గౌతమిపుత్ర శాతకర్ణి పాటలు

“కంచె” చిత్రంతో క్రిష్ – సిరివెన్నెల – చిరంతన్ భట్ కలిసి సృష్టించిన సంగీత సాహితీ దృశ్యకావ్యానికి పరవశించిన వాళ్ళలో నేనొక్కణ్ణి. మళ్ళీ అదే కాంబో “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రంలో కుదిరింది కాబట్టి ఈ సినిమా ఆడియోపై నా అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆల్బం మొదటిసారి విన్నప్పుడు బాణీలు అంతగా ఎక్కలేదు కానీ వినగా వినగా ఆకట్టుకునే సంగీతం. సిరివెన్నెల సాహిత్యం కూడా చక్కగా అమరింది.

చాలా కాలం తర్వాత ఉదిత్ నారాయణ్ గొంతు వినిపించిన “ఎకిమీడా నా జతవిడనని వరమిడవా, తగుతోడా కడకొంగున ముడిపడవా” అనే ప్రణయ యుగళ గీతం వినగానే ఆకట్టుకుని అలరించింది. నాకు ఆల్బంలో బాగా నచ్చిన పాట ఇదే. “ఎకిమీడు” అంటే రాజు అని అర్థం కనిపిస్తోంది నిఘంటువులో. ఇలాంటి అరుదైన పదాలను వాడిన సిరివెన్నెలని మెచ్చుకోవాలి. హుషారైన ట్యూన్ కుదిరిన ఈ పాటలో సిరివెన్నెల చాలా చక్కని పదాలని ట్యూన్‌కి బాగా కుదిరేటట్టు వాడి మురిపించారు. పల్లవిలోనే “డ” అక్షరంతో అందమైన వృత్త్యనుప్రాస వేసిన సిరివెన్నెల, “ఎండో వానో ఎవరికెరుక? ఏ వేళాపాళా ఎరుగననీ, ప్రతీరోజిలా నీతో పాటే నడుస్తు గడిస్తే ఎన్నాళ్ళైతేనేం, ఎటైతేనేం?” అంటూ ఎండైనా వానైనా ఏ మాత్రం చెదరని అనుబంధాన్ని అందంగా పలికించారు.

“గణగణ గణగణ గుండెలలో జేగంటలు మ్రోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయేలా, కణకణ కణకణ కన్నులలో కార్చిచ్చులు రేగెను చిక్కటి చీకటి ఎర్రగ రగిలించేలా” అనే పాట యుద్ధం చెయ్యడానికి వెళ్తున్న సైన్యం ఆలపించే యుద్ధగీతంలా ఉంది. ట్యూన్ నడక, సాహిత్యం చూస్తే “బాజీరావ్ మస్తానీ” చిత్రంలో “మహలింగ” పాట గుర్తొచ్చింది. ఆ పాటంత ఆకట్టుకోకపోయినా మంచి ట్యూనే. సిరివెన్నెల తన సాహిత్యంతో వీరరసాన్ని బాగా పలికించారు. “కీడంటే మన నీడే కదరా, నదురా బెదురా ముందుకు పదరా” వంటి పొందికైన పదాలు కలిగిన వాక్యాలు, చక్కని భావాలు ఉన్న పాట.

బాలూ గొంతులో వినిపించే శృంగార యుగళ గీతం “మృగనయనా భయమేలనే”. ఎన్నేళ్ళైనా కుర్రగానే ఉన్న బాలూ గొంతు ఈ పాటకి వన్నె తెచ్చింది. ఈ యుగళ గీతంలోనూ శ్రేయా ఘోషల్ మధురంగా గొంతు కలిపింది. పాటలో వినిపించే హిందుస్తానీ ఆలాపనలు బావున్నాయి. సాహిత్యపరంగా చూస్తే “మృగనయనా” వంటి చక్కని పదాలతో సిరివెన్నెల రాసిన పాట మురిపించింది. ముఖ్యంగా “అధరమదోలా అదిరినదేలా, కనుకొలకుల ఆ తడి తళుకేలా?” అంటూ సాగిన పల్లవి బాగా కుదిరింది. చరణంలో – “నా నరనరమున ఈ వెచ్చదనం, నా పౌరుషమా, నీ పరిమళమా?” అంటూ రాజసాన్నీ శృంగారాన్నీ కలిపిన భావం బావుంది.

“సాహో సార్వభౌమా సాహో” అన్న పాట శాతకర్ణి శౌర్యాన్నీ ఘనతనీ వర్ణించే పాట. మంచి ఎనెర్జీ ఉన్న ట్యూన్ ఆకట్టుకుంది. ఆర్కెస్ట్రైజేషన్ కొంచెం “కృష్ణం వందే జగద్గురుం” చిత్రంలో “జరుగుతున్నది జగన్నాటకం” పాటని గుర్తు తెచ్చింది. “కాలవాహిని శాలివాహన శకముగా ఘనకీర్తి పొందిన సుప్రభాత సుజాతవహ్ని, గౌతమీ సుత శాతకర్ణి, బహుపరాక్!” అంటూ ఎత్తుగడలోనే అద్భుతమైన పదభావచిత్రంతో మొదలెట్టిన సిరివెన్నెల పాటంతా అదే జోరుతో దూసుకెళ్ళారు.

