గౌతమిపుత్ర శాతకర్ణి పాటలు

“కంచె” చిత్రంతో క్రిష్ – సిరివెన్నెల – చిరంతన్ భట్ కలిసి సృష్టించిన సంగీత సాహితీ దృశ్యకావ్యానికి పరవశించిన వాళ్ళలో నేనొక్కణ్ణి. మళ్ళీ అదే కాంబో “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రంలో కుదిరింది కాబట్టి ఈ సినిమా ఆడియోపై నా అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆల్బం మొదటిసారి విన్నప్పుడు బాణీలు అంతగా ఎక్కలేదు కానీ వినగా వినగా ఆకట్టుకునే సంగీతం. సిరివెన్నెల సాహిత్యం కూడా చక్కగా అమరింది.

చాలా కాలం తర్వాత ఉదిత్ నారాయణ్ గొంతు వినిపించిన “ఎకిమీడా నా జతవిడనని వరమిడవా, తగుతోడా కడకొంగున ముడిపడవా” అనే ప్రణయ యుగళ గీతం వినగానే ఆకట్టుకుని అలరించింది. నాకు ఆల్బంలో బాగా నచ్చిన పాట ఇదే. “ఎకిమీడు” అంటే రాజు అని అర్థం కనిపిస్తోంది నిఘంటువులో. ఇలాంటి అరుదైన పదాలను వాడిన సిరివెన్నెలని మెచ్చుకోవాలి. హుషారైన ట్యూన్ కుదిరిన ఈ పాటలో సిరివెన్నెల చాలా చక్కని పదాలని ట్యూన్‌కి బాగా కుదిరేటట్టు వాడి మురిపించారు. పల్లవిలోనే “డ” అక్షరంతో అందమైన వృత్త్యనుప్రాస వేసిన సిరివెన్నెల, “ఎండో వానో ఎవరికెరుక? ఏ వేళాపాళా ఎరుగననీ, ప్రతీరోజిలా నీతో పాటే నడుస్తు గడిస్తే ఎన్నాళ్ళైతేనేం, ఎటైతేనేం?” అంటూ ఎండైనా వానైనా ఏ మాత్రం చెదరని అనుబంధాన్ని అందంగా పలికించారు.

“గణగణ గణగణ గుండెలలో జేగంటలు మ్రోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయేలా, కణకణ కణకణ కన్నులలో కార్చిచ్చులు రేగెను చిక్కటి చీకటి ఎర్రగ రగిలించేలా” అనే పాట యుద్ధం చెయ్యడానికి వెళ్తున్న సైన్యం ఆలపించే యుద్ధగీతంలా ఉంది. ట్యూన్ నడక, సాహిత్యం చూస్తే “బాజీరావ్ మస్తానీ” చిత్రంలో “మహలింగ” పాట గుర్తొచ్చింది. ఆ పాటంత ఆకట్టుకోకపోయినా మంచి ట్యూనే. సిరివెన్నెల తన సాహిత్యంతో వీరరసాన్ని బాగా పలికించారు. “కీడంటే మన నీడే కదరా, నదురా బెదురా ముందుకు పదరా” వంటి పొందికైన పదాలు కలిగిన వాక్యాలు, చక్కని భావాలు ఉన్న పాట.

బాలూ గొంతులో వినిపించే శృంగార యుగళ గీతం “మృగనయనా భయమేలనే”. ఎన్నేళ్ళైనా కుర్రగానే ఉన్న బాలూ గొంతు ఈ పాటకి వన్నె తెచ్చింది. ఈ యుగళ గీతంలోనూ శ్రేయా ఘోషల్ మధురంగా గొంతు కలిపింది. పాటలో వినిపించే హిందుస్తానీ ఆలాపనలు బావున్నాయి. సాహిత్యపరంగా చూస్తే “మృగనయనా” వంటి చక్కని పదాలతో సిరివెన్నెల రాసిన పాట మురిపించింది. ముఖ్యంగా “అధరమదోలా అదిరినదేలా, కనుకొలకుల ఆ తడి తళుకేలా?” అంటూ సాగిన పల్లవి బాగా కుదిరింది. చరణంలో – “నా నరనరమున ఈ వెచ్చదనం, నా పౌరుషమా, నీ పరిమళమా?” అంటూ రాజసాన్నీ శృంగారాన్నీ కలిపిన భావం బావుంది.

“సాహో సార్వభౌమా సాహో” అన్న పాట శాతకర్ణి శౌర్యాన్నీ ఘనతనీ వర్ణించే పాట. మంచి ఎనెర్జీ ఉన్న ట్యూన్ ఆకట్టుకుంది. ఆర్కెస్ట్రైజేషన్ కొంచెం “కృష్ణం వందే జగద్గురుం” చిత్రంలో “జరుగుతున్నది జగన్నాటకం” పాటని గుర్తు తెచ్చింది. “కాలవాహిని శాలివాహన శకముగా ఘనకీర్తి పొందిన సుప్రభాత సుజాతవహ్ని, గౌతమీ సుత శాతకర్ణి, బహుపరాక్!” అంటూ ఎత్తుగడలోనే అద్భుతమైన పదభావచిత్రంతో మొదలెట్టిన సిరివెన్నెల పాటంతా అదే జోరుతో దూసుకెళ్ళారు.

ఆఖరుగా వినిపించే “సింగముపై లంఘించిన బాలుడి పేరు శాతకర్ణి” అన్న పాట బుర్రకథలా సాగుతూ శాతకర్ణి కథని చెప్పే పాట. మాటల రచయిత “సాయి మాధవ్” ఈ పాటతో గీతరచయితగా కూడా తన సత్తా చాటుకున్నారు. హృదయానికి హత్తుకునేలా రచన సాగింది. అయితే హిందీ చాయలతో సాగిన బాణీ, గాయకుడు “విజయ్ ప్రకాశ్” తెలుగు ఉచ్చారణా ఈ పాటని “తెలుగు బుర్రకథ” లా అనిపించనివ్వలేదు.

మొత్తంగా చూస్తే ఈ సినిమా పాటలు నేను ఊహించినట్టు “కంచె” అంత స్థాయిలో లేకపోయినా నిరాశ కలిగించలేదు.

రచయిత: Phanindra

I am an engineer by profession and a hobbyist writer. My literary interest started with analyzing lyrics of Telugu movie songs and I love Telugu lyricists Veturi and Sirivennela. I tried my hand at writing songs, poems and stories in Telugu. I also have an interest in spirituality/philosophy, self-help and management.

వ్యాఖ్యానించండి