వేటూరి – పాటసారి డైరీలోంచి 2

“సీతారామయ్యగారి మనవరాలు” తరువాత నేను రాసిన తెలుగు పాటల్లో నేనే తెలుగుతనాన్ని వెతుక్కోవలసిన స్థితిలో పడ్డాను – వేటూరి

వేటూరి రాసిన కొన్ని పాటల్లో నిజాయితీ కనిపించకపోవచ్చు, కానీ ఆయన మాటల్లో ఎప్పుడూ నిజాయితీ ధ్వనిస్తుంది. ఇలా నిజాయితీ నిండిన వ్యాసం ఇది. ఇందులో తెలుగు భాషపై వేటూరికున్న మమకారం, “సినీ తెలుగు భాష” గురించి ఆవేదనా కనిపిస్తాయ్. ఆయన తన కోసం రాసుకున్న పాటలూ, ఆత్మసంతృప్తి కలిగించిన పాటలూ కొన్ని మన మనసులని పలకరిస్తాయి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా స్పందించకుండా ఉండలేము. సాహితీ అభిమానులూ, వేటూరి అభిమానులూ తప్పక చదవవలసిన ఈ చక్కని వ్యాసం ఇక్కడ – http://goo.gl/j6Uz2

ETV శ్రీ భాగవతం పాటల గురించి వేటూరి

హాసంలో వేటూరి “కొమ్మ కొమ్మకో సన్నాయి” శీర్షికన రాసిన వ్యాసాల్లో తన పాటల గురించి రాసుకున్నవి ప్రచురించాను ఇప్పటి దాకా. ఇవన్నీ తర్వాత వచ్చిన “కొమ్మ కొమ్మకో సన్నాయి” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రచురించబోతున్న మూడు వ్యాసాల ప్రత్యేకత ఏమిటంటే అవి పుస్తకంలో లేవు. కాబట్టి ఈ వ్యాసాలు బహుశా తక్కువ మంది చదివి ఉంటారు.    (Correction: ఈ రోజే సరిచూసుకున్నాను. ఈ వ్యాసం కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో ఉంది. నేను పొరబడ్డాను.)

ETV లో బాపూ రమణల భాగవతానికి వేటూరి కొన్ని పాటలు అందించారు. ఆ పాటల గురించి రాసినదీ వ్యాసం. చాలా మంచి వ్యాసం ఇది. ఎలాంటి వస్తువుకి ఎలాంటి భాష వాడాలి, తద్వారా రసపోషణ ఎలా సాధించాలి అన్నది వేటూరి వివరిస్తారు. రసపోషణ అంటే ఒక పాట విన్నప్పుడు మనలో కలిగే స్పందనగా నిర్వచించుకోవచ్చు. ఈ రసపోషణ సరిగా పాటించబడని పాటలు ఎన్నో ఉన్నాయి. నాకు గీతరచయిత చంద్రబోస్‌లో కనిపించే ప్రధానమైన లోపమే ఇది. ఆయన రాసిన కొన్ని పాటల్లో విన్నూతనంగా రాసే ప్రయత్నం వలన పాట వింటే చమత్కారం చేశాడు, కొత్తగా రాశాడు అనిపిస్తుందే తప్ప తగిన రసస్ఫూర్తి కలగదు.

శ్రీ భాగవతం పాటలు ఎక్కడైనా లభ్యమైతే తెలపగలరు. వేటూరి రాసిన వ్యాసం ఇక్కడ:  Veturi on Bhagavatam songs

అన్నమయ్య గురించి వేటూరి

అన్నమయ్య గురించి ఎక్కువగా, అన్నమయ్య చిత్రంలో తను రాసిన పాటల గురించి తక్కువగా వివరిస్తూ వేటూరి హాసంలో రాసిన వ్యాసం ఇది. ఈ చిత్రానికి వేటూరి రాసిన పాటలు మూడే – తెలుగు పదానికి జన్మదినం, ఏలే ఏలే మరదలా, అస్మదీయ మగటిమి (అప్పట్లో ఆడియో కేసెట్‌తో పాటూ ఇచ్చిన రంగుల పాటల పుస్తకంలో "ఫాలనేత్రానల" అన్న అన్నమాచార్య కీర్తన కూడా వేటూరి రచనే అని తప్పుగా పేర్కొన్నారు).

