గౌతమిపుత్ర శాతకర్ణి పాటలు

“కంచె” చిత్రంతో క్రిష్ – సిరివెన్నెల – చిరంతన్ భట్ కలిసి సృష్టించిన సంగీత సాహితీ దృశ్యకావ్యానికి పరవశించిన వాళ్ళలో నేనొక్కణ్ణి. మళ్ళీ అదే కాంబో “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రంలో కుదిరింది కాబట్టి ఈ సినిమా ఆడియోపై నా అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆల్బం మొదటిసారి విన్నప్పుడు బాణీలు అంతగా ఎక్కలేదు కానీ వినగా వినగా ఆకట్టుకునే సంగీతం. సిరివెన్నెల సాహిత్యం కూడా చక్కగా అమరింది.

చాలా కాలం తర్వాత ఉదిత్ నారాయణ్ గొంతు వినిపించిన “ఎకిమీడా నా జతవిడనని వరమిడవా, తగుతోడా కడకొంగున ముడిపడవా” అనే ప్రణయ యుగళ గీతం వినగానే ఆకట్టుకుని అలరించింది. నాకు ఆల్బంలో బాగా నచ్చిన పాట ఇదే. “ఎకిమీడు” అంటే రాజు అని అర్థం కనిపిస్తోంది నిఘంటువులో. ఇలాంటి అరుదైన పదాలను వాడిన సిరివెన్నెలని మెచ్చుకోవాలి. హుషారైన ట్యూన్ కుదిరిన ఈ పాటలో సిరివెన్నెల చాలా చక్కని పదాలని ట్యూన్‌కి బాగా కుదిరేటట్టు వాడి మురిపించారు. పల్లవిలోనే “డ” అక్షరంతో అందమైన వృత్త్యనుప్రాస వేసిన సిరివెన్నెల, “ఎండో వానో ఎవరికెరుక? ఏ వేళాపాళా ఎరుగననీ, ప్రతీరోజిలా నీతో పాటే నడుస్తు గడిస్తే ఎన్నాళ్ళైతేనేం, ఎటైతేనేం?” అంటూ ఎండైనా వానైనా ఏ మాత్రం చెదరని అనుబంధాన్ని అందంగా పలికించారు.

“గణగణ గణగణ గుండెలలో జేగంటలు మ్రోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయేలా, కణకణ కణకణ కన్నులలో కార్చిచ్చులు రేగెను చిక్కటి చీకటి ఎర్రగ రగిలించేలా” అనే పాట యుద్ధం చెయ్యడానికి వెళ్తున్న సైన్యం ఆలపించే యుద్ధగీతంలా ఉంది. ట్యూన్ నడక, సాహిత్యం చూస్తే “బాజీరావ్ మస్తానీ” చిత్రంలో “మహలింగ” పాట గుర్తొచ్చింది. ఆ పాటంత ఆకట్టుకోకపోయినా మంచి ట్యూనే. సిరివెన్నెల తన సాహిత్యంతో వీరరసాన్ని బాగా పలికించారు. “కీడంటే మన నీడే కదరా, నదురా బెదురా ముందుకు పదరా” వంటి పొందికైన పదాలు కలిగిన వాక్యాలు, చక్కని భావాలు ఉన్న పాట.

బాలూ గొంతులో వినిపించే శృంగార యుగళ గీతం “మృగనయనా భయమేలనే”. ఎన్నేళ్ళైనా కుర్రగానే ఉన్న బాలూ గొంతు ఈ పాటకి వన్నె తెచ్చింది. ఈ యుగళ గీతంలోనూ శ్రేయా ఘోషల్ మధురంగా గొంతు కలిపింది. పాటలో వినిపించే హిందుస్తానీ ఆలాపనలు బావున్నాయి. సాహిత్యపరంగా చూస్తే “మృగనయనా” వంటి చక్కని పదాలతో సిరివెన్నెల రాసిన పాట మురిపించింది. ముఖ్యంగా “అధరమదోలా అదిరినదేలా, కనుకొలకుల ఆ తడి తళుకేలా?” అంటూ సాగిన పల్లవి బాగా కుదిరింది. చరణంలో – “నా నరనరమున ఈ వెచ్చదనం, నా పౌరుషమా, నీ పరిమళమా?” అంటూ రాజసాన్నీ శృంగారాన్నీ కలిపిన భావం బావుంది.

“సాహో సార్వభౌమా సాహో” అన్న పాట శాతకర్ణి శౌర్యాన్నీ ఘనతనీ వర్ణించే పాట. మంచి ఎనెర్జీ ఉన్న ట్యూన్ ఆకట్టుకుంది. ఆర్కెస్ట్రైజేషన్ కొంచెం “కృష్ణం వందే జగద్గురుం” చిత్రంలో “జరుగుతున్నది జగన్నాటకం” పాటని గుర్తు తెచ్చింది. “కాలవాహిని శాలివాహన శకముగా ఘనకీర్తి పొందిన సుప్రభాత సుజాతవహ్ని, గౌతమీ సుత శాతకర్ణి, బహుపరాక్!” అంటూ ఎత్తుగడలోనే అద్భుతమైన పదభావచిత్రంతో మొదలెట్టిన సిరివెన్నెల పాటంతా అదే జోరుతో దూసుకెళ్ళారు.

ఆఖరుగా వినిపించే “సింగముపై లంఘించిన బాలుడి పేరు శాతకర్ణి” అన్న పాట బుర్రకథలా సాగుతూ శాతకర్ణి కథని చెప్పే పాట. మాటల రచయిత “సాయి మాధవ్” ఈ పాటతో గీతరచయితగా కూడా తన సత్తా చాటుకున్నారు. హృదయానికి హత్తుకునేలా రచన సాగింది. అయితే హిందీ చాయలతో సాగిన బాణీ, గాయకుడు “విజయ్ ప్రకాశ్” తెలుగు ఉచ్చారణా ఈ పాటని “తెలుగు బుర్రకథ” లా అనిపించనివ్వలేదు.