ఆఖరుగా వినిపించే “సింగముపై లంఘించిన బాలుడి పేరు శాతకర్ణి” అన్న పాట బుర్రకథలా సాగుతూ శాతకర్ణి కథని చెప్పే పాట. మాటల రచయిత “సాయి మాధవ్” ఈ పాటతో గీతరచయితగా కూడా తన సత్తా చాటుకున్నారు. హృదయానికి హత్తుకునేలా రచన సాగింది. అయితే హిందీ చాయలతో సాగిన బాణీ, గాయకుడు “విజయ్ ప్రకాశ్” తెలుగు ఉచ్చారణా ఈ పాటని “తెలుగు బుర్రకథ” లా అనిపించనివ్వలేదు.

మొత్తంగా చూస్తే ఈ సినిమా పాటలు నేను ఊహించినట్టు “కంచె” అంత స్థాయిలో లేకపోయినా నిరాశ కలిగించలేదు.

మనసుని తాకే “ఊపిరి” గీతాలు

ఊపిరి” చిత్రానికి ఊపిరి సిరివెన్నెల రాసిన పాటలని చెప్పక తప్పదు. నిజానికి ఈ చిత్రానికి సిరివెన్నెల రాసిన పాటల్లో మరీ కొత్త భావాలు కానీ, వినూత్న ప్రయోగాలు కానీ పెద్దగా లేవు. ఆయన తన పాటల్లో తరచూ చెప్పే ఆశావహ దృక్పథం, మనిషితనం వంటి అంశాలే ఇక్కడా కనిపిస్తాయి. అయితేనేం హృదయానికి హత్తుకునేలా, బావుందనిపించేలా రాయడంలో సిరివెన్నెల కృతకృత్యులయ్యారనే చెప్పాలి.

సినిమాలో మొదటగా వినిపించే పాట “శంకర్ మహదేవన్” గాత్రంలో వినిపించే “బేబీ ఆగొద్దు” అన్నది. “గోపీ సుందర్” ఇచ్చిన ట్యూన్ అంతగా ఆకట్టుకునేలా లేదు, పైపెచ్చు ఆ “బేబీ” అని తరచూ అరవడం చిరాకు తెప్పించింది! అయితే జీవితాన్ని కారు ప్రయాణంతో పోలుస్తూ సిరివెన్నెల రాసిన చరణం మాత్రం మెరుస్తుంది. నిజానికి సిరివెన్నెల ఈ చరణంలో చెప్పినట్టు కారు నడిపితే డ్రైవింగ్ టెస్టు ఫెయిల్ అవ్వడమో, లేదా ఆక్సిడెంటు జరగడమో ఖాయం! కానీ జీవితాన్ని ఆయన చెప్పినట్టు నడిపిస్తే “లైఫ్ టెస్ట్” పాస్ అవుతాం, జీవితం ఓ ఆక్సిడంటుగా మారకుండా ప్రయోజకమౌతుంది –

అద్దం ఏం చూపిస్తుంది?
వెనకేదో ఉందంటుంది
మన కంటికి కనిపిస్తుందీ ముందున్నది!
బెల్టన్నది సీటుకి ఉంది
మదినెట్టా బంధిస్తుంది?
ఊహల్లో విహరిస్తుంటే…
దూసుకెళ్ళే ఈ జోరును ఆపే బ్రేకు లేదే!
దారులన్నీ మనవేగా, పోనీ ధీమాగా
తప్పైతే మళ్ళీ యూ-టర్న్ కొట్టేద్దాం!

జీవితాన్ని వివరించే పాట, నాకు ఆల్బంలో బాగా నచ్చిన పాట “ఒక లైఫ్” అన్నది. కార్తీక్ చక్కగా పాడిన ఈ గిటార్ ప్రాధాన్య గీతానికి ట్యూన్ కూడా బాగా కుదిరింది. చరణంలో సిరివెన్నెల ఎంతో ప్రతిభావంతంగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి, అవరోధాలను అధిగమించడానికి కావలసిన జ్ఞానబోధ చేసి ఉత్తేజపరుస్తారు –

ఏం? ఏం లేదని?
మనం చూడాలి గానీ
ఊపిరి లేదా ఊహలు లేవా?
నీకోసం నువ్వే లేవా?
చీకటికి రంగులేసే కలలెన్నో
నీ తోడై వస్తుండగా
ఒంటరిగా లేవని
ఆశకి కూడా ఆశని కలిగించేయ్!
ఆయువనేది ఉండేవరకూ
ఇంకేదో లేదని అనకు!
ఒక్కో క్షణమూ ఈ బ్రతుకూ కొత్తదే నీకు!

“విజయ్ ప్రకాష్” హృద్యంగా ఆలపించిన “నువ్వేమిచ్చావో” అనే బిట్ సాంగ్, జీవితాన్ని కొత్తగా ఆస్వాదించడానికి తోడ్పడిన స్నేహితుడి కోసం కృతజ్ఞతాపూర్వకంగా పాడిన గీతంలా తోస్తోంది. మొదటి రెండు వాక్యాలూ ఆకట్టున్నాయి –

నువ్వేమిచ్చావో నీకైనా అది తెలుసునా?
నేనేం పొందానో నా మౌనం నీకు తెలిపెనా!

