సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఉన్న ఒక క్రెడిట్ ఏమిటంటే ఏ ఇబ్బందీ లేకుండా అందరి ముందూ పాడగలిగే ఎన్నో శృంగారగీతాలు రాసి ఉండడం. మిగతా గీతరచయితలు లలితమైన శృంగారగీతాలు రాయలేదని కాదు కానీ, సిరివెన్నెల ఈ విషయంలో ఎక్కువ మార్కులు సంపాయిస్తాడు. కొన్ని పాటలకి సాహిత్యం చాలా మర్యాదగానే ఉన్నా, చిత్రీకరణ నాటుగా ఉండడం వల్ల అవి చెత్తపాటలుగా ముద్రపడిపోతాయి. “శ్రీ ఆంజనేయం” సినిమాలోని “పూల ఘుమఘుమ” అనే పాట ఇలాంటిదే. గొప్ప భావుకతతో రాసిన ఈ పాటని ఫక్తు మసాలా పాటలా చిత్రీకరించి దర్శకుడు కృష్ణవంశీ తీరని అన్యాయం చేశాడు! సంగీతపరంగా అతి చక్కని మెలొడీ ఇచ్చిన మణిశర్మకి చిత్రీకరణకి తగ్గట్టు ఇంటర్లూడ్లలో రసభంగం కలిగించే సంగీత విన్యాసాలు చేయాల్సి వచ్చింది ! ఫలితంగా “ఛార్మి” కంటే ఎంతో చార్మింగ్‌గా ఉన్న సాహిత్యానికి తగినంత పేరు రాలేదు! ఈ పాట గురించి కొన్ని ముచ్చట్లు.
పాట ఆడియో లింకు: పూల ఘుమఘుమ (raaga.com)
పాట సాహిత్యం:
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా?
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా?
ప్రేమంటే పామని బెదరాలా ధీమాగా తిరగరా మగరాయడా!
భామంటే చూడని వ్రతమేలా పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా!
మారనే మారవా మారమే మానవా
మౌనివా మానువా తేల్చుకో మానవా
|| పూల ఘుమఘుమ ||
చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలుజడ చుట్టుకొని మొగలిరేకా నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో
|| పూల ఘుమఘుమ ||
ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్తపున్నాగనై
జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండననీ పొగడపూదండనై
నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమిచెంగల్వనై
మోజులే జాజులై పూయనీ హాయిని
తాపమే తుమ్మెదై తీయనీ తేనెని
|| పూల ఘుమఘుమ ||
ఓ ముద్దుగుమ్మ తనకు నచ్చిన అబ్బాయిని ఎంత అందంగా కవ్విస్తోంది అన్నది ఈ పాటలో విషయం. ప్రేమలో శృంగారాన్ని కలిపి, ఆ శృంగారభావాన్ని ఎంత అందంగా, మృదువుగా వ్యక్తపరుస్తోందో ఈ పాటలోని లలన! మనసులోని మాటని ఇంత రమణీయంగా వ్యక్తీకరించడం కేవలం అమ్మాయిల విషయంలోనే సాధ్యం. ఒక అబ్బాయి ఎంత భావుకతతో పాడినా ఇంత సొగసుని సాధించలేడు!
పల్లవి మొదలుపెట్టడమే ఎంతో గడుసుగా మొదలుపెట్టారు సిరివెన్నెల – పూల ఘుమఘుమనీ, తేనెమధురిమనీ కాదని ప్రవరాఖ్యుడిలా వెళ్ళిపోకు అని. చరణాల్లో పువ్వుల ప్రస్తావన ఉంది కాబట్టి “పూల ఘుమఘుమ” అంటూ మొదలుపెట్టడం చక్కగా ఉంది. “మారనే మారవా” అంటూ సాగే అనుపల్లవిలో శబ్దార్థ విన్యాసాలు ముద్దొచ్చేలా ఉంటాయి. అమ్మాయి ఇంత అందంగా పల్లవి పాడితే వలలో పడని అబ్బాయి ఉంటాడా అసలు?



చరణాల్లో ప్రతి భావాన్నీ ఒక పువ్వుగా పరిమళింపజేశారు. “అరవిందము” అంటే కమలం/తామర, ఉదయం వికసించేది. “బంధమై అల్లుకో” అంటే ప్రేమబంధమే! “అరవిచ్చి అరవిందమయ్యే అందం” అనడం ఎంతో బాగుంది. అరవిచ్చడం (అంటే సగమే విచ్చడం) సంకోచాన్ని, సిగ్గుని సూచిస్తోందనుకుంటే, కమలంలా నిండుగా వికసించడానికి “నీ ప్రేమ అనే నమ్మకాన్ని” ఇవ్వు అనడం. “అరవిచ్చి” అన్నది అబ్బాయి పరంగా కూడా వాడి ఉండవచ్చు – “మాస్టారూ, కొంచెం మొహమాటం తగ్గించుకుని, నా దగ్గరగా రండి” అన్న అర్థంలో. “పెదాలపై ముద్దుపెట్టుకుని తీపిని తోడుకో” అనడానికి “మల్లెలే తుంచుకో” అనడం ఎంత భావుకత! ఇంత నాజుగ్గా అందంగా వాడిన మాటలే ముద్దుకంటే తియ్యగా ఉంటే ఇక వేరే ముద్దులెందుకని? వాలుజడ-మొగిలిరేకులు అన్నది ఒక అందమైన తెలుగింటి కాంబినేషన్. మొగలిపువ్వు పైన బిరుసుగా ఉన్నా, లోపలి రేకులు చాలా మృదువుగా పరిమళభరితంగా ఉంటాయి. “అబ్బాయి గారూ, మీలోని బెరుకుని పక్కనపెట్టి మనసులోపలి దాగిన మృదువైన ప్రేమని బైటపెట్టండి” అన్న సూచన. అందంగా నాతో కలిసి రా, సరదాగా ప్రేమకథ నడిపించుకో అన్న భావం.
మొదటి చరణం అంతా ఒక ఎత్తైతే, చివరి లైన్లు మాత్రం మరో ఎత్తు. ఒక కవ్వింత, ఒక ప్రణయభావం లేకపోతే పడుచుదనపు ఉత్సాహానికి అర్థం ఏమిటని? “వయసులో పరవశం” అంటే ఇదే. ఎంత మొహం తిప్పేసుకున్నా, అబ్బాయి వయసులో ఉన్న వాడే కదా! నన్ను మామూలుగా కాదు, వయసులోని పరవశం నిండిన కళ్ళతో చూడు. అప్పుడు నా అందం నీలో కలవరం కలిగించకపోతే అడుగు! ఒక్కసారి నా సొగసులో చిక్కుకున్నావా ఇక జీవితమంతా పరిమళభరితం – ప్రేమ పరిమళం, సొగసు పరిమళం, బ్రతుకు పరిమళం, అంత పరిమళమే! ఎంత అద్భుతంగా చెప్పాడండీ సిరివెన్నెల ఈ భావాన్ని!