మొత్తంగా చూస్తే ఈ సినిమా పాటలు నేను ఊహించినట్టు “కంచె” అంత స్థాయిలో లేకపోయినా నిరాశ కలిగించలేదు.

మనసుని తాకే “ఊపిరి” గీతాలు

ఊపిరి” చిత్రానికి ఊపిరి సిరివెన్నెల రాసిన పాటలని చెప్పక తప్పదు. నిజానికి ఈ చిత్రానికి సిరివెన్నెల రాసిన పాటల్లో మరీ కొత్త భావాలు కానీ, వినూత్న ప్రయోగాలు కానీ పెద్దగా లేవు. ఆయన తన పాటల్లో తరచూ చెప్పే ఆశావహ దృక్పథం, మనిషితనం వంటి అంశాలే ఇక్కడా కనిపిస్తాయి. అయితేనేం హృదయానికి హత్తుకునేలా, బావుందనిపించేలా రాయడంలో సిరివెన్నెల కృతకృత్యులయ్యారనే చెప్పాలి.

సినిమాలో మొదటగా వినిపించే పాట “శంకర్ మహదేవన్” గాత్రంలో వినిపించే “బేబీ ఆగొద్దు” అన్నది. “గోపీ సుందర్” ఇచ్చిన ట్యూన్ అంతగా ఆకట్టుకునేలా లేదు, పైపెచ్చు ఆ “బేబీ” అని తరచూ అరవడం చిరాకు తెప్పించింది! అయితే జీవితాన్ని కారు ప్రయాణంతో పోలుస్తూ సిరివెన్నెల రాసిన చరణం మాత్రం మెరుస్తుంది. నిజానికి సిరివెన్నెల ఈ చరణంలో చెప్పినట్టు కారు నడిపితే డ్రైవింగ్ టెస్టు ఫెయిల్ అవ్వడమో, లేదా ఆక్సిడెంటు జరగడమో ఖాయం! కానీ జీవితాన్ని ఆయన చెప్పినట్టు నడిపిస్తే “లైఫ్ టెస్ట్” పాస్ అవుతాం, జీవితం ఓ ఆక్సిడంటుగా మారకుండా ప్రయోజకమౌతుంది –

అద్దం ఏం చూపిస్తుంది?
వెనకేదో ఉందంటుంది
మన కంటికి కనిపిస్తుందీ ముందున్నది!
బెల్టన్నది సీటుకి ఉంది
మదినెట్టా బంధిస్తుంది?
ఊహల్లో విహరిస్తుంటే…
దూసుకెళ్ళే ఈ జోరును ఆపే బ్రేకు లేదే!
దారులన్నీ మనవేగా, పోనీ ధీమాగా
తప్పైతే మళ్ళీ యూ-టర్న్ కొట్టేద్దాం!

జీవితాన్ని వివరించే పాట, నాకు ఆల్బంలో బాగా నచ్చిన పాట “ఒక లైఫ్” అన్నది. కార్తీక్ చక్కగా పాడిన ఈ గిటార్ ప్రాధాన్య గీతానికి ట్యూన్ కూడా బాగా కుదిరింది. చరణంలో సిరివెన్నెల ఎంతో ప్రతిభావంతంగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి, అవరోధాలను అధిగమించడానికి కావలసిన జ్ఞానబోధ చేసి ఉత్తేజపరుస్తారు –

ఏం? ఏం లేదని?
మనం చూడాలి గానీ
ఊపిరి లేదా ఊహలు లేవా?
నీకోసం నువ్వే లేవా?
చీకటికి రంగులేసే కలలెన్నో
నీ తోడై వస్తుండగా
ఒంటరిగా లేవని
ఆశకి కూడా ఆశని కలిగించేయ్!
ఆయువనేది ఉండేవరకూ
ఇంకేదో లేదని అనకు!
ఒక్కో క్షణమూ ఈ బ్రతుకూ కొత్తదే నీకు!

“విజయ్ ప్రకాష్” హృద్యంగా ఆలపించిన “నువ్వేమిచ్చావో” అనే బిట్ సాంగ్, జీవితాన్ని కొత్తగా ఆస్వాదించడానికి తోడ్పడిన స్నేహితుడి కోసం కృతజ్ఞతాపూర్వకంగా పాడిన గీతంలా తోస్తోంది. మొదటి రెండు వాక్యాలూ ఆకట్టున్నాయి –

నువ్వేమిచ్చావో నీకైనా అది తెలుసునా?
నేనేం పొందానో నా మౌనం నీకు తెలిపెనా!

“పోదాం ఎగిరెగిరిపోదాం” అంటూ సాగే హుషారు గీతం పర్యటనలకి విమానంలో ఎగిరిపోయే యాత్రికుల గీతం. ఇలాంటి పాటలో పర్యటన అంటే కేవలం వినోదయాత్ర కాదని, జీవితంలో నూతనోత్తేజం నింపుకోవడం అనీ, కొత్త అనుభూతులు పోగుచేసుకోవడం అనీ, కొత్త పరిచయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అనీ తెలియజెప్పే పల్లవి రాయడం ఒక్క సిరివెన్నెలే చెయ్యగలరు –

పోదాం ఎగిరెగిరిపోదాం
ఎందాకా అంటే ఏమో అందాం!
పోదాం ఇక్కణ్ణే ఉంటే
అలవాటై పోతాం మనకే మనం!
ఏ దారి పువ్వులే పరచి మనని రమ్మన్నదో ఆ దారిలో
ఎవ్వర్ని చూసినా నవ్వులే విరిసే హలో అనే హుషారులో!

“ఎప్పుడూ ఒక్కలా ఉండదు” అన్న పాట కూడా జీవితాన్ని వివరిస్తుంది, “ఒక లైఫ్” పాటలా. అయితే ఈ పాట ఒక రకమైన వేదాంత ధోరణిలో ఫిలసాఫికల్‌గా సాగుతుంది. సిరివెన్నెల రెండు చరణాలతో రాసిన పూర్తి నిడివి గల పాట ఇదొక్కట్టే ఈ సినిమాలో. మళ్ళీ ఈ పాటని కార్తీకే పాడాడు. జీవన గమనంలో కాదనలేని సత్యాలు రెండు – నిత్యం మార్పుని వెంటతెచ్చుకుని నడిచే “కాలం”, అనుబంధ బాంధవ్యాలతో, కష్టసుఖాలతో సాగే “పయనం” అన్నవి. ఈ రోజుని ఆస్వాదిస్తూనే అది ఇలాగే ఉండిపోవాలి అనుకోకూడదనీ, నిన్నటిని గుండెలో నింపుకుని రేపటిని స్వాగతిస్తూ సాగిపోవాలని సమయాన్ని జయించే చిట్కా సిరివెన్నెల చెబుతారు. పయనంలోని ఒడిదుడుకులని తట్టుకోడానికి గుండెనిబ్బరాన్ని, నిరంతరం తనని తానే అధిగమించుకునే ప్రయత్నాన్నీ, ఇబ్బందులని కూడా ప్రేమించే ధీమానీ సిరివెన్నెల బోధిస్తారు –

నీ ఊపిరే నీ తోడుగా
నీ ఊహలే నీ దారిగా
నిన్నే నువ్వు వెంటాడక
ఏ తీరం చేరవుగా
కష్టాలనే కవ్వించగా
కన్నీళ్ళనే నవ్వించగా
ఇబ్బందులే ఇష్టాలుగా
అనుకుంటే చాలు కదా!

ఇంత సీరియస్ పాటల మధ్య కాస్త తెరిపి ఇవ్వడానికా అన్నట్టు రెండు హుషారైన శృంగార గీతాలు ఉన్నాయీ ఆల్బంలో. సినిమా ఎంత ఉదాత్తమైనదైనా ఒక ఐటం సాంగు మటుకు ఉండాలి అన్నది తెలుగు సినిమాలలో తప్పనిసరి నియమం మరి! వేదాంతం చెప్పిన వెంటనే గీతాగోవిందం బోధించమంటే బావుండదని అనుకున్నారో ఏమో ఈ పాటలని సిరివెన్నెల చేత కాకుండా రామజోగయ్య శాస్త్రి గారి చేత రాయించారు. అలా చిన్న శాస్త్రి గారు, చిలిపి శాస్త్రిగా మారి రెండు రసగుళికలని పండించారు. ఈ రెంటిలో నన్ను అమితంగా ఆకట్టుకున్న పాట, “అయ్యో అయ్యో” అన్న సరసమైన యుగళ గీతం. ట్యూన్ ఇట్టే నచ్చేలా ఉంది. ఈ పాట ఖచ్చితంగా ఆల్బంలో హిట్ సాంగ్ అయ్యి తీరుతుంది. “సీతాకోక చిలకల గుంపు నడుమొంపుల్లో కితకితలాడే!” అంటూ మొదలెడుతూనే కొంటె కవిత్వంతో కట్టిపడేశారు రామజోగయ్య గారు! ఇలా “కితకితలతో” మొదలెట్టి, “పిటపిట”, “చిటపట”, “అట ఇట”, “కిటకిట”, “కటకట”, “గడగడ” వంటి అచ్చ తెలుగు నుడికారాలతో శృంగారాన్ని ఒలికించి రసహృదయాలని “లబలబ” లాడించారు –

పిల్లరంగు పిటపిటా
చెంగుచెంగు చిటపటా
కంటి ముందే అట ఇటా
తిప్పుకుంటూ తిరుగుతున్నదే!
ఒంపుసొంపు కిటకిటా
చెప్పలేని కటకటా
చూపుతోనే గడగడా
దప్పికేమో తీరకున్నదే!

రామజోగయ్య గారు రాసిన “డోర్ నెంబర్” అనే ఇంకో పాట ఫక్తు ఐటం సాంగ్. రొటీన్‌గా సాగే ట్యూన్ అస్సలు ఆకట్టుకోలేదు. అయినా ఈ పాటని బ్రతికించడానికి రామజోగయ్య గారు శతవిధాల ప్రయత్నించి ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి ప్రస్తావిస్తూ వెరైటీని కొత్తదనాన్నీ సాధ్యమైనంత నింపారు. ఆయన కష్టాన్ని గ్రహిస్తున్నా ఈ పాటని భరించడం మాత్రం కష్టమే అయ్యింది. మొత్తం పాటలో ఆకట్టుకునేది ఏదైనా ఉంటే అది గాయని గీతామాధురి చేసిన “వాయిస్ మాడ్యులేషన్”. తన సహజమైన గాత్రాన్ని మార్చి అబ్బురపరిచేలా హొయలు పలికించింది. ఈ పాట సోకాల్డ్ మాస్‌ని ఉర్రూతలూగిస్తుందేమో మరి చూడాలి!

మొత్తంగా చూస్తే ఈ ఆల్బం నాకు బాగానే నచ్చింది. సంగీతం ఇంకొంచెం బలంగా ఉంటే సిరివెన్నెల భావాలు మరింత గొప్పగా పండేవేమో అనిపిస్తుంది. ఒక్కసారి తప్పకుండా వినొచ్చు, పదే పదే వినాలంపించే పాటలూ కొన్ని ఉన్నాయి (నాకవి: “ఒక లైఫ్”, “అయ్యో అయ్యో” అన్న గీతాలు). ఆ మాత్రం చాలేమో ఈనాటి సినిమా అల్బంలకి! ఈ సినిమాలో పాటలని యూట్యూబులో ఇక్కడ వినొచ్చు:

శ్రీరామరాజ్యం సంగీతం – ఓ ఉడత స్పందన

ఇళయరాజా పాటలంటే ఇష్టం ఉండడం వలన ఆయన చేసిన కొత్త ఆల్బంస్ వింటూ ఉంటాను, ఏదైనా ఓ మంచి పాట ఉంటుందేమోనని. ఇళయరాజా ఇప్పుడు చేస్తున్న పాటల్లో ఒకప్పటి గొప్పతనం లోపిస్తున్నా,వెతుకుతూ ఉంటే అప్పుడప్పుడు ఓ మంచి ముత్యం దొరుకుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఎవరికీ పెద్ద తెలియని "ధనం" అనే సినిమాకి చేసిన "కన్నయకు ఏది ప్రియమో" పాట ఎంతో నచ్చింది నాకు (ఇది 2008 లో తీసిన తమిళ సినిమా, ఈ మధ్యే తెలుగులో రిలీజ్ చేసినట్టు ఉన్నారు. రాగా లో తెలుగు ఆల్బం లేదు. తమిళ పాట ఇక్కడ వినొచ్చు – కన్నయ్య పాట – తమిళ్ . కృష్ణ గారు అందించిన తెలుగు పాట లింకు ఇక్కడ – కన్నయ్య పాట – తెలుగు). మొన్న "శ్రీ రామ రాజ్యం" సినిమా ఆడియో రిలీజ్ అయ్యిందంటే, సరే రాజా ఎలా చేశాడో చూద్దాం అని విన్నాను. నా స్పందనని పంచుకునే ప్రయత్నమే ఈ టపా.

ఇది ఆడియో రివ్యూ కాదు. నాకు సంగీతం గురించి బొత్తిగా తెలియదు, కేవలం ఆస్వాదించడం తప్ప. రివ్యూ కావాలంటే సోదరుడు కార్తీక్ ఎంతో చక్కగా రాసిన ఈ టపా చదవండి – కార్తీక్ రివ్యూ . సౌమ్య ఈ సినిమా పాటల గురించి రాసిన టపా ఇక్కడ- సౌమ్య రివ్యూ

మొదటి సారి విన్నప్పుడు ఏమంత గొప్పగా అనిపించలేదు పాటలు. ఓ 2-3 సార్లు వింటే కొన్ని నచ్చాయి. వినగా వినగా ఇంకా నచ్చే అవకాశం ఉంది, రహ్మాన్ పాటల్లా. ఏవో గొప్ప పాటలు చేసెయ్యాలి అన్న తపన కన్నా, లలితంగా, అందరికీ అందేలా, నచ్చేలా చెయ్యాలన్న ప్రయత్నం ఎక్కువ కనిపించింది. అసలు బాపూ సినిమాల తీరే అంత, ఓ గొప్ప కళాఖండం సృష్టిస్తున్నాం అన్న భేషజం లేకుండా సింపుల్‌గా ఉంటాయి. ఈ పాటలూ అలాగే ఉన్నాయ్. గీతరచయిత జొన్నవిత్తుల వారు కూడా తన పాండిత్యం ప్రదర్శించడం కాకుండా అలతి అలతి పదాలతో సరళమైన రచన చేశారు. మొత్తంగా ఈ సినిమా పాటలు నాకు బానే నచ్చాయి. అద్భుతం అనిపించలేదు కానీ చాలా మంచి ఆల్బం అనే అనిపించింది.

  • జగదానందకారకా – మొత్తం ఆల్బం విన్నాక ఈ పాటే నేను మొదట హం చేసింది. అయితే చిత్రంగా ఈ పాట నాకు మరీ నచ్చలేదు. ఓ రెండు సార్లు విన్న తర్వాత బాగుందనిపించింది. ఇది hit song of the album కావొచ్చు. బహుశా ఈ పాటని ఇళయరాజా రెహ్మాన్ స్టైలులో మొత్తం పాటని అందరిచేతా పాడించి మిక్స్ చేసినట్టు ఉన్నాడు. male/female, solo/chorus కాంబినేషన్ పాటంతా వినిపిస్తుంది.
  • శ్రీరామ లేరా – ఇది ఈ చిత్రానికి misfit అనిపిస్తుంది. పల్లవికి ఇచ్చిన ట్యూన్ ఆధునికంగా ధ్వనిస్తోంది. చరణాలు ఫరవాలేదు.
  • "ఇది పట్టాభిరాముని ఏనుగురా" అనే జానపద గీతం రెండు సార్లు వినిపిస్తుంది. ట్యూన్ చిన్నదే, బాణీ క్యాచీగానే ఉంది. జానపాద యాసతో పాడిన తీరులో అక్కడక్కడా కొంత సహజత్వం లోపించిన భావం కలిగింది.
  • "రామ రామ అనే రాజమందిరం" కూడా జానపద శైలిలో సాగిన పాటే. "రాజమందిరం", "రామసుందరం" లాంటి చక్కని పద ప్రయోగాలు, ఇంకా చక్కని భావాలు పొదిగారు జొన్నవిత్తుల (ఈ పాట సాహిత్యం గురించి సౌమ్య రాసిన టపా ఇక్కడ – సౌమ్య –రామరామ  ). ఈ పాటలోనూ ట్యూను హుషారుగా ఆకట్టుకునేలా ఉంది.
  • "కలయా నిజమా" అనే పాట శోకగీతం. పల్లవి గొప్పగా అనిపించింది, చరణం కొంత తేలిపోయింది. ఫీల్ కొంత తగ్గింది చరణంలో.
  • "సీతా సీమంతం" – మొదటిసారి విన్నప్పుడు బోర్ కలిగింది. వినగా వినగా బానే అనిపించింది. గాయని శ్రేయాఘోషల్ చక్కగా పాడినా ఎందుకో తన గొంతు ఇలాంటి పౌరాణిక చిత్రాలకి అంత అతకదన్న భావన కలిగింది.
  • "దేవుళ్ళే మెచ్చింది" & "రామాయణము" – ఇవి రెండూ రామాయణ కథని సంక్షిప్తంగా లవకుశలు పాడే పాటలు. చిత్రా, శ్రేయా గొప్పగా పాడారు. సాహిత్యం చాలా బాగుంది. సంగీతం కూడా సాహిత్య భావానికి తగినట్లు ఇళయరాజా చేశాడు (ఈ సినిమా పాటలన్నీ ముందు రచన, తర్వాత సంగీతం అనుకుంటా). ముఖ్యంగా ఈ చరణాలకి కుదిరిన సంగీత సాహిత్యం నాలో చాలా స్పందన కలిగించింది. ఈ సినిమాలోని ఇంకే పాటకీ ఇంత స్పందన నాకు కలగలేదు –

చెదరని దరహాసం

కదిలెను వనవాసం

వదిలి రాణివాసం

వచ్చె మగని కోసం

తండ్రీ మాట కోసం

కొడుకూ తండ్రి కోసం

భార్య మగని కోసం

లక్ష్మన్న అన్న కోసం

జనమంతా ఆక్రోశం

  • సీతారామ చరితం – ఇదీ లవకుశలు పాడే పాట అనుకుంటా. అయితే చిత్రా, శ్రేయా కాక అనితా, కీర్తనా అనే అమ్మాయిలు పాడారు. పాత లవకుశ సినిమాలో రామకథ మొత్తాన్ని ఒకే పల్లవి గల పాటలో చెప్పినట్టు గుర్తు. ఈ సినిమాలో మూడు పాటల్లో చెప్పారు. పాట చక్కగానే ఉంది.
  • గాలీ నింగీ నీరు – సీతని రాముడు వనవాసానికి పంపించేటప్పుడు వచ్చే పాట. ఈ శోక గీతాన్ని బాలు చాలా ఫీల్‌తో పాడారు. అయితే ఏడ్చినప్పుడు మాత్రం కృతకంగా అనిపించింది. జొన్నవిత్తుల సాహిత్యం ఈ పాటలో మరోసారి మెరిసింది.
  • ఎవడున్నాడు – ANR మాటలు, బాలూ గానం కలిసిన పాట. ANR గొంతులో (ఈయన వాల్మీకి పాత్ర అనుకుంటా వేసింది) గంభీరత లేకపోవడం మరి సరిపోతుందో లేదో. ట్యూన్ చాలా క్యాచీగా ఉంది.

ఇవి కాక ఇంకా కొన్ని శ్లోకాలూ, మంగళాలూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే మంచి ఆల్బం అనే చెప్పాలి. సినిమాలో చూస్తే ఈ పాటలు ఇంకా బాగుండే అవకాశం కనిపిస్తోంది. నా మటుకు సాహిత్యానిదే కొంత పైచేయి సంగీతం కంటే. ఈ సినిమా వలన జొన్నవిత్తుల, ఇళయరాజా ఇద్దరికీ మరిన్ని తెలుగు సినిమాలు చేసే అవకాశం వస్తే అది మంచి పరిణామమే!

విలేజ్ లో వినాయకుడు!

గతంలో “ఆవకాయ్-బిర్యాని” తినిపించిన సంగీత దర్శకుడు మణికాంత్ కద్రి ఈ సారి తన సంగీత రసామృతాన్ని అందించారు “విలేజ్ లో వినాయకుడు” చిత్రంలో. ఈ చిత్రంలో పాటలన్నీ వనమాలి రాశారు. దర్శక (సాయి కిరణ్ అడివి) నిర్మాతల ఉన్నతమైన అభిరుచి ఈ ఆడియోలో కనిపిస్తుంది.

villagelovinayakudu

1. చినుకై వరదై

ఈ పాట వింటే చాలా కాలం తర్వాత ఒక చక్కని యుగళ గీతం, ప్రేమ గీతం విన్న భావన కలుగుతుంది. మంచి మెలొడీ ఇస్తూనే foot tapping number గా మలచడంలో సంగీత దర్శకుడు పూర్తిగా సఫలీకృతుడయ్యాడు. ఈ మధ్య అంతగా వినిపించని హరిహరన్ గొంతు మథురంగా ఈ పాటలో వింటాం.

సాహిత్య పరంగా వనమాలి ఎంత బాగో రాశారో తెలియలాంటే మచ్చుకి ఒక భావం –

తడి లేని నీరున్నదేమో
సడి లేని యద ఉన్నదేమో
నువు లేక నేనున్న క్షణమున్నదా?

ఈ పాట సాహిత్యంలో వినిపించే “విధిని ఎదిరించడం”, “అనుకోని మలుపు” లాటివి చూస్తే సినిమా సందర్భాన్నీ, కథనీ కూడా వనమాలి కొంత ఈ పాటలో స్పృశించారు అనిపిస్తుంది.

2. అహ నా పెళ్ళియంట!

మయాబజార్ లోని “అహ నా పెళ్ళియంట” పాట పల్లవిని, ట్యూన్ నీ తీసుకుని దాని చుట్టూ ఒక rap గీతాన్ని పొదిగిన వెరైటీ పాట ఇది. ఇందులో female voice (సౌమ్య) పాత మాయబజార్ పాట గొంతులానే అనిపించడం ఇంకో తమషా. సాహిత్యంలో కూడా

నీకు మూడు ముళ్ళంట, లోకమంత థ్రిల్లంట !

అంటూ కొంత modern touch కనిపిస్తుంది. మొత్తానికి ఈ పాట అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అనిపించింది.

3. నీలి మేఘమా

ఇదో అద్భుతమైన solo song. ఎంతో melodious గా, హాయిగా విన్న మొదటిసారే గుండెలకి హత్తుకుంటుంది. ట్యూనూ, పాటలో వినిపించే కోరస్ ఆకట్టుకునేలా ఉన్నాయ్. కార్తీక్ చాలా బాగా పాడాడు. సాహిత్యపరంగా ఒక భావ గీతంలా మలిచారు వనమాలి.

ఆ ఏటిగట్టు అల పాదాల తోటి
ఈ గుండె తడిమి తడిగురుతు చూపుతోంది

లాటి చక్కటి భావాలు ఉన్నాయ్. సాహిత్యాన్ని జాగ్రత్తగా వింటే సినిమాలో కథానాయకుడు పల్లెటూరు వచ్చి అక్కడి హీరోయిన్ కుటుంబంతో అనుబంధం ఏర్పరచుకుంటాడు అనిపిస్తుంది.

4. తీసే ప్రతి శ్వాస

సందర్భోచితంగా సాగుతున్న ఈ చిత్ర గీతాలలో ఒక శోక గీతం ఉండి తీరాలని ఊహించడం పెద్ద కష్టం కాదు. అదే ఇది. శోక గీతాన్నీ జనరంజకంగా మలచడంలో సంగీత దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు అనిపిస్తుంది. హరిహరన్ చక్కగా పాడిన ఈ పాటకి వనమాలి తగిన సాహిత్యాని అందించారు.

5. సూపర్మేన్ బ్రదర్ ని

“సూపర్మేన్ బ్రదర్‌నీ, స్పైడర్మేన్ కజిన్‌నీ” అంటూ trendy గా సాగే ఈ పాట సాహిత్యం వనమాలి లో ఇంకో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. బహుశా హీరో పిల్లల దగ్గర పాడే పాట కావొచ్చు ఇది. సంగీతం, గానం తగ్గట్టుగా ఉన్నాయ్. అయితే హోరు కొంత ఎక్కువై సాహిత్యం స్పష్టంగా వినిపించకపోవడం ఈ పాటలో ఒక లోపం అనిపించింది.

ఇవి కాక violin తో వినసొంపుగా వింపించే theme music ఈ ఆల్బంకి ప్రత్యేక ఆకర్షణ. “ముద్దుగారే యశోద” అన్నమయ్య గీతం కూడా రెండు సార్లు male and female voices లో వినిపించి రంజింపజేస్తుంది. ఈ గీతాన్ని కూడా సందర్భోచితంగా వాడి ఉంటారని భావించవచ్చు.

ఒక గొప్ప సంగీత సాహిత్య అనుభవం కావాలంటే ఈ ఆల్బం తప్పక వినండి – రాగలహరి

విన్నవీ నచ్చినవీ – గణేష్

స్రవంతి మూవీస్ నుంచి వస్తున్న ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె మేయర్. మొత్తం సిరివెన్నెల చేత రాయించే రవికిషోర్ గారు ఈ మధ్య ఎక్కువ రామ జోగయ్య శాస్త్రి (RJS) గారిచేత రాయిస్తున్నారు. ఇందులో 6 పాటలు ఉంటే 5 పాటలు RJS రాసినవే. ఈయన కూడా సిరివెన్నెల పంథాలో లలితమైన పదాలతో అశ్లీలత లేకుండా రాయడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయమే!
1. పల్లవి: తనేమందో
రచన: సిరివెన్నెల
సందర్భం: తొలి ప్రేమ గీతం. ప్రేయసి తనని ఇష్టపడ్డాక ప్రియుడు పరవశంలో పాడుకునే పాట
ప్రేమ గీతాల్లో సిరివెన్నెల ఇచ్చినన్ని expressions ఇంకెవరూ ఇవ్వలేదు అన్న మాట నిజమే అని మరో సారి నిరూపించే పాట ఇది. ఇలాటి వేల పాటలు రాశాకా కూడా –
కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో ఈ వెలుగును దాచాలంటే!
లాటి కొత్త expression ఇచ్చిన ఆయన ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం, ఈ పాట సాహిత్యానికి స్పందించకుండా ఉండలేం. ముఖ్యంగా మొదటి చరణం లిరిక్ చాలా బాగుంది.
2. పల్లవి: లల్లలై
రచన: RJS
సందర్భం: ప్రేమ జంట పాడుకునే హుషారు గీతం.
పల్లవి చాలా సింపుల్గా ఉంటూనే క్యాచీ గా ఉండేలా రాయడంలో RJS పూర్తిగా విజయం సాధించారు –
లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం
లల్లలై నువ్వే నేనై నేనే నువ్వై కనబడదాం!
మనం ఒకటైతే సరిపోదే, మన నీడలని ఏం చేద్దాం?
వాటినీ పక్కన నిలిపి, ఒకటిగ కలిపి ప్రేమని పేరెడెదాం!!
చరణాల్లో కూడా మంచి expressions ఇచ్చారు RJS –
కొంటె దిగులంతా అలికిందా
ఈ వయసున గిలిగింత!
తీగ లాగిందే నువ్వని
తొణికిందేమో పెంచిన ప్రేమంతా!!
మాస్ నీ, క్లాస్ నీ కూడా అలరించేలా రాయడం ఎలాగో ఈ పాట సాహిత్యం చూసి నేర్చుకోవచ్చు.
3. పల్లవి: తెలిసిన మాటే
రచన: RJS
సందర్భం: ఇదీ ప్రేమ గీతమే. అయితే ఈ సారి అమ్మాయి పాడే సోలో.
ఈ పాటలో కూడా మంచి expressions ఇచ్చారు RJS. పల్లవిలో వినిపించే ఈ వాక్యాలు నాకు నచ్చాయ్ –
చినుకైనా తడిలేని వాన
మనసంతా కురిసేనా ఈ సమయాన
హరివిల్లై కనిపించే నా నీడైనా!
తనువంతా ఒణికింది ఆనందాన
పదాల పొందికలో తన గురువుగారు సిరివెన్నెలని తలపించడం ఈ పాటలోనూ చూడొచ్చు. కొత్తదనానికి ఎప్పుడూ ప్రయత్నించడం ఈ వాక్యంలో కనిపిస్తుంది –
ఆకాశమా ఇకపైన నా లోకమే నీ పైన
నీ మెరుపుకే మెరుపందించనా
4. పల్లవి: రాజ కుమరీ
రచన: RJS
సందర్భం: ఇదీ ఒక హుషారు యుగళ గీతమే!
RJS రాసిన “జెన్నిఫర్ లోపెజ్” పాటా (జల్సా చిత్రం), “ఓం నమస్తే” పాటా (రెడీ చిత్రం) మీరు విని వుంటే మోడర్న్ ఇంగ్లీష్ expressions ఇస్తూ హిందీని కూడా అక్కడక్కాడా వాడి రాసే స్టైల్ ఒకటి కనిపిస్తుంది. ఇదే స్టైల్ లో సాగే పాట ఇది. నాకు ఇలాటివి అంతగా నచ్చవు (సాహితీ పరంగా) కానీ జనాలకు నచ్చొచ్చు. ఏదేమైనా సరికొత్త ప్రయోగాలు ఈ పాటలో RJS చేశారని చెప్పొచ్చు –
volcano వరదై వచ్చి అంటిస్తున్నా wild fire
all the sides ఆవిరిలోన ముంచేస్తాడీ జాదుగర్!
5. పల్లవి: చలొరె చలొరె
రచన: RJS
సందర్భం: పిల్లలతో హీరో పాడే పాట.
ఇది చాలా వెరైటీ పాట. పిల్లలకి నచ్చినవన్నీ హీరో చేస్తానూ ఇస్తానూ అంటూ పాడతాడు. modern & cute song ఇది. ఇంకేముంది RJS తనదైన స్టైల్ చూపించారు –
మన ఇష్టం మనమింతే ఉంటాం
ఆనందం మన oxygen అంటాం
school bag లైటై పోయే super technique చెప్తా
ఈజీగా గుర్తుండేలా syllabus మార్చేస్తా
mountain full of Maggi తెస్తా
fountain లా Fanta పొంగిస్తా!
ATMలో ice-cream ఇస్తా!!
6. పల్లవి: రాజా మహరాజా
రచన: RJS
సందర్భం: హీరో తన వ్యక్తిత్వం గురించి పాడే పాట. introductory song కావొచ్చు.
RJS అంటే నిజానికి ఇప్పటి దాకా నాకు మరీ అంత గొప్ప అభిప్రాయం లేదు. బాగా రాస్తారు అనుకున్నా అంతే. అయితే ఈ పాట విన్నాక ఆయన talent నాకు తెలిసొచ్చింది. ఈ పాట ట్యూన్ రచయితని కాస్త కష్టపెట్టేదే. అయినా RJS అలవోకగా పదాలు పొదిగారు. చరణాల్లో అద్భుతమైన భావాలు పలికించి సిరివెన్నెలని గుర్తు చేశారు –
చెట్టూ పుట్టా రాయీ రప్పా నవ్వే వీలుందా
పెదవికి నవ్వోటిస్తే చీ చీ పొమ్మంటుందా
చిటపటా చిర్రుబుర్రూ మంతో పుట్టిందా
చిటికేస్తే గలగల సందడి దిగి రాదా
మొత్తానికి చక్కటి సాహిత్యం ఉన్న ఆడియో.

స్రవంతి మూవీస్ నుంచి వస్తున్న ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె మేయర్. మొత్తం సిరివెన్నెల చేత రాయించే రవికిషోర్ గారు ఈ మధ్య ఎక్కువ రామ జోగయ్య శాస్త్రి (RJS) గారిచేత రాయిస్తున్నారు. ఇందులో 6 పాటలు ఉంటే 5 పాటలు RJS రాసినవే. ఈయన కూడా సిరివెన్నెల పంథాలో లలితమైన పదాలతో అశ్లీలత లేకుండా రాయడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయమే!

ganeshjustganesh

1. పల్లవి: తనేమందో

రచన: సిరివెన్నెల

సందర్భం: తొలి ప్రేమ గీతం. ప్రేయసి తనని ఇష్టపడ్డాక ప్రియుడు పరవశంలో పాడుకునే పాట

ప్రేమ గీతాల్లో సిరివెన్నెల ఇచ్చినన్ని expressions ఇంకెవరూ ఇవ్వలేదు అన్న మాట నిజమే అని మరో సారి నిరూపించే పాట ఇది. ఇలాటి వేల పాటలు రాశాకా కూడా –

కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో ఈ వెలుగును దాచాలంటే!