“పోదాం ఎగిరెగిరిపోదాం” అంటూ సాగే హుషారు గీతం పర్యటనలకి విమానంలో ఎగిరిపోయే యాత్రికుల గీతం. ఇలాంటి పాటలో పర్యటన అంటే కేవలం వినోదయాత్ర కాదని, జీవితంలో నూతనోత్తేజం నింపుకోవడం అనీ, కొత్త అనుభూతులు పోగుచేసుకోవడం అనీ, కొత్త పరిచయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అనీ తెలియజెప్పే పల్లవి రాయడం ఒక్క సిరివెన్నెలే చెయ్యగలరు –

పోదాం ఎగిరెగిరిపోదాం
ఎందాకా అంటే ఏమో అందాం!
పోదాం ఇక్కణ్ణే ఉంటే
అలవాటై పోతాం మనకే మనం!
ఏ దారి పువ్వులే పరచి మనని రమ్మన్నదో ఆ దారిలో
ఎవ్వర్ని చూసినా నవ్వులే విరిసే హలో అనే హుషారులో!

“ఎప్పుడూ ఒక్కలా ఉండదు” అన్న పాట కూడా జీవితాన్ని వివరిస్తుంది, “ఒక లైఫ్” పాటలా. అయితే ఈ పాట ఒక రకమైన వేదాంత ధోరణిలో ఫిలసాఫికల్‌గా సాగుతుంది. సిరివెన్నెల రెండు చరణాలతో రాసిన పూర్తి నిడివి గల పాట ఇదొక్కట్టే ఈ సినిమాలో. మళ్ళీ ఈ పాటని కార్తీకే పాడాడు. జీవన గమనంలో కాదనలేని సత్యాలు రెండు – నిత్యం మార్పుని వెంటతెచ్చుకుని నడిచే “కాలం”, అనుబంధ బాంధవ్యాలతో, కష్టసుఖాలతో సాగే “పయనం” అన్నవి. ఈ రోజుని ఆస్వాదిస్తూనే అది ఇలాగే ఉండిపోవాలి అనుకోకూడదనీ, నిన్నటిని గుండెలో నింపుకుని రేపటిని స్వాగతిస్తూ సాగిపోవాలని సమయాన్ని జయించే చిట్కా సిరివెన్నెల చెబుతారు. పయనంలోని ఒడిదుడుకులని తట్టుకోడానికి గుండెనిబ్బరాన్ని, నిరంతరం తనని తానే అధిగమించుకునే ప్రయత్నాన్నీ, ఇబ్బందులని కూడా ప్రేమించే ధీమానీ సిరివెన్నెల బోధిస్తారు –

నీ ఊపిరే నీ తోడుగా
నీ ఊహలే నీ దారిగా
నిన్నే నువ్వు వెంటాడక
ఏ తీరం చేరవుగా
కష్టాలనే కవ్వించగా
కన్నీళ్ళనే నవ్వించగా
ఇబ్బందులే ఇష్టాలుగా
అనుకుంటే చాలు కదా!

ఇంత సీరియస్ పాటల మధ్య కాస్త తెరిపి ఇవ్వడానికా అన్నట్టు రెండు హుషారైన శృంగార గీతాలు ఉన్నాయీ ఆల్బంలో. సినిమా ఎంత ఉదాత్తమైనదైనా ఒక ఐటం సాంగు మటుకు ఉండాలి అన్నది తెలుగు సినిమాలలో తప్పనిసరి నియమం మరి! వేదాంతం చెప్పిన వెంటనే గీతాగోవిందం బోధించమంటే బావుండదని అనుకున్నారో ఏమో ఈ పాటలని సిరివెన్నెల చేత కాకుండా రామజోగయ్య శాస్త్రి గారి చేత రాయించారు. అలా చిన్న శాస్త్రి గారు, చిలిపి శాస్త్రిగా మారి రెండు రసగుళికలని పండించారు. ఈ రెంటిలో నన్ను అమితంగా ఆకట్టుకున్న పాట, “అయ్యో అయ్యో” అన్న సరసమైన యుగళ గీతం. ట్యూన్ ఇట్టే నచ్చేలా ఉంది. ఈ పాట ఖచ్చితంగా ఆల్బంలో హిట్ సాంగ్ అయ్యి తీరుతుంది. “సీతాకోక చిలకల గుంపు నడుమొంపుల్లో కితకితలాడే!” అంటూ మొదలెడుతూనే కొంటె కవిత్వంతో కట్టిపడేశారు రామజోగయ్య గారు! ఇలా “కితకితలతో” మొదలెట్టి, “పిటపిట”, “చిటపట”, “అట ఇట”, “కిటకిట”, “కటకట”, “గడగడ” వంటి అచ్చ తెలుగు నుడికారాలతో శృంగారాన్ని ఒలికించి రసహృదయాలని “లబలబ” లాడించారు –

పిల్లరంగు పిటపిటా
చెంగుచెంగు చిటపటా
కంటి ముందే అట ఇటా
తిప్పుకుంటూ తిరుగుతున్నదే!
ఒంపుసొంపు కిటకిటా
చెప్పలేని కటకటా
చూపుతోనే గడగడా
దప్పికేమో తీరకున్నదే!