అన్నమయ్య ప్రయోగాలపై వేటూరికి ఉన్న అవగాహన వలనే "ఏలే ఏలే మరదలా" పాటని అంత సమర్థవంతంగా రాయగలిగారని ఈ వ్యాసం చదివితే అనిపిస్తుంది (ఈ పాటకి ప్రేరణ ఏదో అన్నమయ్య కీర్తన ఉన్నట్టు గుర్తు, ఏమిటో మీకు తెలిస్తే చెప్పగలరు. అలాగే "వేణువై వచ్చాను భువనానికి" అన్న పాటకి ప్రేరణ కూడా).

"అస్మదీయ మగటిమి" పాట పానకంలో పుడకని అప్పట్లో కొందరు విమర్శించారు. అసలు సినిమాలో సాళవనరసింహరాయలు పాత్రే సరిగా చిత్రించలేదని వేటూరే ఈ వ్యాసంలో – "బాక్సాఫీస్ సూత్రాలకి, అన్నమయ్య చిత్రానికి మధ్యపడి నలిగింది" అనడం ద్వారా ఒప్పుకున్నారు. ఈ పాటని సినిమానుండీ విడదీసి ఒక శృంగార గీతంగా భావిస్తే చాలా మంచి రచనే అని అనిపిస్తుంది నాకు.

ఇక తెలుగుపదానికి జన్మదినం పాట గురించి చెప్పేదేముంది?

ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి – http://goo.gl/Pmx4w

స్వరరాగ గంగాప్రవాహమే పాట గురించి వేటూరి

వేటూరి గొప్ప పండితులనీ, సంగీత జ్ఞానం బాగా ఉన్నవారనీ తెలిసిన విషయమే. ఒక ఉదాహరణ కావాలంటే "సరిగమలు" చిత్రంలోని "స్వరరాగ గంగా ప్రవాహమే" పాట గురించి వేటూరి హాసంలో రాసిన వ్యాసం చదివితే చాలు. ఈ వ్యాసం ఇప్పటికి నేను చాలా సార్లు చదివినా, నాకు చదివిన ప్రతిసారీ కొత్త విషయం ఒకటి బోధపడడం, అర్థం కానిది కొంత మిగిలిపోవడం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రెండవ చరణానికి ఇచ్చిన వివరణ అబ్బురపరుస్తుంది.

మంచి బాణీలు ఉంటే, రచయితకి ప్రేరణా, ప్రాణం వచ్చి గొప్ప సాహిత్యం పుట్టే అవకాశం ఎక్కువ ఉంది. ఈ సినిమాలో అన్ని పాటలూ మథురాలే. అన్నీ గొప్ప రచనలే. వేటూరికి 1993 తర్వాత నందీ పురస్కారాలు కానీ, మనస్విని పురస్కారాలు కానీ ఏమీ రాలేదు. చివరి రెండు దశకాల్లో ఆయన అవార్డులివ్వదగ్గ పాటలు ఎన్నో రాశారనడానికి 1994 లో వచ్చిన ఈ సినిమా ఒక ఉదాహరణ.