లాటి కొత్త expression ఇచ్చిన ఆయన ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం, ఈ పాట సాహిత్యానికి స్పందించకుండా ఉండలేం. ముఖ్యంగా మొదటి చరణం లిరిక్ చాలా బాగుంది.

2. పల్లవి: లల్లలై

రచన: RJS

సందర్భం: ప్రేమ జంట పాడుకునే హుషారు గీతం.

పల్లవి చాలా సింపుల్గా ఉంటూనే క్యాచీ గా ఉండేలా రాయడంలో RJS పూర్తిగా విజయం సాధించారు –

లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం

లల్లలై నువ్వే నేనై నేనే నువ్వై కనబడదాం!

మనం ఒకటైతే సరిపోదే, మన నీడలని ఏం చేద్దాం?

వాటినీ పక్కన నిలిపి, ఒకటిగ కలిపి ప్రేమని పేరెడెదాం!!

చరణాల్లో కూడా మంచి expressions ఇచ్చారు RJS –

కొంటె దిగులంతా అలికిందా

ఈ వయసున గిలిగింత!

తీగ లాగిందే నువ్వని

తొణికిందేమో పెంచిన ప్రేమంతా!!

మాస్ నీ, క్లాస్ నీ కూడా అలరించేలా రాయడం ఎలాగో ఈ పాట సాహిత్యం చూసి నేర్చుకోవచ్చు.

3. పల్లవి: తెలిసిన మాటే

రచన: RJS

సందర్భం: ఇదీ ప్రేమ గీతమే. అయితే ఈ సారి అమ్మాయి పాడే సోలో.

ఈ పాటలో కూడా మంచి expressions ఇచ్చారు RJS. పల్లవిలో వినిపించే ఈ వాక్యాలు నాకు నచ్చాయ్ –

చినుకైనా తడిలేని వాన

మనసంతా కురిసేనా ఈ సమయాన

హరివిల్లై కనిపించే నా నీడైనా!

తనువంతా ఒణికింది ఆనందాన

పదాల పొందికలో తన గురువుగారు సిరివెన్నెలని తలపించడం ఈ పాటలోనూ చూడొచ్చు. కొత్తదనానికి ఎప్పుడూ ప్రయత్నించడం ఈ వాక్యంలో కనిపిస్తుంది –

ఆకాశమా ఇకపైన నా లోకమే నీ పైన

నీ మెరుపుకే మెరుపందించనా

4. పల్లవి: రాజ కుమరీ

రచన: RJS

సందర్భం: ఇదీ ఒక హుషారు యుగళ గీతమే!

RJS రాసిన “జెన్నిఫర్ లోపెజ్” పాటా (జల్సా చిత్రం), “ఓం నమస్తే” పాటా (రెడీ చిత్రం) మీరు విని వుంటే మోడర్న్ ఇంగ్లీష్ expressions ఇస్తూ హిందీని కూడా అక్కడక్కాడా వాడి రాసే స్టైల్ ఒకటి కనిపిస్తుంది. ఇదే స్టైల్ లో సాగే పాట ఇది. నాకు ఇలాటివి అంతగా నచ్చవు (సాహితీ పరంగా) కానీ జనాలకు నచ్చొచ్చు. ఏదేమైనా సరికొత్త ప్రయోగాలు ఈ పాటలో RJS చేశారని చెప్పొచ్చు –

volcano వరదై వచ్చి అంటిస్తున్నా wild fire

all the sides ఆవిరిలోన ముంచేస్తాడీ జాదుగర్!

5. పల్లవి: చలొరె చలొరె

రచన: RJS

సందర్భం: పిల్లలతో హీరో పాడే పాట.

ఇది చాలా వెరైటీ పాట. పిల్లలకి నచ్చినవన్నీ హీరో చేస్తానూ ఇస్తానూ అంటూ పాడతాడు. modern & cute song ఇది. ఇంకేముంది RJS తనదైన స్టైల్ చూపించారు –

మన ఇష్టం మనమింతే ఉంటాం

ఆనందం మన oxygen అంటాం

school bag లైటై పోయే super technique చెప్తా

ఈజీగా గుర్తుండేలా syllabus మార్చేస్తా


mountain full of Maggi తెస్తా

fountain లా Fanta పొంగిస్తా!

ATMలో ice-cream ఇస్తా!!

6. పల్లవి: రాజా మహరాజా

రచన: RJS

సందర్భం: హీరో తన వ్యక్తిత్వం గురించి పాడే పాట. introductory song కావొచ్చు.

RJS అంటే నిజానికి ఇప్పటి దాకా నాకు మరీ అంత గొప్ప అభిప్రాయం లేదు. బాగా రాస్తారు అనుకున్నా అంతే. అయితే ఈ పాట విన్నాక ఆయన talent నాకు తెలిసొచ్చింది. ఈ పాట ట్యూన్ రచయితని కాస్త కష్టపెట్టేదే. అయినా RJS అలవోకగా పదాలు పొదిగారు. చరణాల్లో అద్భుతమైన భావాలు పలికించి సిరివెన్నెలని గుర్తు చేశారు –

చెట్టూ పుట్టా రాయీ రప్పా నవ్వే వీలుందా

పెదవికి నవ్వోటిస్తే చీ చీ పొమ్మంటుందా

చిటపటా చిర్రుబుర్రూ మంతో పుట్టిందా

చిటికేస్తే గలగల సందడి దిగి రాదా

మొత్తానికి చక్కటి సాహిత్యం ఉన్న ఆడియో.  ఈ పాటలు ఇక్కడ వినొచ్చు: రాగలహరి