వర్గం: వ్యాసాలు
వేటూరి పాటలో ఏముంది?
“రంజని” సాహితీ సంస్థ వారు వేటూరి స్మృతిగా “పాటల పూదోట వేటూరి” అని ఒక పుస్తకం వెలువరించారు. వేటూరికి నివాళిగా రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. కొన్ని వ్యాసాల్లో వేటూరి పాటలకి ఇచ్చిన వివరణలు వేటూరి జన్మదినం సందర్భంగా అందరితో పంచుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.
ఫ్రెంచి ఫిడేలు
ఒకసారి తనికెళ్ళ భరణి గారితో కలిసి నేనూ కొంతమంది మిత్రులం కార్లో రాజమండ్రి వెళుతున్నాం. వేటూరి గారి ప్రస్తావన వచ్చింది. “ఆ అంటే అమలాపురం” పాట పైకి వ్యాంప్ సాంగ్‌లా ఉన్నా లోపల ఎంతో చరిత్ర ఉందని నేనన్నాను. ఉదాహరణకి రాజమండ్రిని ప్రస్తావిస్తూ “చిత్రాంగి మేడల చీకట్ల వాడలో” అని ప్రయోగించారు వేటూరి. ఇది సారంగధ కథకు సంబంధించిన ప్రయోగం. అట్లే అదే పాటలో యానాం దగ్గర ఫ్రెంచి ఫిడేలు అనే పదం ప్రయోగించారు వేటూరి.
చారిత్రకంగా యానాం క్రీ.శ.1720లో ఫ్రెంచి వారి పాలనలోకి వెళ్ళింది కాబట్టి దాని ఆధారంగా వేటూరి “ఫ్రెంచి ఫిడేలు” అనే పదాన్ని ప్రయోగించారని నేనన్నాను. “అది కాకపోవచ్చయ్యా” అంటూ తనికెళ్ళ భరణి ఫోనందుకుని వేటూరి గారికే స్వయంగా ఫోన్ చేసి “గురువుగారూ, మీరు వాడిన ఫ్రెంచి ఫిడేలుకి అర్థమేంటి? మా వాడేదో చరిత్ర అంటున్నాడు” అని అడిగారు. భరణి గారు లౌడ్ స్పీకర్ ఆన్ చేశారు. అటునుండి మెల్లగా మార్దవంగా ఆ పుంభావ సరస్వతి మంద్ర స్వరంతో – “ఏముంది నాయనా. మనం చిన్నప్పుడు బళ్ళో చదువుకొనేటప్పుడు జేబుల్లో చేతులు పెట్టుకుని ఇబ్బందిగా చూస్తే “ఫిడేలు వాయిస్తున్నాడ్రా” అంటూ ఉండేవారు కదా” అంటూ చల్లగా చెప్పారు వేటూరి. ఇదీ వేటూరి విశ్వరూపమంటే
– ఆకెళ్ళ రాఘవేంద్ర, “గోదారమ్మ కుంకుంబొట్టు” వ్యాసం
(సారంగధ కథ ఏమిటో, ఈ ఫ్రెంచి ఫిడేలు అర్థం ఏమిటో నాకు ఇంకా తెలియలేదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పగలరు)
నవమి నాటి వెన్నెల
నవమి నాటి వెన్నెల నీవు
దశమి నాటి జాబిలి నేను
కలుసుకున్న ప్రతి రేయీ
కార్తీక పున్నమి రేయి
ఈ చిత్రంలో కథాపరంగా హీరోయిన్ జయసుధ కొత్త కుర్రాడైన హీరో కంటే పెద్దది కాబట్టి ఆమెను ముందుపుట్టిన నవమి నాటి వెన్నెలతో పోల్చి గూఢార్థంతో గుండెలకు అద్దారు వేటూరి.
– వడ్డేపల్లి కృష్ణ, “సాటిలేని మేటి భావాల స్ఫూర్తి వేటూరి సుందరరామమూర్తి” వ్యాసం
యంగోత్రి, ఖంగోత్రి
ఒక విద్యార్థిని ప్రశ్న: మీరొక పాటలో యంగోత్రి, ఖంగోత్రి అనే కొత్త మాటలు ఉపయోగించారు. వాటిని ఎందుకు ఉపయోగించారు. వాటి అర్థం ఏమిటి?
