చందమామను చూచి వద్దామా

యండమూరి వీరేంద్రనాథ్ గారు ఫేస్‌బుక్‌లోప్రిన్స్ రామవర్మ” పాడిన ఓ కృతిని పెట్టి (ఆ పాటను YouTube లో ఇక్కడ చూడొచ్చు), “మా అమ్మ చిన్నప్పుడు ఈ పాట పాడేది” అన్నారు. ఆ పాట “చందమామము చూచి వద్దామా” అన్నది. చాలా మంది ఈ పాటని మెచ్చుకున్నారు. ఆ లింకుని ట్విట్టర్‌లో నాగరాజ్ పింగళి గారు పదే పదే మెచ్చుకోడంతో నేను ఈ పాట సంగతేదో చూచి వద్దామని వెళ్ళి వినగా చాలా బాగుందనిపించింది. ఆ సాహిత్యంలో ఏదో సొబగుంది, పాట ట్యూన్ చాలా చక్కగా ఉంది. వెరసి ఈ పాట వింటే మన మనసుని పట్టే పాటల లిస్టులో చేరింది.

ఈ పాట పుట్టు పూర్వోత్తరాలు ఏమిటా అని ఇంటర్నెట్‌లో ఆరాతీస్తే కొన్ని విషయాలు తెలిశాయి. ముఖ్యంగా హిందూ ప్రచురించిన ఆర్టికల్ ఉపయోగకరంగా ఉంది. ఈ పాటని రచించినది వాగ్గేయకారుడైన “శ్రీ యోగి నారేయణ యతేంద్ర“. కర్ణాటకలోని కైవర గ్రామానికి చెందిన ఈ మహాభక్తుడు తెలుగులోనే చాలా కృతులు రాశారుట. కర్ణాటకలోని “మేలుకోట” (దీనినే తిరునారాయణపురం అని కూడా అంటారుట) పట్టణంలో కొండపై వెలసిన “అమర నారేయణ స్వామి” ఇతనికి ఆరాధ్య దైవం.

పాట సాహిత్యాన్ని పరికిస్తే ఈ పాట మేలుకోటలో ఏటేటా జరిగే ప్రసిద్ధ ఉత్సవంలో స్వామి దివ్యమంగళ రూపాన్ని గూర్చి రాసినట్టుగా తోస్తోంది. పాట సాహిత్యం నెట్‌లో దొరకలేదు, రవివర్మ పాడిన దాంట్లో తెలుగు అంత స్పష్టంగా లేదు. కాబట్టి నాకు అర్థమైనంతలో సాహిత్యాన్ని, అర్థాన్నీ, పొందుపరుస్తున్నాను. తెలిసినవారు తప్పులని దిద్దగలరు. (సురేశ్ కొలిచాల గారు మొదలైన వారు తెలిపిన కొన్ని విషయాల ద్వారా ఈ వ్యాసంలో మార్పులు చేశాను. కామెంటులు చూడండి) 

పాట సాహిత్యం:

చందమామను చూచి వద్దామా సదానందా (2)

తల్లడించే తామసులను వెళ్ళవేసి వేవేగ
ఒళ్ళుమరచి తారకమున తెల్లవారేదనక మనము

|| చందమామను చూచి వద్దామా సదానందా ||

పంచబాణుని పారద్రోలి కుంజరమ్ముల కూలవేసి
మంటి మింటి రెంటి నడుమ ఒంటి స్తంభపు మేడ మీద

|| చందమామను చూచి వద్దామా సదానందా ||

శత్రులార్గురి చెంతచేరక ఇంద్రియాదుల వెంటబోక
మట్టు తెలిసి మేలుకోట పట్టణంబున చేరి ఇపుడు

|| చందమామను చూచి వద్దామా సదానందా ||

చదువులన్నీ చదివిచదివీ చచ్చిపోయేదింతె గానీ
గుట్టు తెలిపే గురుడు గల్గితే చూడవచ్చును సులభమున్నదీ

|| చందమామను చూచి వద్దామా సదానందా ||

అమర నారేయణ స్వామి ఆదిగురుని బోధచేత
తలచినప్పుడె తనువులోన తప్పకుండా చూడవచ్చును

|| చందమామను జూచి వద్దామా సదానందా ||

అర్థాలు:

చందమామ = అమర నారేయణ స్వామి దివ్య ప్రసన్న వదనం కావొచ్చు. (కామేశ్వర రావు గారు ఇది బిందుచక్రం కూడా కావొచ్చారు. కామెంటు చూడండి)

సదానందా = నిత్యము ఆనందంలో ఉండేది/ఉండేవాడు. కవి తన మనసునే సంబోధిస్తూ ఉండవచ్చు. స్వామిని దర్శించుకుంటే కలిగే ఆనందం. బ్రహ్మానందం.