రామజోగయ్య గారు రాసిన “డోర్ నెంబర్” అనే ఇంకో పాట ఫక్తు ఐటం సాంగ్. రొటీన్‌గా సాగే ట్యూన్ అస్సలు ఆకట్టుకోలేదు. అయినా ఈ పాటని బ్రతికించడానికి రామజోగయ్య గారు శతవిధాల ప్రయత్నించి ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి ప్రస్తావిస్తూ వెరైటీని కొత్తదనాన్నీ సాధ్యమైనంత నింపారు. ఆయన కష్టాన్ని గ్రహిస్తున్నా ఈ పాటని భరించడం మాత్రం కష్టమే అయ్యింది. మొత్తం పాటలో ఆకట్టుకునేది ఏదైనా ఉంటే అది గాయని గీతామాధురి చేసిన “వాయిస్ మాడ్యులేషన్”. తన సహజమైన గాత్రాన్ని మార్చి అబ్బురపరిచేలా హొయలు పలికించింది. ఈ పాట సోకాల్డ్ మాస్‌ని ఉర్రూతలూగిస్తుందేమో మరి చూడాలి!

మొత్తంగా చూస్తే ఈ ఆల్బం నాకు బాగానే నచ్చింది. సంగీతం ఇంకొంచెం బలంగా ఉంటే సిరివెన్నెల భావాలు మరింత గొప్పగా పండేవేమో అనిపిస్తుంది. ఒక్కసారి తప్పకుండా వినొచ్చు, పదే పదే వినాలంపించే పాటలూ కొన్ని ఉన్నాయి (నాకవి: “ఒక లైఫ్”, “అయ్యో అయ్యో” అన్న గీతాలు). ఆ మాత్రం చాలేమో ఈనాటి సినిమా అల్బంలకి! ఈ సినిమాలో పాటలని యూట్యూబులో ఇక్కడ వినొచ్చు:

పూల ఘుమఘుమ!

సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఉన్న ఒక క్రెడిట్ ఏమిటంటే ఏ ఇబ్బందీ లేకుండా అందరి ముందూ పాడగలిగే ఎన్నో శృంగారగీతాలు రాసి ఉండడం. మిగతా గీతరచయితలు లలితమైన శృంగారగీతాలు రాయలేదని కాదు కానీ, సిరివెన్నెల ఈ విషయంలో ఎక్కువ మార్కులు సంపాయిస్తాడు. కొన్ని పాటలకి సాహిత్యం చాలా మర్యాదగానే ఉన్నా, చిత్రీకరణ నాటుగా ఉండడం వల్ల అవి చెత్తపాటలుగా ముద్రపడిపోతాయి. “శ్రీ ఆంజనేయం” సినిమాలోని “పూల ఘుమఘుమ” అనే పాట ఇలాంటిదే. గొప్ప భావుకతతో రాసిన ఈ పాటని ఫక్తు మసాలా పాటలా చిత్రీకరించి దర్శకుడు కృష్ణవంశీ తీరని అన్యాయం చేశాడు! సంగీతపరంగా అతి చక్కని మెలొడీ ఇచ్చిన మణిశర్మకి చిత్రీకరణకి తగ్గట్టు ఇంటర్లూడ్లలో రసభంగం కలిగించే సంగీత విన్యాసాలు చేయాల్సి వచ్చింది ! ఫలితంగా “ఛార్మి” కంటే ఎంతో చార్మింగ్‌గా ఉన్న సాహిత్యానికి తగినంత పేరు రాలేదు! ఈ పాట గురించి కొన్ని ముచ్చట్లు.

పాట ఆడియో లింకు: పూల ఘుమఘుమ (raaga.com)

పాట సాహిత్యం:

పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా?
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా?
ప్రేమంటే పామని బెదరాలా ధీమాగా తిరగరా మగరాయడా!
భామంటే చూడని వ్రతమేలా పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా!
మారనే మారవా మారమే మానవా
మౌనివా మానువా తేల్చుకో మానవా

|| పూల ఘుమఘుమ ||

చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలుజడ చుట్టుకొని మొగలిరేకా నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో

|| పూల ఘుమఘుమ ||

ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్తపున్నాగనై
జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండననీ పొగడపూదండనై
నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమిచెంగల్వనై
మోజులే జాజులై పూయనీ హాయిని
తాపమే తుమ్మెదై తీయనీ తేనెని

|| పూల ఘుమఘుమ ||

ఓ ముద్దుగుమ్మ తనకు నచ్చిన అబ్బాయిని ఎంత అందంగా కవ్విస్తోంది అన్నది ఈ పాటలో విషయం. ప్రేమలో శృంగారాన్ని కలిపి, ఆ శృంగారభావాన్ని ఎంత అందంగా, మృదువుగా వ్యక్తపరుస్తోందో ఈ పాటలోని లలన! మనసులోని మాటని ఇంత రమణీయంగా వ్యక్తీకరించడం కేవలం అమ్మాయిల విషయంలోనే సాధ్యం. ఒక అబ్బాయి ఎంత భావుకతతో పాడినా ఇంత సొగసుని సాధించలేడు!

పల్లవి మొదలుపెట్టడమే ఎంతో గడుసుగా మొదలుపెట్టారు సిరివెన్నెల – పూల ఘుమఘుమనీ, తేనెమధురిమనీ కాదని ప్రవరాఖ్యుడిలా వెళ్ళిపోకు అని. చరణాల్లో పువ్వుల ప్రస్తావన ఉంది కాబట్టి “పూల ఘుమఘుమ” అంటూ మొదలుపెట్టడం చక్కగా ఉంది. “మారనే మారవా” అంటూ సాగే అనుపల్లవిలో శబ్దార్థ విన్యాసాలు ముద్దొచ్చేలా ఉంటాయి. అమ్మాయి ఇంత అందంగా పల్లవి పాడితే వలలో పడని అబ్బాయి ఉంటాడా అసలు?

అరవిందము (తామర/కమలము)
మల్లెపువ్వు
మొగలిపువ్వు

చరణాల్లో ప్రతి భావాన్నీ ఒక పువ్వుగా పరిమళింపజేశారు. “అరవిందము” అంటే కమలం/తామర, ఉదయం వికసించేది. “బంధమై అల్లుకో” అంటే ప్రేమబంధమే! “అరవిచ్చి అరవిందమయ్యే అందం” అనడం ఎంతో బాగుంది. అరవిచ్చడం (అంటే సగమే విచ్చడం) సంకోచాన్ని, సిగ్గుని సూచిస్తోందనుకుంటే, కమలంలా నిండుగా వికసించడానికి “నీ ప్రేమ అనే నమ్మకాన్ని” ఇవ్వు అనడం. “అరవిచ్చి” అన్నది అబ్బాయి పరంగా కూడా వాడి ఉండవచ్చు – “మాస్టారూ, కొంచెం మొహమాటం తగ్గించుకుని, నా దగ్గరగా రండి” అన్న అర్థంలో. “పెదాలపై ముద్దుపెట్టుకుని తీపిని తోడుకో” అనడానికి “మల్లెలే తుంచుకో” అనడం ఎంత భావుకత! ఇంత నాజుగ్గా అందంగా వాడిన మాటలే ముద్దుకంటే తియ్యగా ఉంటే ఇక వేరే ముద్దులెందుకని? వాలుజడ-మొగిలిరేకులు అన్నది ఒక అందమైన తెలుగింటి కాంబినేషన్. మొగలిపువ్వు పైన బిరుసుగా ఉన్నా, లోపలి రేకులు చాలా మృదువుగా పరిమళభరితంగా ఉంటాయి. “అబ్బాయి గారూ, మీలోని బెరుకుని పక్కనపెట్టి మనసులోపలి దాగిన మృదువైన ప్రేమని బైటపెట్టండి” అన్న సూచన. అందంగా నాతో కలిసి రా, సరదాగా ప్రేమకథ నడిపించుకో అన్న భావం.

మొదటి చరణం అంతా ఒక ఎత్తైతే, చివరి లైన్లు మాత్రం మరో ఎత్తు. ఒక కవ్వింత, ఒక ప్రణయభావం లేకపోతే పడుచుదనపు ఉత్సాహానికి అర్థం ఏమిటని? “వయసులో పరవశం” అంటే ఇదే. ఎంత మొహం తిప్పేసుకున్నా, అబ్బాయి వయసులో ఉన్న వాడే కదా! నన్ను మామూలుగా కాదు, వయసులోని పరవశం నిండిన కళ్ళతో చూడు. అప్పుడు నా అందం నీలో కలవరం కలిగించకపోతే అడుగు! ఒక్కసారి నా సొగసులో చిక్కుకున్నావా ఇక జీవితమంతా పరిమళభరితం – ప్రేమ పరిమళం, సొగసు పరిమళం, బ్రతుకు పరిమళం, అంత పరిమళమే! ఎంత అద్భుతంగా చెప్పాడండీ సిరివెన్నెల ఈ భావాన్ని!

పున్నాగ
నిద్రగన్నేరు

రెండో చరణం మొదటిలైన్లలో ఓ చమత్కారం చేశారు సిరివెన్నెల. “నీ ప్రతి ముద్దుతో నన్ను పున్నాగ పువ్వులా ఉదయించనీ” అంటూ ప్రారంభించి, “మత్తెక్కి అలసి నిద్రగన్నేరులా నీ కౌగిలిలో నిద్రించనీ” అంటూ ముగిస్తాడు. అంటే మెలకువ/మగత, పగలూ/రాత్రీ అనే పరస్పర వ్యతిరేకభావాలు రెండింటినీ శృంగారపరంగా పక్కపక్కనే చెప్పడం. విడమరిచి చెప్పకుండా ఊహకి వదిలేయడమే శృంగారరచనకి వన్నెతెస్తుంది. ఈ కిటుకు తెలిసిన ఘటికుడు సిరివెన్నెల! ఈ లక్షణాన్ని కూడా మొదటి రెండులైన్లలో చూడొచ్చు. తర్వాత లైన్లలో అనురాగాన్నీ, ప్రేమనీ పలికిస్తాడు. “నీ గుండెపై పొగడపూడండలా ఒదిగుండనీ” అనడం ఎంత లలితమైన వ్యక్తీకరణ! ఇక్కడ నన్ను గుండెల్లో పెట్టి చూసుకో అన్న ధ్వని కూడా ఉంది. నీ కంటికోనేట చెంగల్వనై నిలిచిపోనీ అంటుంది అమ్మాయి వెంటనే. ఊహించుకుంటే ఎంతో అందంగా ఉంది ఇది. “నీ కళ్ళలో నేనే కొలువుండాలి, ఇంకే అమ్మాయి వంకా నువ్వు కన్నెత్తి చూడకూడదు” అన్న హెచ్చరిక కూడా మరి ఉండే ఉండొచ్చు ఇలా అనడంలో! ఆఖరి లైన్లలో మళ్ళీ శృంగారం! మోజులన్నీ జాజులై హాయిని పూయాలట. వినడానికి ఎంత హాయిగా ఉందో! “తాపమే తుమ్మెద కాగా తేనెని ఆస్వాదిద్దాం” అంటూ ముగుస్తుందీ పాట. సాధారణంగా శృంగార గీతాల్లో పురుషుడిని తుమ్మెదతో, స్త్రీని పువ్వుతో పోల్చడం చూస్తూ ఉంటాం. ఇక్కడ సిరివెన్నెల మాత్రం జంట తుమ్మెదలమై ప్రణయ మకరందాన్ని తాగి పరవశిద్దాం అన్న అర్థాన్ని పలికించారు. దటీజ్ సిరివెన్నెల! రొటీన్ కి భిన్నంగా రాయడానికి ఎంతో తపిస్తారు.

పొగడ పువ్వు
చెంగల్వ

 

జాజి

 

స్పీడుకి మనం దాసోహమైపోయిన తరువాత, జీవితంలో లేతభావాలకి చోటు లేకుండా పోయింది. కవిత్వాన్ని అర్థం చేసుకునే తీరికా, ఓపికా ఎవరికీ లేకపోవడంతో సినిమా పాటలనుంచి కవిత్వం మరుగైపోయింది. స్వచ్చమైన శృంగారం సిగ్గుపడి మాయమైపోయింది. పువ్వులూ, పరిమళాలూ, తెలుగుదనాలు మన జీవితాల్లోంచి, తెలుగు సినిమా పాటల్లోంచి సవినయంగా సెలవు తీసుకున్నాయి. ఎడారిలో ఒయాసిస్సులా ఎప్పుడో ఇలాటి పాటలు వస్తాయి. వచ్చినప్పుడు ప్రసాదంలా కళ్ళకద్దుకుని పుచ్చుకోవడం, పాట వెనుక ఉన్న వ్యక్తులని స్మరించుకోవడమే మనం చెయ్యగలిగేది! ఈ పాట వరకూ హీరో సిరివెన్నెల. పూలఘుమఘుమల తేనెబాలునికీ, పసిడివెన్నెలల నిండు చంద్రునికీ ప్రణామాలు! జన్మదిన శుభాకాంక్షలు!

(మే 20, సిరివెన్నెల పుట్టినరోజు)

వేటూరిని ఎలా స్మరించుకోవాలి? – సిరివెన్నెల సీతారామ శాస్త్రి

(ఈ రోజు (మే, 22, 2011) వేటూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా, సిరివెన్నెల వేటూరి పోయినప్పుడు రాసిన ఓ ప్రచురితం కాని వ్యాసం నుంచి కొన్ని వాక్యాలు గ్రహించి ఇది చేశాను. ఈ టైటిల్ నాది. మాటలన్నీ సిరివెన్నెలవి!)

ఈనాడు మన తెలుగుసమాజంలో అనేకమంది పండితసమానులూ, మహామహులమనుకుంటున్న వారి దృష్టిలో “ఆఫ్ట్రాల్” అనిపించే సినీగేయ రచన ద్వారా శ్రీ వేటూరి వారు (ఆయన పేరు ముందు కీ.శే అని చేర్చడం నాకు ఇష్టం లేదు. ఆయన తన గీతాల ద్వారా శాశ్వతుడు) ఎంతో స్ఫూర్తి కలిగించారు…

నేనైనా, మరెవరైనా, ఎంత వారైనా సాహిత్యాన్ని “ఉద్దరించ”గలిగేంత అవతారపురుషులు ఎవరూ ఉండరు. కాలప్రవాహంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళుతుంటారు. అతి కొద్దిమంది మాత్రం శ్రీ వేటూరి గారిలా కాలాన్ని అధిగమించి శాశ్వత స్థానాన్ని శాసిస్తారు. ఆయన తర్వాత తరానికి చెందిన నాబోటి వాళ్ళు ఆయన సాధించిన ఆ ఘనతని ఆదర్శంగా, గమ్యంగా భావించి ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించాలి…

…ఎవరెస్టు శిఖరం ఒక్కటే ఉంటుంది. మొదట ఎవరు అధిరోహించారు అన్నదే చరిత్ర. తరువాత మరికొందరు ఆ శిఖరాన్ని అధిరోహించడం అన్నది చరిత్ర కాదు. శ్రీ వేటూరి గారు తొలిసారి ఎవరెస్టుని అధిరోహించారు…

వ్యక్తుల పట్ల కన్నా వారు నెలకొల్పిన “విలువల” పట్ల దృష్టి మళ్ళించాలి. సాహిత్యం శాశ్వతం, సాహితీకారుడు కాదు. పాట శాశ్వతం, “పాటసారి” కాదు.

