సుందరమో సుమథురమో!

(వేటూరి “హాసం” అనే ఒక పత్రికలో కొమ్మ కొమ్మకో సన్నాయి అనే శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలలో కొన్ని తర్వాత ఇదే పేరు గల ఒక పుస్తకంగా కూడ వెలువడ్డాయి. ఆ పుస్తకంలో కొన్ని విషయాలు అందరికీ తెలియాలని చేస్తున్న ప్రయత్నం ఇది.)

రాజపార్వై అనే తమిళ చిత్రాన్ని తెలుగులో కూడా ఏకకాలంలో తీయడం జరిగింది. ఇళయరాజాతో  నాకు అదే తొలి పరిచయం. అప్పుడే తమిళ కవి వైరముత్తుకు ట్యూన్ ఇచ్చాననీ, అప్పుడే ఆయన (అంటే నేను) వస్తే బాగుండేది కదా అన్న పుల్లవిరుపుతో ప్రారంభమైంది ఈ పరిచయం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారు ఏదో సర్ది చెప్పబోయారు. ఇదేదో బ్రతిమాలుడు వ్యవహారంగా తోచి నేను లేచి వెళ్ళబోయాను. తాను చాలా బిజీగా ఉన్నాననీ, తమిళ కవి ట్యూన్ ఇవ్వగానే అలా పల్లవి రాసిచ్చాడనీ, ఇప్పటికే తనకు లేటయ్యిందనీ – ఇదీ వరస….విరసంగా సాగింది.

“నేనూ చాలా బిజీయే…అలా చెప్పుకోవడం పద్ధతి కాదు….వస్తాను” అన్నాను.

“ఎన్నా సార్ – కవింగర్ కి కోపం వందదు పోలె ఇరిక్కే….సారీ సార్!” అంటూ ఆ ట్యూన్ వినిపించాడు ఇళయరాజా.

వినగానే ఆనందం కలిగింది. “ఇలా వినగానే తమిళకవి అలా రాసిచ్చాడు” అన్న మాట మదిలో మెదిలింది.  “ఎళుదుకురాంగళా” అన్నాను….”పల్లవి రాసుకుంటారా” అని.

“ఇప్పుడే చెప్పేస్తారా? అయితే చెప్పండి” అన్నాడు

సుందరమో సుమధురమో
చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో
మనసిజ రాగవశీకరమో

అని పల్లవి చెప్పాను. అది పాడుకుని చూసి, బయటకు పాడి వినిపించి,  “ఎంత మధురంగా ఉంది. ఆహా! సుందరత్తెలుంగు అని భారతి మహాకవి ఎందుకున్నాడో ఇప్పుడు తెలిసింది” అని నన్ను కూడా మెచ్చుకున్నాడు.

ఆ ముహూర్తమెటువంటిదో మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలీ కుసుమాలు వికసించాయి…

— “ఇద్దరూ ఇద్దరే! శృతి సుఖ సారే, రస నదీ తీరే” వ్యాసం. పే: 87-88

(ఈ పాట మొదట్లో వినిపించే “సరిగమపదని సప్తస్వరాలు మీకు, అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు” అనే అద్భుతమైన అంధబాలుల ప్రార్థనా గీతం పల్లవి కూడా వేటూరి ఆశువుగా 5 నిమిషాల్లో రాసెయ్యడం తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని సింగీతం వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పాట సంగీతం కూడా అద్భుతమే. ఇక్కడ చూడండి – )

ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది!

(వేటూరి “హాసం” అనే ఒక పత్రికలో కొమ్మ కొమ్మకో సన్నాయి అనే శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలలో కొన్ని తర్వాత ఇదే పేరు గల ఒక పుస్తకంగా కూడ వెలువడ్డాయి. ఆ పుస్తకంలో కొన్ని విషయాలు అందరికీ తెలియాలని చేస్తున్న ప్రయత్నం ఇది.)

ముందుగా వేటూరి స్మృతిగీతంగా తోచే ఈ పాట. దీనికి ఇక్కడ వినొచ్చు: ఏరెల్లి పోతున్నా

ప్రముఖ దర్శకుడు శ్రీ తాతినేని ప్రకాశరావు తీసిన “ఆశా జ్యోతి” చిత్రానికి పడవ పాట ఒకటి కావలసి వచ్చింది. సన్నివేశం చాలా ఉదాత్తమైనది. తన ప్రియుడు పడవలో గోదావరి దాటి వెళ్ళిపోతుంటే తన మనసు అతనికి చెప్పాలని పరుగు పరుగున వచ్చిన కన్నెపిల్ల. మాటకందని దూరంలో వెళ్ళిపోతున్న పడవలో ప్రియుడు. ఇదీ సన్నివేశం. ఇక్కడ పడవవాడు ఆ సన్నివేశంలో తను పాడుకునే ఓ పడవపాట. ఆ సన్నివేశానికీ, ఆ కన్నెపడుచు మనోభావానికి అద్దం పట్టే పాటగా ఉండాలి.

ఒకరిద్దరి చేత దర్శకుడు రాయించి రమేష్ నాయుడు గారికి ఇచ్చారు. కానీ నాయుడు గారికి ప్రేరణ కలగలేదు. కంపోజింగు ఆగిపోయింది. “ఏం చేద్దాం?” అన్నారు దర్శకులు. వెంటనే నాయుడుగారు విజయా గార్డెన్సుకు వచ్చి – “నాకో పాట కావాలి. సన్నివేశం నేను చెబుతాను. రాసి పెట్టండి” అన్నారు. ఆ తరువాత నేను చెబుతుంటే ఆయనే రాసుకున్నారు.

ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది
నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది
కోటిపల్లి రేవుకాడ సిలకమ్మ గొడవ
కోరంగి దాటింది గోరింక పడవ

ఇదీ పల్లవి! ఈ పల్లవి నేను చెప్పగానే ఆయన – “చరణాలు రాసి పంపండి. మనిషిని పంపుతాను. నా మటుకు నాకు పాట వచ్చేసింది” అని హుటాహుటిని వెళ్ళిపోయారు. ఆ పాట రికార్డింగుకి కూడా నేను వెళ్ళలేదు. అది వినిపించడానికి నాయుడు గారూ, ప్రకాశరావు గారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. చాలా ఆనందంతో ప్రకాశరావు గారు నన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆ పాట వింటే రమేష్ స్వరకల్పనా శిల్పం రేఖామాత్రంగా శ్రోతలకు దర్శనమిస్తుంది.

— “నాయుడు గారూ, నవమి నాటి వెన్నెల మీరు – దశమి నాటి జాబిలి నేను” వ్యాసం, పే: 104-105.

…ఆయన భౌతికంగా దూరమయ్యాక నేను ఆయనకు రాసిన పడవ పాటలోని ఈ చరణం ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది –

ఏటిపాప శాపమ్మ ఎగిసి తాను సూసింది
ఏడినావోడంటే ఏటిలోన మునిగింది
శాపమునిగినా కాడ శతకోటి సున్నాలు
శాపమైన గుండెలోన సెప్పలేని సుడిగుండాలు…
ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది
నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది!!

— పే: 113

తార తారకీ నడుమ ఆకాశం

తార తారకీ నడుమ ఆకాశం ఎందుకో
పాట పాటకీ నడుమ ఆవేశం అందుకే

వేటూరి రాసిన ఈ వాక్యాలు, “కల్పన” చిత్రంలో “ఒక ఉదయంలో” అనే పాట లోనివి. ఈ వాక్యాలు మొదటి సారి విన్నప్పుడు variety గా ఉన్నాయనిపించింది కాని అర్థం కాలేదు. తర్వాత వేటూరి ఒక interview లో ఈ వాక్యాలు ఉదహరిస్తూ, రాఘవేంద్ర రావు గారు ఈ పాట విని తనని కౌగిలించుకుని “ఇక నా సినిమాలన్నిటికీ మీరే writer” అన్నారని చెప్పారు. అప్పుడు “అబ్బో” అనుకుని తెగ కష్టపడినా అర్థం కొరుకుడు పడలేదు.