ఈ పాటపై వేటూరి వ్యాసం ఇక్కడ చదవండి – http://goo.gl/3R7Dt

YouTube లో ఈ పాట ఉన్న ఒక లింక్ –

గలగలగల గంగోత్రి పాట గురించి వేటూరి

గంగోత్రి సినిమాలో వేటూరి రాసిన “గలగలగల గంగోత్రి” పాటని తలచుకుంటే కొన్ని సంగతులు గుర్తుకు వస్తాయి. అప్పట్లో idlebrain.com సైట్లో శ్రేయ అన్నావిడ(?) ఆడియో రివ్యూస్ రాస్తూ ఉండేవారు. సిరివెన్నెలపై అభిమానం, వేటూరిపై దురభిమానం తనకి ఉందని చాలా పోస్టుల్లో నాకు అనిపించేది. నాకు ఈ వివక్ష నచ్చేది కాదు. అలాంటి ఆవిడే ఈ పాట గురించి – the veteran did a good job అని పొగడ్డం నాకు ఆనందాన్నిచ్చింది. హాసం రాజా ఈ పాట గురించి రాస్తూ – “వేటూరి ఈ పాటకి వాడిన భాష చూస్తే కన్నీటితో ఆయన పాదాలు కడగాలనిపిస్తుంది” అన్నారు. అప్పట్లోనే వార్త దినపత్రికలో వి.ఎ.కె రంగారావు గారు “ఆలాపన” అనే శీర్షిక నిర్వహిస్తూ ఉండేవారు. ఒక పాఠకుడు – “వేటూరి గంగని గంగోత్రని సంబోధించి తప్పులు రాశాడు” అంటే రంగారావుగారు – “అవును ఆయనకి అలవాటేగా! కలకత్తా గురించి “యమహానగరి” పాటలో తప్పులు చేసినట్టే ఇక్కడా” అని అక్కసుతో అన్నారు. పాటలో మిగతా మంచి వదిలేసి, ఏదో సినిమా సౌలభ్యం కోసం చేసిన మార్పుకి ఇంత రామాయణంలో పిడకలవేట అవసరమా అని నాకనిపిస్తుంది.ఏదేమైనా ఇది గొప్ప పాటేనని ఒప్పుకుని తీరాలి. కీరవాణి చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. గమనిస్తే ఈ పాటలో ఒక పల్లవి, రెండు చరణాల standard structure లేదని తెలుస్తుంది. గంగానది లాగే ఒక free flow లో ఈ పాట దర్శనమిస్తుంది. ఈ పాట రచన గురించి వేటూరి ఏమన్నారో ఆయన మాటల్లోనే ఇక్కడ చదవండి: గలగలగల గంగోత్రి

సౌలభ్యం కోసం ఈ పాట పూర్తి సాహిత్యం కింద ఇస్తున్నాను:

సాకీ:
జీవనవాహినీ పావనీ
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయముతీర్చి శుభముకూర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావనీ
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి

పల్లవి:
గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి

పసుపు కుంకుమతో
పాలు పన్నీటితో
శ్రీగంధపు  ధారతో
పంచామృతాలతో
అంగాంగం తడుపుతూ
దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న
అభ్యంగన స్నానం

చరణం 1:
మంచు కొండలో ఒక కొండవాగుగా
ఇల జననమొందిన విరజావాహిని
విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా
శివగిరికి చేరిన సురగంగ నీవని
అత్తింటికి సిరులనొసగు అలకనందవై
సగరకులము కాపాడిన భాగీరధివై
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల
మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి

|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||

అమ్మా  గంగమ్మా
కృష్ణమ్మకి చెప్పమ్మా
కష్టం కలిగించొద్దని…
యమునకి చెప్పమ్మా
సాయమునకి వెనకాడొద్దని…
గోదారికి కావేరికి
ఏటికి సెలయేటికి
కురిసేటి జడివానకి
దూకే జలపాతానికి
నీ తోబుట్టువులందరికీ
చెప్పమ్మా మా గంగమ్మా

చరణం 2:
జీవనదివిగా ఒక మోక్షనిధివిగా
పండ్లుపూలుపసుపుల పారాణిరాణిగా
శివునిజటలనే తన నాట్యజతులుగా
జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా
ముక్తినదిని మూడుమునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని
ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ

|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||