సిరివెన్నెలతో మరో సాయంత్రం

ఈ రోజు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఆయన పుట్టినరోజు సందర్భంగా కొందరు మిత్రులతో పాటూ కలవడం జరిగింది. ఓ మూడు గంటలు ఆయన సమక్షంలో గడిపే భాగ్యం దక్కింది. గతంలో ఒకసారి ఆయన పుట్టినరోజుకే ఇలా మిత్రులతో కలిశాను. ఆ అనుభవాలని “సిరివెన్నెలతో ఓ సాయంత్రం” పేరున విపులంగా బ్లాగీకరించాను. ఇప్పుడు ఆ వ్యాసాలు చదివితే నేను మరిచిపోయినవి చాలా ఉన్నాయని తెలిసింది. సిరివెన్నెల గారితో సమయం గడిపితే మనలో నూతన ఉత్సాహం, ప్రేరణ కలుగుతాయ్. ఈ రోజు జరిగిన ముఖాముఖీలో నేను నేర్చుకున్న విషయాలు నాకు గుర్తున్నంతలో/అర్థమైనంతలో క్లుప్తంగా వివరిస్తాను. ఇది నాకోసం, అందరి కోసం కూడా!

  • పాటని సినిమా కోసం కాదు, నీకోసం రాసుకో. మనకోసం రాసుకున్నదే సినిమావాళ్ళకి నచ్చేలా ఒప్పించగలగడంలోనే కళా, కౌశలం దాగున్నాయి. ఒక రకమైన వస్తువుకే/అంశానికే పరిమితం కాకు. మనసుని స్పందింపజేసే అన్నిటిమీదా, జీవితంలోని ప్రతి అనుభవం మీదా రాస్తూ సాధన చేస్తూ ఉండు – అన్న నచకికి అభినందనపూర్వకంగా ఇచ్చిన సలహా.
  • పంచతంత్ర కథలూ, అరేబియన్ నైట్స్ వంటి కథల్లో చాలా జీవితం ఉంది –

    ఆలీబాబా కథలో నీతి ఏమిటంటే – నీకు కావలసిందేదో, ఎంతో తెలుసుకోమని. నలభై దొంగలూ సొమ్మైతే చాలా దోచారు కానీ వారి దృష్టిలో వాటి విలువ సున్నా. దొంగతనం వృత్తిగా చేస్తున్నారంతే. ఆలీబాబా అన్న అత్యాశకి పోయి మొత్తం సొమ్మంతా కావాలనుకుని, ఆ తొందరలో మంత్రం మరిచిపోయి దొంగల చేతిలో చచ్చాడు. చివరికి ఆలిబాబా దొంగలను గెలిచి తీసుకున్న సొమ్మెంత? రెండు జేబుల సరిపడా. బతకడానికి ఎంత సొమ్ము కావాలో అతనికి తెలుసు.

    అల్లాదీన్ కథలో, అల్లాదీన్ అద్భుతదీపాన్ని రెండు సార్లే వాడాడు. రాకుమారిని దక్కించుకోడం కోసం ఒకసారీ, రక్షించుకోడం కోసం ఇంకోసారి. అంతే కానీ నా పనులన్నీ నువ్వే చెయ్యి, నా తిండి నువ్వే తిను, నాకు ఇవితే, అవితే అనలేదు. నీ శక్తికి మించిన దానికి సాయం కావాలి కానీ, జీవించడానికి ఎందుకు?

  • dichotomy(ద్వంద్వత) లేకుండా జీవించాలి. జనం, సమాజం మిమ్మల్ని ఎలా ఉండాలనుకుంటోందో అలా ఉంటున్నవాళ్ళే ఎక్కువ. మీకేం కావాలో మీరు తెలుసుకోండి, మీలా మీరు ఉండండి.
  • ప్రతి వ్యక్తి గొప్పతనం వెనకా ఒక వ్యవస్థ ఉంది. గాంధీ, థెరీసా గొప్పవాళ్ళే, కానీ వాళ్ళ గొప్పతనానికి దోహదం చేసిన పరిస్థితులనూ, సమాజాన్ని మర్చిపోరాదు. అందుకే సిరివెన్నెల కూడా ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. జగమంత కుటుంబం అంటే ఇదే. ఈ ప్రపంచం అంతా నేనే, నేనే ప్రపంచం అనుకుని చూడండి – మీలో గొప్పతనం బయటకి వస్తుంది.
  • మీరు నాకు ఫేన్స్‌గా ఉండకండి, ఆ మాటకొస్తే ఎవరికీ ఫేన్స్ కావొద్దు. మీరే ఒక హీరో అవ్వండి.
  • Anything that becomes organized loses its power. జిడ్డు కృష్ణమూర్తి అందుకే తన ఆధ్యాత్మిక హోదానీ, మఠ సారధ్యాన్ని త్యజించాడు. నిరంతరం తర్కిస్తూ, నిరంతరం నేర్చుకుంటూ ఉండండి. ఒక ఆలోచనా ధోరణికో, ఒక సంస్థకో బద్ధులు కాకండి.