తల్లడించే = బాధపెట్టే

తామసులు = తమో గుణం కలవారు. అయితే ఇక్కడ “తల్లడించే తామసులు” అన్నది మనలోపలి చెడ్డగుణాల గురించి కావొచ్చు.

తారకము = తారకము అంటే కంటి పాప అన్న అర్థం ఉంది. “చందమామను తెల్లవారేదనక కంటిపాపలో చూద్దాం” అన్న అర్థం కావొచ్చు.  తారకము అంటే ముక్తినిచ్చేది అనే అర్థంలో, “అన్నీ విడిచిన అవస్థలో ఒళ్ళుమరచి” అనే అర్థం కూడా తీసుకోవచ్చు.

పంచబాణుడు = మన్మధుడు, కామాధిపతి. మన్మధుడు అంటే శృంగారదేవుడని అనుకుంటాం కానీ, ఏ కోరికైనా కామమే. ఉదాహరణకి రోడ్డు మీద వెళుతూ ఓ మంచి కారుని చూసి మీరు “స్థంబించిపోవచ్చు” (నేటి భాషలో చెప్పాలంటే మైండ్ బ్లాంక్ అయిపోవడం), మీలో ఆ కారు కావలన్న “తపన” మొదలవ్వొచ్చు. మీరు “సమ్మోహితులై” ఆ కారు గురించే పదే పదే ఆలోచించి “శోషించి” పోవచ్చు (అంటే టైం మరియూ ఎనెర్జీ వేస్ట్ చేసుకోవడం అన్నమాట). ఇంకా శృతి మించితే ఉన్మాదంలో (అనగా పిచ్చి, కారుపై పిచ్చి) చిక్కుకోవచ్చు. ఈ ఉన్మాద, తపన, శోషణ, స్తంభన, సమ్మోహనములనే మన్మధుని పంచబాణాలుగా చెబుతారు.

కుంజరము = ఇక్కడ “కుంజరాలను కూలవేసి” అన్నది “అష్టమదాలను కూలవేసి” అన్న అర్థంలో వాడి ఉండవచ్చునని సురేశ్ కొలిచాల గారి ఊహ. అష్టమదాలంటే ధన మదం, కుల మదం, కండ (బల) మదం, పాండిత్య మదం, భోగ మదం, అధికార మదం, యౌవన మదం, రూప మదం.

మంటి = భూమి, మింటి = ఆకాశం, రెంటి మధ్యన ఉన్న ఒంటిస్తంభపు మేడగా వర్ణించినంది మేలుకోట కొండని కావొచ్చు. ఈ ఫొటో చూస్తే ఇదెంత చక్కని భావనో తెలుస్తుంది.

శత్రులార్గురు = ఆరుగురు శత్రువులు – అరిషడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు.

ఇంద్రియాదులు = ఇంద్రియాలు అంటే 5 senses అనుకోవచ్చు. ఇంద్రియాదులు అంటే ఇంద్రియాలు మొదలైనవి – అంటే మనసు, అహంకారం వంటివి అనుకుంటాను.

మట్టు = పరిమితి (limit) అన్న అర్థం తీసుకుంటే “తన పరిమితి తెలుసుకుని” అన్న అర్థం వస్తుంది. అంటే తాను అల్పుణ్ణి కాబట్టి స్వామిని ఆశ్రయించడం.

గురుడు = గురువు అని అర్థం ఉంది. పాటలో గురువుని రెండు సార్లు ప్రస్తావించారు. ఇక్కడ గురువు అంటే అమరనారేయణ స్వామా లేక కవి తన గురువుని ప్రస్తుతిస్తున్నాడా అన్నది తెలియదు.

తనువు = శరీరం

భావం:

ఓ మనసా, పద! చందమామ వంటి స్వామి మంగళ రూపాన్ని చూద్దాం.

బాధపెట్టే చెడ్డగుణాలని వెంటనే బయటకి నెట్టెయ్! పులకించిన భక్తిభావంతో తెల్లవారేదాకా మనం స్వామిని తిలకిద్దాం.

మన్మధుని పంచ బాణాల నుంచి తప్పించుకుని, , లోలోని అష్టమదాలని కూలదోసి కొండపై వెలసిన స్వామిని దర్శించుకుందాం.

అరిషడ్వర్గాలని జయించి, ఇంద్రియాదులనుంచి తప్పించుకుని, నీ అల్పత్వాన్ని ఎరిగి, పరమార్థాన్ని తెలిపే మన మేలుకోట పట్టణంలో వెలసిన స్వామిని చేరుకుందాం.

ఎన్ని చదువులు చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా చావుని చేరిపే అమరతత్త్వాన్ని పొందడం దుర్లభం. కానీ సులభమైన భక్తి మార్గం ఉంది, అమర నారేయణ స్వామిని సేవించుకో.

ఆ ఆదిగురువైన అమర నారేయణ స్వామిని భక్తితో తలచినంతనే నీకు తప్పకుండా స్వామి రూపం సాక్షాత్కరిస్తుంది.