తికమక మకతిక పరుగులు ఎటుకేసి?

చిత్రం: శ్రీ ఆంజనేయం
రచన: సిరివెన్నెల
సంగీతం: మణి శర్మ
గానం: బాలు
అసలు మతం అంటే ఏమిటి? దేవుడంటే ఎవరు? మనం చేసే పూజల వెనుక పరమార్థమేమిటి? ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి – దేవుడూ, మతం పేరుతో మారణ హోమాలు జరుగుతున్న ఈ రోజుల్లో. జనాలకి మంచీ చెడూ తెలిపి, సరి అయిన దారిలో నడిపే సామాజిక కర్తవ్యం ప్రతి మతానికీ ఉంటుంది. ఈ విషయం కాస్త  dry subject కావడం వల్ల, చిన్న చిన్న కథల ద్వారా, దైవాంశ సంభూతులైన వ్యక్తుల జీవితాల ద్వారా జనరంజకంగా చెప్పే ప్రయత్నం జరిగింది. ఎప్పుడైతే ప్రజలు కథలో నీతినీ, తమ కర్తవ్యాన్నీ మరిచి, దేవుడనే వాడు ఒకడు స్వర్గంలోఉంటాడు, గుడికి వెళ్ళి వాడికి మనం దండం పెడితే చాలు అనుకుంటారో, అదే భక్తి అనుకుంటారో, అప్పుడు వాళ్ళని –

రాముణ్ణైనా కృష్ణుణ్ణైనా కీర్తిస్తూ కూర్చుంటామా?
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా!

అని నిదుర లేపే ఒక “సిరివెన్నెల” లాంటి కవి కావాలి.

“ఒక్కడు” సినిమా పాటలో ఈ అంశాన్ని రేఖా మాత్రంగా స్పర్శించిన సిరివెన్నెలకి, “శ్రీ ఆంజనేయం ” సినిమాలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం దక్కింది – “తికమక మకతిక” అనే పాటలో. రామాయణం ఇచ్చే సందేశాన్ని ఈ పాటలో సిరివెన్నెల అద్భుతంగా ఆవిష్కరించారు.

పాట మొక్కుబడిగా గుడికి వెళ్ళి, మన కోరికలన్నీ మొరపెట్టుకుని, కానుకలూ అవీ ఇచ్చి దేవుడిని కరుణింప చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళ భక్తిని ప్రశ్నిస్తూ మొదలు అవుతుంది:

తికమక మకతిక పరుగులు ఎటు కేసి?
నడవరా నరవరా నలుగురితో కలిసి
శ్రీ రామచంద్రుడిని కోవెల్లో ఖైదు చేసి
రాకాసి రావణుడిని గుండెల్లో కొలువు చేసి
తల తిక్కల భక్తితో తైతక్కలా మనిషీ?

“తికమక పరుగులు” అని చెప్పడం ద్వారా ప్రస్తుతం మనం ఉన్న  “confused fast life”  ని కవి ప్రస్తావిస్తున్నాడు. అయితే ఈ పరుగులు “ఎటు కేసి”? ఏమో, ఎవరికీ (చాలా మందికి) తెలియదు! ఈ ప్రశ్న ద్వారా కవి మనని ఆలోచింపజేస్తాడు – “అవును. ఎటు కేసి? ” అని మనలో మనం అనుకునేటట్టు. రాముడు మన మనసులో ఉంటాను అంటే, ఆయన్ని మనం గుడిలో బంధించేశాం ! పాపం ఆయన ఇంకా మన మనసులోకి వచ్చి కొలువుండాలనే అనుకుంటున్నాడు; కాని మనమే ఆయనతో – “వద్దులే! నీకు ఎందుకు అంత శ్రమ! గుడిలో ఉండు. అప్పుడప్పుడు వచ్చి చూసి పోతాం లే” అన్నాం !!  మనసులోనే రాముడుంటే, ఇంక గుడికి వెళ్ళి ఆయన్ని వెతకాల్సిన పని ఏమిటి? అయితే మన మనసులో రాముడు లేడు, రావణుడు ఉన్నాడు. మనలో ఉన్న క్రోధాలూ, ద్వేషాలూ, చెడు గుణాలూ….కలిపితే ఈ రావణుడు. కవి ఈ దారి వదిలి కొత్త దారిలో మనని నడవమంటున్నాడు. నలుగురినీ కలుపుకుని మరీ నడవమంటున్నాడు – అంటే మంచి పదుగురికీ చెప్పడం ద్వారా సమాజానికి శ్రేయస్సు కలిగించండి అని చెప్పడం. అయితే ఏ దారిలో నడవాలి? ….. రాముడి దారిలో. ఏమిటి ఆ దారి అంటే –

