఘర్షణ ఈ పాట. సామాజిక కట్టుబాట్లకి తలొగ్గాలా, ప్రేమ వైపు ఒగ్గాలా అన్న ఆలోచన సరదా విషయం కాదు, తీవ్రమైనది. ప్రేమలో పడిన ఆ అమ్మాయి తనని తాను అద్దంలో చూసుకుంటూ తనలోని భావాలన్నిటినీ (ప్రేమా, శృంగారం, విరహం, శోకం వగైరా) నిజాయితీగా పరామర్శించుకునే సీరియస్ పాట ఇది! అందుకే గాయని చిత్ర ఈ పాటలోని “జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం” అని పాడేటప్పుడు నవ్వే నవ్వు రసభంగంగా అనిపిస్తుంది నాకు!
- చాలా రోజుల వరకూ నాకీ పాటలోని కొన్ని లైన్లు అర్థమయ్యేవి కావు. ఓ రోజు “పాడుతా తీయగా” చూస్తుంటే ఎవరో ఈ పాట పాడారు. SPB ఈ పాట సాహిత్యం గురించి వివరిస్తాడేమో అని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. తీరా చూస్తే SPB, “ఏమిటో! వేటూరి ఇష్టం వచ్చినట్టు పదాలు కూర్చేశాడు. నాకో ముక్క అర్థం కాలేదు!” అని తేల్చేశాడు! వేటూరి అర్థంపర్థం లేని పాటలు రాసిన మాట నిజమే కానీ మంచి సంగీతం, సందర్భం కుదిరినప్పుడు మనకి అర్థం కాకపోయినా ఆయన అర్థవంతంగానే రాస్తాడు అని నా నమ్మకం. కొంచెం పరిశ్రమిస్తే ఈ పాట నాకు బాగానే అర్థమైంది. చాలా గొప్పగా ఉందనిపించింది. నాకు అర్థమైనది మీతో పంచుకోవాలనే ఈ వ్యాసం!
పల్లవిలోనే కనిపించే కవిత్వం, పాటంతా తర్వాత దట్టంగా పరుచుకుంటుంది –
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై, విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ, హృదయాల కథ మారె నీలో
వలపందుకే కలిపేనులే, ఒడిచేరె వయసెన్నడో
ఈ ప్రేమ “తొలిచూపు ప్రేమ”, హృదయాలను సూటిగా తాకిన ప్రేమ. అందుకే “తొలిచూపు కలయికలు” అంతటితో ఆగిపోవు అంటోంది. ఆ అబ్బాయికి తనపైగల ఆరాధన అమ్మాయికి చెప్పకనే తెలిసిపోయింది! మగవాడి కళ్ళలోని భావాలని (నీ కళ్ళలో పలికినవి…) ఆడవాళ్ళు ఇట్టే పసిగట్టగలుగుతారు – అది ప్రేమ అయినా, కాంక్ష అయినా! కాబట్టి ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు. తెల్లని తామరలా విరిసిన ఆమె వయసుకి సుగంధంలా దరిచేరిందీ ప్రేమ! ఎవరెవరో తెలియకపోయినా అతని హృదయం గల్లంతైంది! ఊరూ, పేరూ, వివరాలు తెలుసుకుని ప్రేమించేది ప్రేమవ్వదు! వయసు వచ్చి చేరాకా, వలపు గుండె తట్టాకా, ఝల్లుమనని జన్మ ఉంటుందా?
ఉరికే కసివయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం
జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం; చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె
చిత్తం చిరుదీపం; రెపరెప రూపం తుళ్ళి పడసాగె
పసి చినుకే ఇగురు సుమా, మూగిరేగే దావాగ్ని పుడితే
మూగె నా గుండెలో నీలి మంట
ఉరికే వయసుని ప్రేమ చల్లగా తాకింది. కానీ దాని వల్ల కుదురు రాకపోగా తడబాటు పెరిగింది. ఏదో కొత్త ధైర్యం కూడా వచ్చింది. అందుకే ప్రాయం కోసం, ప్రణయం కోసం పరదాని కొంచెం పక్కకి జరిపే చొరవొచ్చి చేరింది. “అందం తడబడింది” అన్న అందమైన ప్రయోగం వేటూరిలోని కవిని చూపెడుతోంది. అమ్మాయి పెరిగిన మహమ్మదీయ వాతావరణాన్ని సూచించడానికి “పరదా” అని వాడాడు.
ప్రేమలో పడ్డాక, అందం తొలికెరటమై ఉప్పొంగింది. తీయని ఊహల్లో తుళ్ళే మనసు ఆ కెరటానికి నీటి మెరుపులా అమరింది! ఎంత అందమైన ఊహ! అయితే వాస్తవంలోకి వస్తే ఈ ప్రేమ ఫలించడం ఎంత కష్టమో తెలిసి అదే మనసు సంఘర్షణకి గురౌతోంది. అది ఎలా ఉందంటే గాలికి రెపరెపలాడుతున్న దీపం లాగ! ఇలా మనసు ఊగిసలాటని పాజిటివ్‌గా నెగిటివ్‌గా రెండు అద్భుతమైన ఉపమానాలతో చెప్పాడు. వెంటనే ఇంకో అందమైన ఉపమానం – గుండెలో నీలిమంట మూగిందట, తానొక పసిచినుకట, ఆ నీలిమంట దావాగ్నిలా మారితే ఆ పసిచినుకు గతేం కానూ? అని ప్రశ్న. ఇక్కడ మంట శృంగారపరమైన ప్రతీక కావొచ్చు, లేదా వేదనా/సంఘర్షణా కావొచ్చు. “మూగె నా గుండెలో నీలిమంట..” అని అర్థోక్తిలో వదిలెయ్యడం మంచి ఫీల్ ఇచ్చింది. ఈ మూడు ఉపమానాలనీ మనం ఇంకొన్ని విధాలుగా కూడా అన్వయించుకోవచ్చు, అదే ఇక్కడి అందం.
శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలూగింది నీలో
తొలిపొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో
ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారె రేయల్లే
ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా, గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా
మొదటి చరణంలో ఆ అమ్మాయి తన అనుభూతినీ, పరిస్థితినీ వివరిస్తే రెండో చరణంలో “ఎందుకు ఇలా అయ్యింది”, “ఇప్పుడేం చెయ్యాలి” అన్న ఆలోచన కనిపిస్తుంది. ప్రేమ భావం ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది అంటే – వయసు ప్రభావం అని సమాధానం! వయసు మాయలాడి, జగత్కిలాడి! అది అబ్బాయిని శ్రుతి మించి ఉయ్యాలలూగిస్తే, అమ్మాయిని గిలిగింతలు పెట్టి తాపాన్ని ఎగదోస్తోంది! ఈ తీయని ఊహల మైమరపులో, పగలు కూడా రేయిలా మారుతోందట. “తెల్లారె రేయల్లే” అన్న ప్రయోగం ఎంత చక్కగా ఉందో! అదే సమయంలో ఒకవేళ వియోగమే వస్తే బ్రతుకు విఫలమే కదా అన్న స్పృహ కలుగుతోంది. దీనిని “ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరవ్వడం” అన్నాడు! ఎంత కవిత్వం అండి. ప్రస్తుత మాధుర్యం పూలలో తేనె అయితే ప్రేమ వైఫల్యం రాలే పూల కన్నీరే కదా! “ఎర్రమల్లెలు” అంటే “ఎరుపు రంగులో ఉన్న ఓ రకం మల్లెలు” అన్న అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ “ఎరుపు” ని రక్తం/వేదనకీ లేక సిగ్గు/శృంగారానికి సూచికగా వాడినట్టు అనిపిస్తోంది. వేటూరి పాటల్లో తవ్వుకున్న వారికి తగినంత నీరు!
పాటని ముగించే ఆఖరి లైన్లు నాకు చాలా ఇష్టం. తరచి చూస్తే ఇదంతా కలా నిజమా అని ఆ అమ్మాయికి అనిపిస్తోంది. లేకపోతే తానేమిటి ఇలా అయిపోవడం ఏమిటి? ఈ ప్రేమని జయించి తీరకపోతే బ్రతుకు వృథా అనిపించేంత మాయ ఎలా జరిగింది? స్పృహలో ఉన్నామా కలలో ఉన్నామా తేల్చుకోడానికి చేతిని గిల్లి చూసుకుంటాం. అయితే ఆ అమ్మాయి తన బ్రతుకుని గిల్లి అడిగిందట! “గిల్లుకున్న జన్మనడిగా” – ఎంత అద్భుతమైన ప్రయోగం! ఇంకా ఈ తీయని ఊహల మైమరపులో భాషనే మరిచిపోయిందిట! ఈ భావాన్ని కూడా ఎంత అద్భుతంగా చెప్పాడండి – “నీ నమాజుల్లో ఓనమాలు మరిచా”. “నమాజు” అనడం ద్వారా అమ్మాయి ముస్లిం అన్న విషయం గుర్తు చేస్తూ, తనది కేవలం తీయని ఊహ కాదు, ఓ ఆరాధన, ఓ ప్రార్థన అని తెలియజేస్తున్నాడు! ఓనమాలు – అంటే అక్షరాలు అనే కాదు, “ఓం నమః” ని గుర్తుచెయ్యడం ద్వారా అబ్బాయి హైందత్వాన్ని కూడా స్ఫురింపజెయ్యడం. అంటే ఈ మతాల వైషమ్యాలు మరిచి, ఈ అడ్డుగోడలు దాటి ప్రేమని సాధించుకుందాం అని చెప్పడం! ఈ రెండు వాక్యాలకీ వేటూరికి దణ్ణం పెట్టొచ్చు అనిపిస్తుంది నాకు!
ఒక్కసారి ఈ పాటలో వాడిన ఉపమానాలు, పదచిత్రాలు అన్నీ ఊహించుకుంటూ ఈ పాట సాహిత్యాన్ని మళ్ళీ చదవండి. ఎంత గొప్ప సాహిత్యమో తెలుస్తుంది. నిజానికి ఇది డబ్బింగ్ పాట. తమిళ కవి వైరముత్తుకి కొంత క్రెడిట్ దక్కాలి. అయితే పాట తమిళ సాహిత్య అనువాదం చూస్తే వేటూరి తనదైన ఊపమానాలు, ప్రయోగాలు చేస్తూ అనుసృజన చేసాడు కానీ, అనువాదం చెయ్యలేదని తెలుస్తుంది. పైగా డబ్బింగ్ పాటల్లో సైతం చక్కని భాషా, చిక్కని కవిత్వం పలికించడం వేటూరికే తెలిసిన విద్య! వేటూరి గొప్ప డబ్బింగ్ పాటల రచయిత కాకపోవచ్చు కానీ, డబ్బింగ్ పాటలకి కూడా గొప్పతనం దక్కేలా చాలా మంచి రచనలు చేసాడనడానికి ఈ పాటే ఉదాహరణ!
(తొలి ప్రచురణ వేటూరి వెబ్సైటులో)