వేటూరి: ఇవి అర్థం కాని పదాలు కావు. “యంగోత్రి” అంటే కుర్రదనీ, “ఖంగోత్రి” అంటే “కంగారుపడే యువతి” అనీ అర్థం. కొత్తపదాలు సృజించకుండా ఉంటే భాష ఎలా వృద్ధి చెందుతుంది? “మాయాబజారు”లో పింగళి గారు ఘటోత్కచుడి చేత “వెయ్యండయ్యా వీరతాడు” అనిపిస్తాడు. అలా కొత్తమాటలు పుట్టిస్తూ ఉండాలి. ఇప్పుడొస్తున్న కొత్త ట్యూన్లకి, కొత్త పద్ధతులకీ కొన్ని విన్యాసాలు తప్పనిసరి. “సావిత్రి” అనే పదం ఉందనుకోండి, ఆ పదాన్ని ఉపయోగించుకుని, “చలి సావిత్రి”, “సందిట్లో చలిసావిత్రి” అనే ప్రయోగాలు చేశాం. ఘన సంస్కృతికి సంబంధించిన నామవాచకంతో కొన్ని పదాలు కలిసినప్పుడు ఆ చమత్కారాలు నిలబడతాయి. యంగోత్రి, ఖంగోత్రి అంటే అక్కడ “త్రి” అనేది అంత్యప్రాసగా వస్తోంది. నడక కలిసిన నవరాత్రి అని వస్తుందనుకుంటాను – త్రి, త్రి అని రావడం వల్ల చమత్కారంగా ఉంటుంది కాబట్టి కొత్త పదాలు పడ్డాయి.
– వేటురితో కళాశాల విద్యార్థినుల ఇంటర్వ్యూ వ్యాసం
బావరో బావర్చి
ఒకసారి నేను గురువుగారితో కలిసి హైదరాబాద్‌లో కారులో వెళ్తున్నాను. “ఇంద్ర” సినిమాకు అర్జెంటుగా పాట రాసివ్వాలి. అవతల ఒత్తిడి. ఈ ట్రాఫిక్ నుంచి బయటపడేదెప్పుడు? గురువు గారు పాట రాసేదెప్పుడు? నాకు ఒకటే టెన్షన్. నల్లకుంట నుంచి చిక్కడపల్లి మా ప్రయాణం. “తేజ గారూ (నన్ను అలాగే పిలిచేవారు), పాట ఫస్ట్ లైన్ రాసుకోండి అంటూ “అమ్మడూ అప్పచ్చీ, నువ్వంటేనే పిచ్చి” అన్నారు. నేను స్టన్ అయ్యాను. రెండో లైను చెబుతారేమోనని నేను ఆసక్తిగా చూస్తున్నాను. బావర్చీ హోటల్ దగ్గర ట్రాఫిక్ స్తంభించిపోయింది. గురువుగారు అటువైపు చూస్తూ “బావర్చి అంటే తెలుసా?” అన్నారు. “తెలియదు గురువుగారు” అన్నాను. బావర్చి అంటే వంటవాడు అన్నారాయన. ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అనుకున్నాను. అంతలోనే ఆయన – ఇప్పుడు రెండో లైను రాసుకోమంటూ “బావరో బావర్చి, వడ్డించు వార్చి” అనేశారు. నాకు నోట మాట రాలేదు. ఆ పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పాట రాయడానికి ఆయన ప్రత్యేకించి సమయం తీసుకోరు. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన మనసంతా పాటై పరవళ్ళు తొక్కుతున్నప్పుడు, మళ్ళీ ప్రత్యేకించి సమయం కావాలా? అనుకున్నాను.