వెదికే మజిలీ దొరికే దాకా, కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా
క్షణమైనా నిన్ను ఆపునా?
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన!
బెదురంటూ లేని మది ఎదురు తిరిగి అడిగేనా
బదులంటూ లేని ప్రశ్న లేదు లోకాన !
నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ….

సీతని వెదకాలి. చుట్టూ అరణ్యం , దారీ తెన్నూ తెలియదు. ప్రాణ సమానమైన భార్యకి దూరం కావడం ఎంతో పెద్ద శోకం. కన్నీళ్ళు ధారాపాతంగా వస్తున్నాయి రాముడికి. అయితే బాధలోనే ఉండిపోయాడా రాముడు? ఇక బ్రతుకంతా చీకటే అని ఆగిపోయాడా? వెదికే మజిలీ (సీత) దొరికే వరకూ, కష్టాలూ నష్టాలూ ఓర్చి, చివరకి జాడ కనుక్కుని, సముద్రాన్ని దాటి లంకని చేరడానికి వారధి సైతం సాధించి, సీతని తిరిగి గెలుపొందాడు. ఈ విషయాన్ని – “కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన” అని కవి చాలా అద్భుతంగా చెబుతాడు. అయితే ఈ సాధనకి కేవలం పట్టుదల ఉంటే సరిపోదు “ధైర్యం ” కూడా కావాలి. ధైర్యం అంటే “భయం లేక పోవడం “. ఏమవుతుందో ఏమో, సాధిస్తానో లేదో, ఇన్ని కష్టాలు నాకే ఎందుకు రావాలి, ఏమిటి నా పరిస్థితి…. ఇలా ఆలోచించే మనసు ఎప్పుడూ సమస్యలకి పరిష్కారం కనుక్కోలేదు. ఈ భయం చెదని ఆదిలోనే తుంచకపోతే అది మనసుని పూర్తిగా తొలిచేస్తుంది. ఎప్పుడైతే మనసులో భయం ఉండదో, అప్పుడే మనసు సరిగ్గా ఆలోచించగలుగుతుంది, ప్రశ్నలకి బదులు పొందగలుగుతుంది. ఇది నిజానికి గొప్ప  “spiritual truth”  “బెదురంటూ లేని మది ఎదురు తిరిగి అడిగేనా, బదులంటూ లేని ప్రశ్న లేదు లోకాన” అని ఈ విషయన్ని శాస్త్రి గారు చాలా  powerful  గా గొప్ప ఆత్మ విశ్వాసంతో చెబుతారు. ఈ పైన చెప్పిన లక్షణాలు ఎవరి సొంతమో అతడు శోకాన్ని కూడా శ్లోకంలా మార్చుకుంటాడు. (శోకంలో శ్లోకం అనడం కూడా రామాయణాన్ని గుర్తుతెచ్చేదే. వాల్మీకి ఒక పక్షి జంట ఆవేదన చూసి పొందిన శోకంలో రామాయణం మొదటి శ్లోకం ఆశువుగా వెలువడింది అంటారు)