ఈ meeting లో మరికొన్ని విషయాలు –

  • గురువుగారు ఎంతో గౌరవించే “సత్యారావు మాస్టారు” గారు మాతో ఉండడమే ఈ పుట్టినరోజు విశిష్టత అని మాతో చెప్పారు. ఒక శిలని, గుళ్ళో శిల్పంగా మలిచిన ఘనత మాస్టారికే దక్కుతుందన్నారు. “జగమంత కుటుంబం నాది” పాటకి సజీవ ఉదాహరణ మాస్టారన్నారు. మాస్టారు మాట్లాడుతూ – “అంతా సిరివెన్నెలే చేసినది. నేనందించింది కొద్ది తోడ్పాటు మాత్రమే. సాధారణంగా గెలుపు తనవల్లేననీ, పరాజయం అందరివల్లా అనీ జనం భావిస్తారు. సిరివెన్నెల మాత్రం తన గెలుపు అందరి వల్లా అని చెప్పడం ఆయన సంస్కారం” అన్నారు.
  • గురువుగారు సినిమా రంగంలోకి వచ్చి పాతికేళ్ళు పూర్తైన సందర్భంగా మాస్టారు ఒక 4 రోజుల కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. 3 రోజులు విశాఖలో – సిరివెన్నెల అమ్మపైన, స్నేహం పైన, యువత పైనా, సమాజం పైన ఇలా వివిధ అంశాలపై రాసిన పాటలు గానం చేస్తారు. 1 రోజు హైదరాబాద్ లో సిరివెన్నెల తను పనిచేసిన దర్శకులు, సంగీత దర్శకులూ, హీరోల గురించి అనుభవాలను వివరిస్తారు.
  • మమ్మల్ని మాస్టారికి పరిచయం చేస్తూ – “వీరంతా చక్కని కుర్రాళ్ళు. యూత్ అంటే ఈ ఒక్క సినీ పరిశ్రమకే సదాభిప్రాయం లేదు. వాళ్ళు తాగుబోతులనీ, తిరుగుబోతులనీ, ఎందుకూ పనికిరారన్నట్టే చూపిస్తారు. వీళ్ళందరిలో ఏ ఒక్క అవలక్షణం లేదు. వీరే నాకు దక్కిన నిజమైన అవార్డులు. అంతే కానీ ఆ అవార్డు చెక్కముక్కలు కాదు” అన్నారు. గురూజీకి మాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికి అయినా నాలో కొన్ని మార్చుకోవాలన్న సంకల్పం కలిగింది.
  • గురువుగారు ఈ మధ్యే రాసిన పాటలోని ఓ రెండు వాక్యాలు ఆయనే హాస్యనటులు బ్రహ్మానందం గారితో ఫోన్‌లో మాట్లడుతున్నప్పుడు చెప్పడం జరిగింది –

               మన భాష మనసుకు తెలుసా

               మదిఘోష మనిషికి తెలుసా!

  • రామ జోగయ్య శాస్త్రి గారు వారి ఇద్దరి అబ్బాయిలతో వచ్చారు. వారి రెండవ అబ్బాయిని (పదేళ్ళు ఉంటాయేమో) సిరివెన్నెల మాకు పరిచయం చేస్తూ – “వీడు child prodigy. ఎలాంటి సన్నివేశం అయినా చెప్పండి, వెంటనే ట్యూన్ చెప్పేస్తాడు. హార్మోనియం పెట్టె ముందేసుకుని, ట్యూన్లు ఇవ్వడం అంటే అదో గొప్ప ఘనకార్యం అన్నట్టు ఫోజులు కొట్టే మ్యూజిక్ డైరెక్టర్లకి వీడిని చూసి బుద్ధి రావాలి.” అన్నారు. తర్వాత ఈ child prodigy తన ప్రతిభని మా ముందు ప్రదర్శించి అబ్బురపరిచాడు. గురువుగారు ఇచ్చిన ఒక అసాధారణ సన్నివేశానికి, గురువుగారు చెప్పడం పూర్తిచెయ్యగానే ఆశువుగా “తననా”లతో ట్యూన్ కట్టాడు. మేము గురువుగారి రూం నుండి బయటకి వచ్చాక RJS గారు ఈ అబ్బాయికి ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టడం చూసి ముచ్చటేసింది.

తెలియడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. గురువుగారి వాక్కులో శక్తి ఉంది. తెలిసిన విషయాలనే, ఆయన ద్వారా విన్న విషయాలనే అయినా మళ్ళీ ఒకసారి వింటే కొత్త ఉత్సాహం కలుగుతుంది. తీర్థం ప్రాప్తమయ్యింది, ప్రస్థానం మొదలుపెట్టాలి.