విన్నవీ నచ్చినవీ: అరుంధతి

(కొత్తగా వచ్చిన తెలుగు సినిమా పాటల్ని వింటూ సాహిత్యాన్ని గమనిస్తుండడం నాకు ఇష్టం. ఇలా విన్న వాటిల్లో నన్ను ఆకట్టుకున్న వాక్యాలను మీతో పంచుకునే ప్రయత్నమే ఈ “విన్నవీ – నచ్చినవీ” అన్న శీర్షిక. )

సంగీతం: కోటి
పాటల సంఖ్య: 4
సాహిత్యం: వేటూరి (1), నారాయణ రెడ్డి (1), అనంత శ్రీరాం (2)

సాహిత్య పరంగానూ, సంగీత పరంగా కూడా అన్ని పాటలూ చక్కగా ఉన్నాయ్ ఈ సినిమాలో. నాకు నచ్చిన కొన్ని భావాలు:

భూ భూ భుజంగం ధిత్తై తరంగం
మృత్యువు మృదంగం నా అంతరంగం
నాలో జ్వలించె తరం తరంగా
నటనై చలించె నరం నరంగా
పగతో నటించె జతిస్వరంగా

పాట పల్లవి: భూ భూ భుజంగం
రచన: వేటూరి
విశేషాలు: చిత్ర అద్భుతంగా గానం చేసిన ఈ పాట రౌద్ర కరుణ రసభరితంగా ఉంది. క్లిష్టమైన బాణీకీ (ముఖ్యంగా పల్లవిలో) వేటూరి అలవోకగా పదాలు పొదిగారు.

ఎంత దీక్ష పూనినావమ్మా
గుండెలో నిప్పులే నింపినావమ్మా
త్యాగమంటె నీదమ్మా
నరకమే కొంగులో ముడిచావమ్మా
నిన్ను చూసి మృత్యువుకే
జేజమ్మా! కళ్ళు చెమ్మగిల్లినాయమ్మా!!
ఈ జారుతున్న రక్తధారలే నీ తెగువకు
హారుతులు పట్టెనమ్మా

పాట పల్లవి: కమ్ముకున్న చీకట్లోన
రచన: సి.నారాయణ రెడ్డి
విశేషాలు: చాలా కాలం తరువాత సినారె గారు రాసిన సినిమా పాటలో ఉదహరించిన వాక్యాలు ఆయనలోని కవినీ, ప్రతిభనీ చూపెడతాయి. మిగితా పాట సరళంగా ఉండడం చూస్తే సినిమా పాట పరిమితులు ఎరిగి ఈయన పాటలు రాస్తారనిపిస్తుంది.

ఇన్నాళ్ళు వేచింది మా ముంగిలి
ఇలా సందళ్ళే రావాలని
ఇన్నేళ్ళు చూసింది మా మావిడి
ఇలా గుమ్మంలో ఉండాలని

పాట పల్లవి: చందమామ నువ్వే నువ్వే
రచన: అనంత శ్రీరాం
విశేషాలు: ఈ మధ్య అన్ని సినిమా పాటల్లో వినిపిస్తున్న ఈ యువ ప్రతిభాశాలి, commercial అయిపోయి, పాటలు “రాసి పారేస్తున్నట్టు” అనిపిస్తోంది నాకు. ఈ సినిమాలో మాత్రం భావయుక్తంగా రాశాడు. అయితే అనంత్ పాటల్లో ఒకటో రెండో ఇంగ్లీష్ మరియూ హిందీ వాక్యాలు ఉండడం రివాజుగా మారింది. అది ఈ సినిమాలోనూ గమనించొచ్చు.