ఈ మధ్యే ఒక కవిత గురించి ఆలోచిస్తున్నాను. ఎంతకీ ఏమీ రాదే! మథనమో, జ్వలనమో, అలజడో ఏదైతేనే పడితే మెరుపులా ఒక ఊహ అదంతట అదే పుట్టుకొచ్చింది. కవిత అన్నది ఎప్పుడూ (ఆ మాటకొస్తే ఏ creative activity అయినా) ఆలోచన వల్ల పుట్టదు. అయితే ఆ mood and flow లోకి వెళ్ళడానికి ఆలోచనని సాధనంగా వాడతాం. మనలోని ప్రాణ చైతన్యం వల్ల వికసించే creativity ఉదయించే క్షణంలో ఆలోచన ఉండదు. అందుకే “creativity classes” లో “Empty your mind” అని చెబుతూ ఉంటారు. ఈ విధంగా చూస్తే ఒక రకమైన శూన్యం నుంచి creativity పుడుతుంది.

ఇప్పుడు ఈ angle లో పై వాక్యాలు చదవండి. “పాట” అంటే “కవిత” అన్న అర్థంలో వేటూరి వాడారని గ్రహించాలి. ఇక “ఆవేశం” అంటే కోపం + తొందరుపాటుతనంతో కూడినది అన్న అర్థంలో కాక passion అన్న అర్థంలో వేటూరి తరచూ వాడుతూ ఉంటారు (భావావేశం, కవితావేశం etc). కవితలోని ప్రతి creative ఊహకీ మధ్య (పాట పాటకీ నడుమ) passion or జ్వలనం అనే శూన్యం ఉంటుంది. ఇదెలా ఉంది అంటే తార తారకీ మధ్య ఆకాశం ఉన్నట్టు (ఆకాశం అంటే శూన్యమే కదా!).

అదండీ సంగతి! మీ మనసులో నక్షత్రాలు పుట్టించాలంటే మరి జ్వలించండిక!!

P.S ఇంతకీ వేటూరి భావం ఇదే కాదో తెలియదు కానీ, నేను మాత్రం “ఆహా” అనేసుకుని మనసులో ఒక దణ్ణం పెట్టేసుకున్నాను.

పంచదార ఎడారి !

mass పాటల్లో వేటూరిని మనం తిట్టుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే శ్రుతిమించిన ప్రయోగాలు, అర్థం పర్థం లేని పద-గారడీలు చాలానే చేశారు కనుక. అయితే చెత్త పాటల్లో కూడా అప్పుడప్పుడూ, అక్కడక్కడా కొన్ని మెచ్చదగిన ప్రయోగాలు చేసినప్పుడు మాత్రం మెచ్చుకోవాలి. “భలే దొంగలు” అనే ఒక కొత్త సినిమాలోని ఒక mass song పల్లవి చూడండి –

పంచదార ఎడారిలో పడుచు గుర్రం సవారిలో

variety గా ఉంది. “పంచదార ఎడారి” లాటి ప్రయోగాలు వేటూరే చెయ్యగలరు అనిపిస్తుంది.

మిగతా పాటలో పెద్ద విషయం లేదు…ట్యూన్ mass గా ఇస్తూనే చరణం మధ్యలో కాస్త classical touch ఉన్న bit వాడిన K.M. Radha Krishnan (music director)  మార్కులు కొట్టేస్తాడు. వేటూరి కూడా ఆ bit కి భావ ప్రధానమైన lyric  రాసి మురిపించారు –

తాకే తనువులలో తగిలే సొగసెంత?
సోకే వలపులలో రగిలే వయసంత!
….

అందే పెదవులలో చిందే మధువెంత?
పొందే ముడుపులకి ఉంది తగినంత !!

అలాగే కంత్రీ లో “వయస్సునామీ తాకెనమ్మీ” పల్లవి గల పాట.

ఇక్కడ “వయస్సునామీ” అన్న పద ప్రయోగం ముద్దుగా ఉంది, Tune కి ఎంతో perfect గా సరిపోయి, అందాన్ని తెచ్చింది. మిగతా పాటలో చెప్పుకునేందుకు పెద్ద ఏమీ లేదు…routine mass song…కొంత శ్రుతి మించింది ఏమో కూడా

ఆడవే హంసగమన

కొన్ని వాక్యాలు వింటే చాలా మాములుగా అనిపిస్తాయ్. పెద్ద గొప్ప అర్థం ఏమీ కనిపించదు. అలాటి మామూలు వాక్యాల్లో కూడా కొన్ని సార్లు మనకి తెలియని గొప్ప అర్థాలు ఉండచ్చు, ముఖ్యంగా వేటూరి లాంటి కవుల విషయంలో.

ఈ కింది వాక్యాలు చూడండి:

ఆడవే హంసగమన
నడయాడవే ఇందువదన

“విరాట పర్వం” అనే సినిమాలో NTR బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడిగా నటించారు. విరాటుని కొలువులో ఉంటూ “ఉత్తర”కి నాట్యం నేర్పిస్తున్నప్పుడు పాడే పాట ఇది.

చూస్తే “హంసలా ఆడు ఓ చంద్రుని వంటి మోము కలదానా” అనే మామూలు అర్థమే కనిపిస్తుంది నాలాటి సామాన్యులకి… వేటూరి విడమర్చి చెప్పేదాకా –

“నేను (వేటూరి) పాట రాసి ఇస్తే అది చూసి NTR గారు పక్కనే ఉన్న వెంకటకవి గారికి ఇచ్చారు.

ఆడవే హంసగమన, నడయాడవే ఇందువదన

అనే పల్లవి చూసి కవిగారు హంసగమనా ఆడవే అన్నారు, హంస నాట్యానికి ప్రసిద్ధి కాదు కదా అని అడిగారు.

వెంటనే నేను – అక్కడ మాట అంటున్నది పేడి అయిన బృహన్నల కాదు! అతనిలో దాగి ఉన్న నాట్యకోవిదుడైన అర్జునుడు. అతను హంసలనూ, నెమళ్ళనూ కాక అంతకన్న ఉదాత్తమైన, తన స్థాయికి తగిన ఉపమానోపమేయాలు తేవాలి కదా – అందుకే ఇక్కడ “హంస” శబ్దం సూర్యపరంగా వాడాను. క్రమం తప్పని గమనంలో సూర్యుడంతటి సమగమనం కలదానా అని అర్థం. అక్కడ హంస సూర్యపరంగా వాడాను కాబట్టే “నడయాడవే ఇందువదనా” అనడం! గమనశ్రమ ఎంత కలిగినా ఆహ్లాదకరమైన చంద్రుడి వదనమే కలదానా అనే అర్థంలో చెప్పడం జరిగింది” అన్నాను.

వెంకటకవి గారు ఆశువుగా ఏదో పద్యపాదం చదివి లేచి నన్ను కౌగిలించుకున్నారు. నా విషయంలో NTR గారు  ఆనాడు ఎంత తృప్తి వెల్లడించారో అక్కడే ఉన్న సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తిగారు పదే పదే చాలా కాలంగా ఆ సంఘటనే ప్రస్తావించేవారు. ”

అదండీ సంగతి! “ఊరక రాయరు మహానుభావులు” అని ఊరికే అన్నారా!

(వేటూరి “హాసం” అనే పత్రికలో రాసిన ఒక పాత వ్యాసం నుండి ఈ విషయం సంగ్రహించబడింది. ఈ వ్యాసాలు కొన్ని తర్వాత “కొమ్మ కొమ్మకో సన్నాయి” అనే పుస్తకంగా కూడా వచ్చాయి).