రాముడి కథ కష్టాలనీ, నష్టాలనీ ఎదురుకుని లక్ష్యాన్ని సాధించే స్థైర్యాన్ని గురించి కాక మరి ఇంకేమి చెబుతుంది? మనిషిని ధర్మపథంలో నడవమని చెబుతుంది. ధర్మం అంటే  simple  గా చెప్పాలంటే – “ప్రపంచానికి హితం చేసేది” అని అర్థం. ధర్మపథంలో నడిచే వాడు సామాజిక శ్రేయస్సు కోసం అవసరమైతే తన సుఖాలనీ, తను పొందిన వాటినీ వదులుకోడానికి అయినా సిద్ధపడతాడు. “రామో విగ్రహవాన్ ధర్మః” అన్నారు. అంటే రాముడు ధర్మస్వరూపం. ఈ సంగతి సీతారామ శాస్త్రి గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి –

అడివే అయినా, కడలే అయినా, ధర్మాన్ని నడిపించు పాదాలకి
శిరసొంచి దారీయదా?
అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా!
ఈ రామగాథ నువ్వు రాసుకున్నదే కాదా?
అది నేడు నీకు తగు దారి చూపను అందా?
ఈ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషీ….

సముద్రం మహోగ్రంగా ఉంది. వంతెన వేసి లంకను చేరాలి. అయితే సముద్రం శాంతిస్తెనే అది సాధ్యం. ఎలా మరి? రాముడికి “ధర్మ ఆగ్రహం ” కలిగింది. సముద్రంపై విల్లు ఎక్కు పెట్టాడు. అంటే! అంతటి కడలీ రాముడి ముందు దాసోహమని మోకరిల్లింది. వంతెన కట్టడానికి దారి ఇచ్చింది. అవును మరి! ధర్మాన్ని నడిపించే రాముడి పాదాలకి అడివైనా సముద్రమైనా శిరసొంచి నమస్కరించాలి కదా! రాముడు మాములుగా రాజు అయిపోతే పెద్ద విశేషం లేదు. అయితే ధర్మం కోసం నిలబడి, అరణ్యవాసం చేసి, రాక్షస సమ్హారం గావించి తర్వాత రాజు అయితే, ప్రజలు కూడ అతని ధర్మ మార్గాన్ని పాటిస్తారు. రామ పట్టాభిషేకం , ధర్మ పట్టాభిషేకం అవుతుంది, లోకహితం చేస్తుంది. అటువంటి రాముడి పాదుకలకి అయినా పట్టాభిషేకం చెయ్యొచ్చు (భరతుడి ఉదంత ప్రస్తావన). రామ కథని చెప్పుకుంటూ ప్రజలు మంచి దారిలో నడవొచ్చు.

ఈ రాముడి కథ వాల్మీకి లోకక్షేమం కోసం రాశాడు. ఇది మనుషుల సౌభాగ్యం కోసం మనుషులే రాసుకున్న దేవుని కథ. మానవ సంబంధాలని గొప్పగా నిర్వచించి, ధర్మాన్ని తెలిపిన కథ. ఇప్పటికీ, ఎప్పటికీ ఈ కథ మనకి కర్తవ్యాన్ని తెలిపే దారి చూపెడుతుంది. మనమే ఈ విషయం మర్చిపోయాం. రాముడి అడుగుజాడలని విస్మరిస్తున్నాం. సముద్రకెరటం వస్తే చెరిగిపోయే ఇసుక జాడలు కావవి. కాలాలు మారినా, చీకట్లు కమ్మినా చుక్కలై మెరిసే వెలుగురేఖలు ఆ జాడలు. నిదురమాని తిలకిస్తే కనబడతాయ్.  మనసు గెలిచి అడుగేస్తే వశమవుతాయ్ !

ఈ పాట గురించి ఆలోచిస్తున్న కొద్దీ మరింతగా అర్థం అయ్యి మనసు అనుభూతితో తడిసి పోతుంది. ఆ నీటితో సిరివెన్నెల కాళ్ళు కడగాలనిపిస్తుంది. అయితే అనుభూతి చెందడమే ఈ పాట లక్ష్యం కాదు. పాట సారాన్ని గుర్తుంచి, కాస్తైనా మనం మారి, సమాజ శ్రేయస్సు కోసం మన వంతు సాయం చేసి, ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే కవిగా సిరివెన్నెల తన లక్ష్యం నెరవేరినట్టు భావిస్తారు.