– వేటూరి శిష్యుడు ధర్మతేజ, “దొరకునా ఇటువంటి సేవ” వ్యాసం
“ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు” అని అన్నమయ్య ఒక కీర్తనలో అన్నాడు. ఇది వేటూరికీ వర్తిస్తుంది. కొన్ని సార్లు ఆయన చాలా అల్పుడనిపిస్తాడు, అంతలోనే మహోన్నతుడనిపిస్తాడు. “గంగిగోవు పాలు గరిటెడైనా చాలు” అనుకుని ఆయన గొప్ప గీతాలని మనసుకి హత్తుకున్నప్పుడల్లా కలిగే స్పందన అనిర్వచనీయం. అందుకే ఆయన మహాకవి. ఆయనకి అంజలి ఘటిస్తూ, ఆయన్నుంచి ప్రేరణ పొందుతూ, “పాటై బ్రతుకైన పసివాడికి” వినమ్రంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
వేటూరి – పాటసారి డైరీలోంచి 2
“సీతారామయ్యగారి మనవరాలు” తరువాత నేను రాసిన తెలుగు పాటల్లో నేనే తెలుగుతనాన్ని వెతుక్కోవలసిన స్థితిలో పడ్డాను – వేటూరి
వేటూరి రాసిన కొన్ని పాటల్లో నిజాయితీ కనిపించకపోవచ్చు, కానీ ఆయన మాటల్లో ఎప్పుడూ నిజాయితీ ధ్వనిస్తుంది. ఇలా నిజాయితీ నిండిన వ్యాసం ఇది. ఇందులో తెలుగు భాషపై వేటూరికున్న మమకారం, “సినీ తెలుగు భాష” గురించి ఆవేదనా కనిపిస్తాయ్. ఆయన తన కోసం రాసుకున్న పాటలూ, ఆత్మసంతృప్తి కలిగించిన పాటలూ కొన్ని మన మనసులని పలకరిస్తాయి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా స్పందించకుండా ఉండలేము. సాహితీ అభిమానులూ, వేటూరి అభిమానులూ తప్పక చదవవలసిన ఈ చక్కని వ్యాసం ఇక్కడ – http://goo.gl/j6Uz2
వేటూరిని ఎలా స్మరించుకోవాలి? – సిరివెన్నెల సీతారామ శాస్త్రి
(ఈ రోజు (మే, 22, 2011) వేటూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా, సిరివెన్నెల వేటూరి పోయినప్పుడు రాసిన ఓ ప్రచురితం కాని వ్యాసం నుంచి కొన్ని వాక్యాలు గ్రహించి ఇది చేశాను. ఈ టైటిల్ నాది. మాటలన్నీ సిరివెన్నెలవి!)
ఈనాడు మన తెలుగుసమాజంలో అనేకమంది పండితసమానులూ, మహామహులమనుకుంటున్న వారి దృష్టిలో “ఆఫ్ట్రాల్” అనిపించే సినీగేయ రచన ద్వారా శ్రీ వేటూరి వారు (ఆయన పేరు ముందు కీ.శే అని చేర్చడం నాకు ఇష్టం లేదు. ఆయన తన గీతాల ద్వారా శాశ్వతుడు) ఎంతో స్ఫూర్తి కలిగించారు…
నేనైనా, మరెవరైనా, ఎంత వారైనా సాహిత్యాన్ని “ఉద్దరించ”గలిగేంత అవతారపురుషులు ఎవరూ ఉండరు. కాలప్రవాహంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళుతుంటారు. అతి కొద్దిమంది మాత్రం శ్రీ వేటూరి గారిలా కాలాన్ని అధిగమించి శాశ్వత స్థానాన్ని శాసిస్తారు. ఆయన తర్వాత తరానికి చెందిన నాబోటి వాళ్ళు ఆయన సాధించిన ఆ ఘనతని ఆదర్శంగా, గమ్యంగా భావించి ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించాలి…
…ఎవరెస్టు శిఖరం ఒక్కటే ఉంటుంది. మొదట ఎవరు అధిరోహించారు అన్నదే చరిత్ర. తరువాత మరికొందరు ఆ శిఖరాన్ని అధిరోహించడం అన్నది చరిత్ర కాదు. శ్రీ వేటూరి గారు తొలిసారి ఎవరెస్టుని అధిరోహించారు…
వ్యక్తుల పట్ల కన్నా వారు నెలకొల్పిన “విలువల” పట్ల దృష్టి మళ్ళించాలి. సాహిత్యం శాశ్వతం, సాహితీకారుడు కాదు. పాట శాశ్వతం, “పాటసారి” కాదు.
సిరివెన్నెలతో మరో సాయంత్రం
ఈ రోజు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఆయన పుట్టినరోజు సందర్భంగా కొందరు మిత్రులతో పాటూ కలవడం జరిగింది. ఓ మూడు గంటలు ఆయన సమక్షంలో గడిపే భాగ్యం దక్కింది. గతంలో ఒకసారి ఆయన పుట్టినరోజుకే ఇలా మిత్రులతో కలిశాను. ఆ అనుభవాలని “సిరివెన్నెలతో ఓ సాయంత్రం” పేరున విపులంగా బ్లాగీకరించాను. ఇప్పుడు ఆ వ్యాసాలు చదివితే నేను మరిచిపోయినవి చాలా ఉన్నాయని తెలిసింది. సిరివెన్నెల గారితో సమయం గడిపితే మనలో నూతన ఉత్సాహం, ప్రేరణ కలుగుతాయ్. ఈ రోజు జరిగిన ముఖాముఖీలో నేను నేర్చుకున్న విషయాలు నాకు గుర్తున్నంతలో/అర్థమైనంతలో క్లుప్తంగా వివరిస్తాను. ఇది నాకోసం, అందరి కోసం కూడా!
- పాటని సినిమా కోసం కాదు, నీకోసం రాసుకో. మనకోసం రాసుకున్నదే సినిమావాళ్ళకి నచ్చేలా ఒప్పించగలగడంలోనే కళా, కౌశలం దాగున్నాయి. ఒక రకమైన వస్తువుకే/అంశానికే పరిమితం కాకు. మనసుని స్పందింపజేసే అన్నిటిమీదా, జీవితంలోని ప్రతి అనుభవం మీదా రాస్తూ సాధన చేస్తూ ఉండు – అన్న నచకికి అభినందనపూర్వకంగా ఇచ్చిన సలహా.
- పంచతంత్ర కథలూ, అరేబియన్ నైట్స్ వంటి కథల్లో చాలా జీవితం ఉంది –
ఆలీబాబా కథలో నీతి ఏమిటంటే – నీకు కావలసిందేదో, ఎంతో తెలుసుకోమని. నలభై దొంగలూ సొమ్మైతే చాలా దోచారు కానీ వారి దృష్టిలో వాటి విలువ సున్నా. దొంగతనం వృత్తిగా చేస్తున్నారంతే. ఆలీబాబా అన్న అత్యాశకి పోయి మొత్తం సొమ్మంతా కావాలనుకుని, ఆ తొందరలో మంత్రం మరిచిపోయి దొంగల చేతిలో చచ్చాడు. చివరికి ఆలిబాబా దొంగలను గెలిచి తీసుకున్న సొమ్మెంత? రెండు జేబుల సరిపడా. బతకడానికి ఎంత సొమ్ము కావాలో అతనికి తెలుసు.
అల్లాదీన్ కథలో, అల్లాదీన్ అద్భుతదీపాన్ని రెండు సార్లే వాడాడు. రాకుమారిని దక్కించుకోడం కోసం ఒకసారీ, రక్షించుకోడం కోసం ఇంకోసారి. అంతే కానీ నా పనులన్నీ నువ్వే చెయ్యి, నా తిండి నువ్వే తిను, నాకు ఇవితే, అవితే అనలేదు. నీ శక్తికి మించిన దానికి సాయం కావాలి కానీ, జీవించడానికి ఎందుకు?
- dichotomy(ద్వంద్వత) లేకుండా జీవించాలి. జనం, సమాజం మిమ్మల్ని ఎలా ఉండాలనుకుంటోందో అలా ఉంటున్నవాళ్ళే ఎక్కువ. మీకేం కావాలో మీరు తెలుసుకోండి, మీలా మీరు ఉండండి.
- ప్రతి వ్యక్తి గొప్పతనం వెనకా ఒక వ్యవస్థ ఉంది. గాంధీ, థెరీసా గొప్పవాళ్ళే, కానీ వాళ్ళ గొప్పతనానికి దోహదం చేసిన పరిస్థితులనూ, సమాజాన్ని మర్చిపోరాదు. అందుకే సిరివెన్నెల కూడా ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. జగమంత కుటుంబం అంటే ఇదే. ఈ ప్రపంచం అంతా నేనే, నేనే ప్రపంచం అనుకుని చూడండి – మీలో గొప్పతనం బయటకి వస్తుంది.
- మీరు నాకు ఫేన్స్‌గా ఉండకండి, ఆ మాటకొస్తే ఎవరికీ ఫేన్స్ కావొద్దు. మీరే ఒక హీరో అవ్వండి.
- Anything that becomes organized loses its power. జిడ్డు కృష్ణమూర్తి అందుకే తన ఆధ్యాత్మిక హోదానీ, మఠ సారధ్యాన్ని త్యజించాడు. నిరంతరం తర్కిస్తూ, నిరంతరం నేర్చుకుంటూ ఉండండి. ఒక ఆలోచనా ధోరణికో, ఒక సంస్థకో బద్ధులు కాకండి.
ఈ meeting లో మరికొన్ని విషయాలు –
- గురువుగారు ఎంతో గౌరవించే “సత్యారావు మాస్టారు” గారు మాతో ఉండడమే ఈ పుట్టినరోజు విశిష్టత అని మాతో చెప్పారు. ఒక శిలని, గుళ్ళో శిల్పంగా మలిచిన ఘనత మాస్టారికే దక్కుతుందన్నారు. “జగమంత కుటుంబం నాది” పాటకి సజీవ ఉదాహరణ మాస్టారన్నారు. మాస్టారు మాట్లాడుతూ – “అంతా సిరివెన్నెలే చేసినది. నేనందించింది కొద్ది తోడ్పాటు మాత్రమే. సాధారణంగా గెలుపు తనవల్లేననీ, పరాజయం అందరివల్లా అనీ జనం భావిస్తారు. సిరివెన్నెల మాత్రం తన గెలుపు అందరి వల్లా అని చెప్పడం ఆయన సంస్కారం” అన్నారు.
- గురువుగారు సినిమా రంగంలోకి వచ్చి పాతికేళ్ళు పూర్తైన సందర్భంగా మాస్టారు ఒక 4 రోజుల కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. 3 రోజులు విశాఖలో – సిరివెన్నెల అమ్మపైన, స్నేహం పైన, యువత పైనా, సమాజం పైన ఇలా వివిధ అంశాలపై రాసిన పాటలు గానం చేస్తారు. 1 రోజు హైదరాబాద్ లో సిరివెన్నెల తను పనిచేసిన దర్శకులు, సంగీత దర్శకులూ, హీరోల గురించి అనుభవాలను వివరిస్తారు.
- మమ్మల్ని మాస్టారికి పరిచయం చేస్తూ – “వీరంతా చక్కని కుర్రాళ్ళు. యూత్ అంటే ఈ ఒక్క సినీ పరిశ్రమకే సదాభిప్రాయం లేదు. వాళ్ళు తాగుబోతులనీ, తిరుగుబోతులనీ, ఎందుకూ పనికిరారన్నట్టే చూపిస్తారు. వీళ్ళందరిలో ఏ ఒక్క అవలక్షణం లేదు. వీరే నాకు దక్కిన నిజమైన అవార్డులు. అంతే కానీ ఆ అవార్డు చెక్కముక్కలు కాదు” అన్నారు. గురూజీకి మాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికి అయినా నాలో కొన్ని మార్చుకోవాలన్న సంకల్పం కలిగింది.
- గురువుగారు ఈ మధ్యే రాసిన పాటలోని ఓ రెండు వాక్యాలు ఆయనే హాస్యనటులు బ్రహ్మానందం గారితో ఫోన్‌లో మాట్లడుతున్నప్పుడు చెప్పడం జరిగింది –
మన భాష మనసుకు తెలుసా
మదిఘోష మనిషికి తెలుసా!
- రామ జోగయ్య శాస్త్రి గారు వారి ఇద్దరి అబ్బాయిలతో వచ్చారు. వారి రెండవ అబ్బాయిని (పదేళ్ళు ఉంటాయేమో) సిరివెన్నెల మాకు పరిచయం చేస్తూ – “వీడు child prodigy. ఎలాంటి సన్నివేశం అయినా చెప్పండి, వెంటనే ట్యూన్ చెప్పేస్తాడు. హార్మోనియం పెట్టె ముందేసుకుని, ట్యూన్లు ఇవ్వడం అంటే అదో గొప్ప ఘనకార్యం అన్నట్టు ఫోజులు కొట్టే మ్యూజిక్ డైరెక్టర్లకి వీడిని చూసి బుద్ధి రావాలి.” అన్నారు. తర్వాత ఈ child prodigy తన ప్రతిభని మా ముందు ప్రదర్శించి అబ్బురపరిచాడు. గురువుగారు ఇచ్చిన ఒక అసాధారణ సన్నివేశానికి, గురువుగారు చెప్పడం పూర్తిచెయ్యగానే ఆశువుగా “తననా”లతో ట్యూన్ కట్టాడు. మేము గురువుగారి రూం నుండి బయటకి వచ్చాక RJS గారు ఈ అబ్బాయికి ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టడం చూసి ముచ్చటేసింది.
తెలియడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. గురువుగారి వాక్కులో శక్తి ఉంది. తెలిసిన విషయాలనే, ఆయన ద్వారా విన్న విషయాలనే అయినా మళ్ళీ ఒకసారి వింటే కొత్త ఉత్సాహం కలుగుతుంది. తీర్థం ప్రాప్తమయ్యింది, ప్రస్థానం మొదలుపెట్టాలి.