రెండో చరణం మొదటిలైన్లలో ఓ చమత్కారం చేశారు సిరివెన్నెల. “నీ ప్రతి ముద్దుతో నన్ను పున్నాగ పువ్వులా ఉదయించనీ” అంటూ ప్రారంభించి, “మత్తెక్కి అలసి నిద్రగన్నేరులా నీ కౌగిలిలో నిద్రించనీ” అంటూ ముగిస్తాడు. అంటే మెలకువ/మగత, పగలూ/రాత్రీ అనే పరస్పర వ్యతిరేకభావాలు రెండింటినీ శృంగారపరంగా పక్కపక్కనే చెప్పడం. విడమరిచి చెప్పకుండా ఊహకి వదిలేయడమే శృంగారరచనకి వన్నెతెస్తుంది. ఈ కిటుకు తెలిసిన ఘటికుడు సిరివెన్నెల! ఈ లక్షణాన్ని కూడా మొదటి రెండులైన్లలో చూడొచ్చు. తర్వాత లైన్లలో అనురాగాన్నీ, ప్రేమనీ పలికిస్తాడు. “నీ గుండెపై పొగడపూడండలా ఒదిగుండనీ” అనడం ఎంత లలితమైన వ్యక్తీకరణ! ఇక్కడ నన్ను గుండెల్లో పెట్టి చూసుకో అన్న ధ్వని కూడా ఉంది. నీ కంటికోనేట చెంగల్వనై నిలిచిపోనీ అంటుంది అమ్మాయి వెంటనే. ఊహించుకుంటే ఎంతో అందంగా ఉంది ఇది. “నీ కళ్ళలో నేనే కొలువుండాలి, ఇంకే అమ్మాయి వంకా నువ్వు కన్నెత్తి చూడకూడదు” అన్న హెచ్చరిక కూడా మరి ఉండే ఉండొచ్చు ఇలా అనడంలో! ఆఖరి లైన్లలో మళ్ళీ శృంగారం! మోజులన్నీ జాజులై హాయిని పూయాలట. వినడానికి ఎంత హాయిగా ఉందో! “తాపమే తుమ్మెద కాగా తేనెని ఆస్వాదిద్దాం” అంటూ ముగుస్తుందీ పాట. సాధారణంగా శృంగార గీతాల్లో పురుషుడిని తుమ్మెదతో, స్త్రీని పువ్వుతో పోల్చడం చూస్తూ ఉంటాం. ఇక్కడ సిరివెన్నెల మాత్రం జంట తుమ్మెదలమై ప్రణయ మకరందాన్ని తాగి పరవశిద్దాం అన్న అర్థాన్ని పలికించారు. దటీజ్ సిరివెన్నెల! రొటీన్ కి భిన్నంగా రాయడానికి ఎంతో తపిస్తారు.


స్పీడుకి మనం దాసోహమైపోయిన తరువాత, జీవితంలో లేతభావాలకి చోటు లేకుండా పోయింది. కవిత్వాన్ని అర్థం చేసుకునే తీరికా, ఓపికా ఎవరికీ లేకపోవడంతో సినిమా పాటలనుంచి కవిత్వం మరుగైపోయింది. స్వచ్చమైన శృంగారం సిగ్గుపడి మాయమైపోయింది. పువ్వులూ, పరిమళాలూ, తెలుగుదనాలు మన జీవితాల్లోంచి, తెలుగు సినిమా పాటల్లోంచి సవినయంగా సెలవు తీసుకున్నాయి. ఎడారిలో ఒయాసిస్సులా ఎప్పుడో ఇలాటి పాటలు వస్తాయి. వచ్చినప్పుడు ప్రసాదంలా కళ్ళకద్దుకుని పుచ్చుకోవడం, పాట వెనుక ఉన్న వ్యక్తులని స్మరించుకోవడమే మనం చెయ్యగలిగేది! ఈ పాట వరకూ హీరో సిరివెన్నెల. పూలఘుమఘుమల తేనెబాలునికీ, పసిడివెన్నెలల నిండు చంద్రునికీ ప్రణామాలు! జన్మదిన శుభాకాంక్షలు!
(మే 20, సిరివెన్నెల పుట్టినరోజు)
awesome lyrics
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg